Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 20:7-13

ఐదవసారి యిర్మీయా విన్నపం

యెహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. నేను నిజంగా మోసగింపబడ్డాను.
    నీవు నాకంటె బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు.
నేను నవ్వుల పాలయ్యాను.
    రోజంతా ప్రజలు నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు.
నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను.
    దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను.
    యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను.
కాని నా ప్రజలు నన్ను కేవలం అవమానపర్చి,
    హేళనచేస్తున్నారు.
“నేనిక దేవుని గురించి మర్చిపోతాను.
    ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!”
అని నేను కొన్ని సార్లు అనుకున్నాను.
కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది!
    అది నన్ను లోపల దహించి వేస్తుంది.
దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను.
    ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.
10 అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను.
    ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను.
    నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు.
    “మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం!
    లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు!
అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు.
    తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు.
    లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు” నని వారంటున్నారు.
11 కాని యెహోవా నాతో వున్నాడు.
    యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు.
కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు.
    వారు నన్ను ఓడించలేరు.
వారి ప్రయత్నం వ్యర్థం.
    వారు ఆశా భంగం చెందుతారు.
వారు అవమానం పాలవుతారు.
    వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు.

12 సర్వశక్తి మంతుడవైన ఓ యెహోవా, నీవు మంచి వారిని పరీక్షిస్తావు.
    మనిషి గుండెలోకి, మనస్సులోకి సూటిగా నీవు చూడగలవు.
ఆ ప్రజలకు వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన్నవించాను
    కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను చూడనిమ్ము.
13 యెహోవాను ఆరాధించుము! యెహోవాను స్తుతించుము!
యెహోవా పేద వారిని ఆదుకుంటాడు!
    ఆయన వారిని దుర్మార్గుల బారి నుండి రక్షిస్తాడు!

కీర్తనలు. 69:7-10

నా ముఖం సిగ్గుతో నిండి ఉంది.
    నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను.
నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు.
    నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు.
నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.
    నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను.
10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను.
    అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు.

కీర్తనలు. 69:11-15

11 నా విచారాన్ని చూపించేందుకు నేను దుఃఖ బట్టలు ధరిస్తున్నాను.
    ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
    నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
    బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
    లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
    సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము

కీర్తనలు. 69:16-18

16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
    నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.
17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు.
    నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.
18 వచ్చి నా ఆత్మను రక్షించుము.
    నా శత్రువులనుండి నన్ను తప్పించుము.

రోమీయులకు 6:1-11

పాపం విషయంలో మరణించాము గాని క్రీస్తులో బ్రతికినాము

దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము? బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా? ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.

మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం. మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు.

మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. 10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. 11 అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.

మత్తయి 10:24-39

24 “విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు. 25 విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు[a] అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా!

దేవునికి భయపడుము, జనులకు కాదు

(లూకా 12:2-7)

26 “అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి. 27 నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి.

28 “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి. 29 ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు. 30 మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. 31 అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు.

నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవద్దు

(లూకా 12:8-9)

32 “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను. 33 కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను.

యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును

(లూకా 12:51-53; 14:26-27)

34 “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. 35-36 ఎందుకంటే నేను,

‘తండ్రి కుమార్ల మధ్య,
    తల్లీ కూతుర్ల మధ్య,
అత్తా కోడళ్ళ మధ్య,
    విరోధం కలిగించాలని వచ్చాను.
ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’(A)

37 “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు. 38 నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు. 39 జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International