Revised Common Lectionary (Complementary)
5 అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యాకు ఇలా సమాధానం చెప్పాడు. వారు దేవాలయంలో నిలబడి వున్నారు. యాజకులు, మరియు అక్కడ చేరిన ప్రజలు యిర్మీయా సమాధానం వినగలిగారు. 6 హనన్యాతో యిర్మీయా ఇలా అన్నాడు: “తధాస్తు! నిజంగా యెహోవా అలా చేయుగాక! నీవు ప్రవచించిన వర్తమానం యెహోవా నిజం చేయుగాక! బబులోను నుంచి దేవాలయ సంబంధిత వస్తువులన్నీటినీ యెహోవా ఇక్కడికి తీసుకొని వచ్చుగాక! బలవంతంగా తమ ఇండ్లు వదిలి పోయేలా చేయబడిన ప్రజలందరినీ యెహోవా మరల ఇక్కడికి తీసికొని వచ్చుగాక!
7 “కాని హనన్యా! నేను చెప్పేది విను. ప్రజలారా, మీరందరు నేను చెప్పేది వినండి. 8 హనన్యా! నీవు, నేను ప్రవక్తలం అవటానికి పూర్వం చాలా ముందు కాలంలో ప్రవక్తలుండినారు. చాలా దేశాలకు, మహా సామ్రాజ్యాలకు యుద్ధాలు, కరువులు, భయంకరమైన రోగాలు వస్తాయని వారు చెప్పియున్నారు. 9 కాని మనకు సుఖ సంతోషాలు, శాంతి లభిస్తాయని చేప్పే ప్రవక్త నిజంగా యెహోవాచే పంపబడినవాడేనా అని మనం నిర్ధారణ చేయవలసి వుంది. ఆ ప్రవక్త చెప్పినది నిజమయ్యే పక్షంలో, అతడు నిజంగా యెహోవాచే పంపబడిన వాడని ప్రజలు తెలుసుకోవచ్చు.”
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
12 నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించకుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి. 13 మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి. 14 మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు.
నీతికి బానిసలు
15 అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము. 16 సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు. 17 ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. 18 మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు. 19 మీకు వీటిని అర్థం చేసుకొనే శక్తి లేదు కనుక నేను మాములు ఉదాహరణలు ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాను. ఇదివరలో మీరు మీ అవయవాల్ని అపవిత్రతకు, దుర్మార్గపు పనులు చెయ్యటానికి బానిసలుగా అర్పించుకొన్నారు. అదే విధంగా ఇప్పుడు మీ అవయవాల్ని నీతికి, పవిత్రతకు నడిపించే బానిసలుగా అర్పించుకోండి.
20 మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చెయ్యలేదు. 21 ఆ పనుల వల్ల మీరు ఏమి ఫలం పొందారు? వాటివల్ల మరణమే కలుగుతుంది. 22 ఇక ఇప్పుడు మీరు పాపంనుండి విముక్తులై దేవునికి బానిసలయ్యారు. కనుక మీరు పొందుతున్న ఫలం పవిత్రతకు దారి తీస్తుంది. చివరకు అనంత జీవితం లభిస్తుంది. 23 పాపం మరణాన్ని ప్రతి ఫలంగా ఇస్తుంది. కాని దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనంత జీవితాన్ని బహుమానంగా ఇస్తాడు.
నిన్ను ఆహ్వానించువారిని దేవడు దీవించును
(మార్కు 9:41)
40 “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే. 41 ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు. 42 మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.”
© 1997 Bible League International