Revised Common Lectionary (Complementary)
షీన్
161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.
నాబోతు ద్రాక్షతోట
21 రాజైన అహాబు భవనం షోమ్రోను నగరంలోవుంది. రాజభవనం దగ్గర ఒక ద్రాక్ష తోటవుంది. 2 ఒక రోజు నాబోతును పిలిచి అహాబు ఇలా అన్నాడు: “నీ పొలం నాకు ఇచ్చివేయి. నేను దానిని కూరగాయల తోటగా మార్చాలనుకుంటున్నాను. నీ చేను నా భవనానికి దగ్గరగా వుంది. దానికి బదులు దానికంటె మంచి ద్రాక్షతోట నీకు మరొకటి ఇస్తాను. లేదా, నీకు కావాలంటే దాని విలువ డబ్బు రూపంలో చెల్లిస్తాను.”
3 నాబోతు అది విని, “నా భూమిని నీ కెన్నడూ ఇవ్వను. ఇది నా పిత్రార్జితం” అని అన్నాడు.
4 అహాబు ఇంటికి వెళ్లాడు. నాబోతు పట్ల కోపంగా వున్నాడు. అతని మనస్సు కలతపడింది. యెజ్రెయేలు వాడైన నాబోతు చెప్పినది అతనికి గిట్టలేదు. (“నా పిత్రార్జితమైన భూమిని నీకివ్వను” అని నాబోతు అన్నాడు.) అహాబు పక్కపై పడుకున్నాడు. ముఖం తిప్పుకుని భోజనం చేయ నిరాకరించాడు.
5 అహాబు భార్య యెజెబెలు అతని వద్దకు వెళ్లింది. “ఎందుకు నీవు కలత చెంది వున్నావు? నీవెందుకు తినటం లేదు?” అని యెజెబెలు అడిగింది.
6 అహాబు ఇలా సమాధానం చెప్పాడు: “యెజ్రెయేలువాడైన నాబోతును అతని పొలం నాకిమ్మని అడిగాను. దాని పూర్తి ఖరీదు చెల్లిస్తానన్నాను. లేదా, అతను కావాలంటే వేరే పొలం ఇస్తానన్నాను. కాని నాబోతు అతని పొలం ఇవ్వటానికి నిరాకరించాడు.”
7 అది విని యెజెబెలు, “అది సరే! ఇశ్రాయేలుకు రాజువు నీవే కదా! పక్క మీది నుండి లేచి ఆహారం తీసుకో. నీకు హాయిగా వుంటుంది. నాబోతు పొలాన్ని నీకు నేనిప్పిస్తాను” అని అన్నది.
8 తరువాత యెజెబెలు కొన్ని ఉత్తరాలను అహాబు పేరు మీద రాసింది. వాటి మీద అహాబు సంతకం ఆమె చేసింది. అహాబు రాజముద్రను వాటిపై వేసి అంటించింది. ఆమె వాటిని నాబోతు నివసించే నగరంలో వున్న పెద్దలు, నాయకులకు ఇతర ముఖ్యమైన వ్యక్తులకు పంపించింది. 9 ఆమె పంపిన లేఖలో ఇలా వుంది:
“ప్రజలందరికి ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటించండి. తరువాత పట్టణంలోని ప్రజలందరినీ ఆ రోజు సమావేశపర్చండి. ఆ సమావేశంలో మనం నాబోతును గురించి మాట్లాడాలి. 10 నాబోతును గురించి ప్రజలకు అబద్ధాలు చెప్పగల కొందరిని సమావేశంలో వుండేలా చూడండి. నాబోతు రాజుకు, దేవునికి వ్యతిరేకంగా దూషణ భాషణ చేయగా తాము విన్నట్లు ప్రజలకు వారు అబద్ధం చెప్పాలి. అప్పుడు నాబోతును నగరం నుండి బయటికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపాలి.”
11 అది చదివిన యెజ్రెయేలు నాయకులు (పెద్దలు), ఇతర ప్రముఖులు ఆజ్ఞను శిరసావహించారు. 12 ప్రజలంతా ఉపవాసం చేయాలని ఒక రోజును నిర్ణయించి ప్రకటించారు. ఆ రోజున నియమిత స్థలంలో సమావేశం కావాలని ప్రజలందరికీ పిలుపు ఇచ్చారు. వారు నాబోతును ప్రజల ముందు ఒక ప్రత్యేక స్థానంలో కూర్చుండబెట్టారు. 13 అప్పుడు ఇద్దరు మనుష్యులు లేచి నాబోతు దేవునిని, రాజును గూర్చి దుర్భాషలాడుతూండగా తాము విన్నట్లు ప్రజలకు చెప్పారు. అందువల్ల ప్రజలు నాబోతును నగరం నుండి బయటికి లాక్కొని వెళ్లి, అతనిని రాళ్లతో కొట్టి చంపారు. 14 తరువాత నాబోతు చంపబడ్డాడన్న వర్తమానం నాయకులు యెజెబెలుకు పంపారు.
15 ఈ వార్త విన్న యెజెబెలు వెంటనే అహాబు వద్దకు వెళ్లి, “నాబోతు చనిపోయాడు. ఇప్పుడు నీవు వెళ్లి నీకు కావలసిన పొలాన్ని తీసికో” అని చెప్పింది. 16 కావున అహాబు ద్రాక్షతోటకు వెళ్లి దానిని తన వశం చేసుకున్నాడు.
9 సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం ప్రేమించుకొనమని దేవుడే మీకు బోధించాడు. 10 నిజానికి మాసిదోనియ ప్రాంతంలో ఉన్న సోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. కాని సోదరులారా! మీరు యింకా ఎక్కువ ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
11 మేమిదివరకే చెప్పిన విధంగా శాంతితో జీవించాలని ఆశించండి. మీ స్వహస్తాలతో పని చేస్తూ యితర్ల జోలికి పోకుండా జీవించండి. 12 అలా చేస్తే మీ నిత్య జీవితాన్ని చూసి యితర్లు మిమ్మల్ని గౌరవిస్తారు. అప్పుడు మీరు యితర్లపై ఆధారపడనవసరం ఉండదు.
© 1997 Bible League International