Revised Common Lectionary (Complementary)
షీన్
161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.
కుమ్మరి మరియు బంకమట్టి
18 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవానుండి వచ్చినది: 2 “యిర్మీయా, కుమ్మరి వాని ఇంటికి వెళ్లు. నా వర్తమానం నీకు అక్కడ యిస్తాను.”
3 నేను కుమ్మరివాని ఇంటికి వెళ్లాను. ఆ కుమ్మరి తన సారె (చక్రం) పై కుండలు చేస్తున్నాడు. 4 బంకమన్నుతో అతడొక కుండను చేస్తున్నాడు. కాని ఆ కుండరూపులో ఏదో లోపం వచ్చింది. చేసే కుండను తీసివేసి ఆ మట్టితో కుమ్మరి మరో కుండను చేశాడు. తన చేతి వ్రేళ్లను నైపుణ్యంగా ఉపయోగించి తనుకోరిన రీతిగా కుండను మలిచాడు.
5 అప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది: 6 “ఇశ్రాయేలు వంశమా, నేను (యెహోవా) నీ విషయంలో కూడా అదేరీతిగా చేయగలనని నీకు తెలుసు. నీవు కుమ్మరి చేతిలో మట్టిలా వున్నావు. నేను కుమ్మరి వానిలా వున్నాను! 7 నేను ఒక దేశాన్ని గురించిగాని, ఒక సామ్రాజ్యాన్ని గురించి గాని మాట్లాడే సమయం రావచ్చు. నేనారాజ్యాన్ని పెరికి వేయగలనని చెప్పవచ్చు. లేదా, ఆ దేశాన్నిగాని, ఆ సామ్రాజ్యాన్నిగాని క్రిందికి లాగి నాశనం చేస్తానని నేను అంటాను. 8 అయితే ఆ దేశపు ప్రజలు మనస్సు మార్చుకొని తమ నడవడికను సరిచేసికోవచ్చు. ఆ దేశ ప్రజలు దుష్టకార్యాలు చేయటం మానివేయవచ్చు. అప్పుడు నా మనస్సును కూడా నేను మార్చుకుంటాను. ఆ దేశానికి బాధలు తెచ్చి పెట్టిన పథకాన్ని నేను అమలుపర్చను. 9 ఒక దేశాన్ని గురించి నేను ప్రస్తావించే మరో సమయంరావచ్చు. నేనా దేశాన్ని తీర్చిదిద్ది, దాన్ని సుస్థిర పరుస్తానని అనవచ్చు. 10 కాని ఆ దేశ ప్రజలు నాకు విధేయులుకాకుండా దుష్టకార్యాలు చేస్తూ ఉండవచ్చు. అప్పుడు ఆ దేశానికి చేయదలచుకున్న మంచి పనుల విషయంలో నేను పునరాలోచించవలసి వుంటుంది.
11 “కావున యిర్మీయా, యూదా ప్రజలకు, యెరూషలేము వాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడని చెప్పుము: ‘మీకు నేనిప్పుడే కష్టాలు సిద్ధం చేస్తున్నాను. మీకు వ్యతిరేకంగా పథకాలు తయారు చేస్తున్నాను. కావున మీరు చేస్తున్న దుష్టకార్యాలు చేయటం మానివేయాలి. ప్రతి ఒక్కడూ మార్పు చెందాలి. సత్కార్యాలు చేయటం మొదలు పెట్టాలి!’
యేసు విశ్వసించనివారిని హెచ్చరించటం
(లూకా 10:13-15)
20 ఆయన అనేక మహత్కార్యాలు చేసిన కొన్ని పట్టణాలు మారుమనస్సు పొందలేదు. కనుక యేసు వాటిని విమర్శించాడు. 21 “అయ్యో! కొరాజీనా పట్టణమా! అయ్యో! బేత్సయిదా నగరమా! నేను మీలో చేసిన అద్భుతాలను తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు ఏనాడో గోనెపట్టలు కట్టుకొని, బూడిదరాసుకొని మారుమనస్సు పొంది ఉండే వాళ్ళు. 22 కానీ, నేను చెప్పేదేమిటంటే తీర్పు చెప్పేరోజున తూరు, సీదోను నగరాలకన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు.
23 “ఇక, ఓ కపెర్నహూము నగరమా! నీవు ఆకాశానికి ఎక్కుతాననుకొన్నావా? అలా జరుగదు! నీవు మృత్యులోకానికి పడిపోతావు. నీలో చేసిన మహాత్యాలు సోదొమ నగరంలో చేసివుంటే అది ఈనాటికీ నిలిచి ఉండేది. 24 కాని నేను మీకు చెప్పేదేమంటే తీర్పుచెప్పే రోజున సొదొమ నగరానికన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు.”
© 1997 Bible League International