Revised Common Lectionary (Complementary)
షీన్
161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.
17 ఇదే సమయంలో యెహోవా ఏలీయాతో మాట్లాడాడు. (ఏలీయా తిష్బీయుడైన ప్రవక్త) యెహోవా ఇలా అన్నాడు: 18 “షోమ్రోనులో వున్న రాజైన అహాబు వద్దకు వెళ్లు. అతడు నాబోతుకు చెందిన ద్రాక్షతోటలో వుంటాడు. ఆ పొలాన్ని తన స్వాధీనం చేసుకొనటానికి అహాబు అక్కడికి వెళ్లాడు. 19 యెహోవా అంటున్నాడని నా మాటగా అతనికి ఈ విధంగా చెప్పు: ‘అహాబూ! నీవు నాబోతు అనే వానిని చంపావు. ఇప్పుడు నీవతని పొలం స్వాధీనం చేసుకుంటున్నావు. అందువల్ల నేను చెప్పేదేమనగా నాబోతు చనిపోయిన స్థలంలోనే నీవు కూడ చనిపోతావు. నాబోతు రక్తాన్ని నాకిన కుక్కలు అదే స్థలంలో నీ రక్తాన్ని కూడ నాకుతాయి!’”
20 తరువాత ఏలీయా అహాబు వద్దకు వెళ్లాడు. ఏలీయాను అహాబు చూసి, “నీవు మళ్లీ నావద్దకు వచ్చావు. నీ వెప్పుడూ నాకు వ్యతిరేకివై శత్రువులా ప్రవర్తిస్తున్నావు” అని అన్నాడు.
ఏలీయా ఇలా సమాధానమిచ్చాడు: “అవును, నేను మళ్లీ నిన్ను కలుసుకున్నాను. జీవితమంతా యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తూనే వచ్చావు. 21 అందువల్ల యెహోవా నీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను నాశనం చేస్తాను. నేను నిన్ను, నీ ఇంటిలోని ప్రతిబాలుణ్ణి, మరియు మగవారినందరినీ చంపేస్తాను. 22 నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి పట్టిన గతే నీ కుటుంబానికి కూడ పడుతుంది. రాజైన బయెషా కుటుంబంవలె నీ కుటుంబం కూడ అయిపోతుంది. ఆ రెండు కుటుంబాలూ సర్వనాశనం చేయబడ్డాయి. అదే విధంగా నీ కుటుంబానికి కూడ చేస్తాను. కారణమేమంటే నీవు నాకు కోపం కల్గించావు. ఇశ్రాయేలు ప్రజలు చెడుకార్యాలు చేసేటందుకు కూడా నీవు కారుకుడవయ్యావు. 23 ఇంకా యెహోవా చెప్పిన దేమనగా నీ భార్యయగు యెజెబెలు శవాన్ని యెజ్రెయేలు నగరంలో కుక్కలు పీక్కు తింటాయి. 24 నీ కుటుంబంలోని వాడెవడు నగరంలో చనిపోయినా వాని శవాన్ని కుక్కలు తింటాయి. వారిలో ఎవడు పొలాల్లో చనిపోయినా వానిని పక్షులు తింటాయి.”
25 అహాబువలె అన్ని తప్పుడు పనులు చేసినవాడు, అంత పాపం మూటగట్టు కున్నవాడు మరొక వ్యక్తి లేడు. అతని భార్య యెజెబెలు అతడా తప్పులు చేయటానికి కారకురాలయింది. 26 కొయ్య బొమ్మలను పూజిస్తూ, అహాబు ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. ఈ రకమైన పనినే అమోరీయులు కూడా చేశారు. అందువల్లనే యెహోవా ఆ రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
27 ఏలీయా మాట్లాడటం పూర్తి చేసిన తరువాత అహాబు చాలా ఖిన్నుడయాడు. తన విచారానికి సూచనగా తన బట్టలు చింపుకున్నాడు. తరువాత విచారసూచకంగా ప్రత్యేకమైన బట్టలు ధరించాడు. అహాబు భోజనం మానేశాడు. ఆ ప్రత్యేకమైన బట్టలతోనే నిద్రపోయాడు. అహాబు బహు దుఃఖంతో మిక్కిలి కలతచెందాడు.
28 ప్రవక్తయగు ఏలీయాతో యెహోవా ఇలా అన్నాడు: 29 “అహాబు నాముందు తనను తాను తక్కువ చేసుకుని వినమ్రుడైనట్లు నేను చూస్తున్నాను. అందువల్ల అతను బ్రతికియున్నంత కాలం నేనతనికి ఆపదలు కలుగజేయను. అతని కుమారుడు రాజు అయ్యేవరకు ఆగుతాను. అప్పుడు అహాబు కుటుంబానికి కష్టనష్టాలు కలుగజేస్తాను.”
ఆత్మల్ని పరిశీలించండి
4 ప్రియ మిత్రులారా! అన్ని ఆత్మల్ని నమ్మకండి. ఆ ఆత్మలు దేవునినుండి వచ్చాయా అన్న విషయాన్ని పరిశీలించండి. ఎందుకంటే, మోసం చేసే ప్రవక్తలు చాలామంది ఈ ప్రపంచంలోకి వచ్చారు. 2 యేసు క్రీస్తు దేవునినుండి శరీరంతో వచ్చాడని అంగీకరించిన ప్రతీ ఆత్మ దేవునికి చెందినదని దేవుని ఆత్మద్వారా మీరు గ్రహించాలి. 3 యేసును అంగీకరించని ప్రతి ఆత్మ దేవునినుండి రాలేదన్నమాట. అలాంటి ఆత్మ క్రీస్తు విరోధికి చెందింది. ఆ ఆత్మలు రానున్నట్లు మీరు విన్నారు. అవి అప్పుడే ప్రపంచంలోకి వచ్చాయి.
4 బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళకన్నా గొప్పవాడు. 5 క్రీస్తు విరోధులు ప్రపంచానికి చెందినవాళ్ళు. అందువల్ల వాళ్ళు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతారు. ప్రపంచం వాళ్ళ మాటలు వింటుంది. 6 మనం దేవునికి చెందిన వాళ్ళం. అందువల్ల దేవుణ్ణి తెలుసుకొన్నవాడు మన మాటలు వింటాడు. కాని దేవునికి చెందనివాడు మన మాటలు వినడు. దీన్నిబట్టి మనము ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో తెలుసుకోగలుగుతాము.
© 1997 Bible League International