Revised Common Lectionary (Complementary)
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
అబద్ద ప్రవక్త హనన్యా
28 యూదా రాజుగా సిద్కియా పాలన నాలుగు సంవత్సరాలు[a] దాటి ఐదవ నెల గడుస్తూ ఉండగా ప్రవక్త హనన్యా నాతో మాట్లాడాడు. హనన్యా తండ్రి పేరు అజ్జూరు. హనన్యా గిబియోను పట్టణవాసి. హనన్యా నాతో మాట్లాడినప్పుడు అతడు దేవాలయంలో వున్నాడు. యాజకులు, ఇతర ప్రజలు అందరు కూడ అక్కడ చేరి వున్నారు. హనన్యా ఇలా చెప్పాడు. 2 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘యూదా ప్రజల మెడపై బబులోను రాజు వుంచిన కాడిని నేను విరిచి వేస్తాను. 3 రెండు సంవత్సరాలు గడిచేలోగా యెహోవా గుడి నుండి బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొనిపోయిన వస్తువులన్నిటినీ నేను తిరిగి తెస్తాను. నెబుకద్నెజరు ఆ వస్తువులన్నిటినీ బబులోనుకు తీసుకొని పోయాడు. కాని వాటన్నిటినీ నేను తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తాను. 4 యూదా రాజైన యెహోయాకీమను కూడా ఈ స్థానానికి నేను తీసుకొని వస్తాను. యెకోన్యా యెహోయాకీము కుమారుడు. నెబుకద్నెజరు బలవంతం చేసి తమ ఇండ్ల నుండి బబులోనుకు తీసుకొని పోయిన యూదా ప్రజలందరినీ నేను తిరిగి తీసుకొని వస్తాను.’ ఇది యెహోవా నుంచి వచ్చిన సమాచారం ‘కావున బబులోను రాజు యూదా ప్రజల మెడపై ఉంచిన కాడిని నేను విరుగగొడతాను!’”
పాపము మరియు క్షమాపణ
(మత్తయి 18:6-7, 21-22; మార్కు 9:42)
17 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ప్రజలు పాపం చేసే పరిస్థితులు కలుగచేసే వాళ్ళకు శిక్ష తప్పదు. 2 ఈ అమాయకుల్లో ఏ ఒక్కడు పాపం చేసేటట్లు చేసినా శిక్ష తప్పదు. అది జరుగక ముందే అలాంటి వాని మెడకు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేస్తే అది అతనికి మేలు చేసినట్లవుతుంది. 3 అందువల్ల జాగ్రత్త!
“మీ సోదరుడు పాపం చేస్తే గద్దించండి. పశ్చాత్తాపం చెందితే క్షమించండి. 4 అతడు రోజుకు ఏడుసార్లు మీ పట్ల పాపం చేసి ఏడుసార్లు మీ దగ్గరకు వచ్చి, ‘నేను పశ్చాత్తాపం చెందాను’ అని అంటే అతణ్ణి క్షమించండి.”
© 1997 Bible League International