Revised Common Lectionary (Complementary)
కృతజ్ఞత కీర్తన.
100 భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
2 నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు!
ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
3 యెహోవా దేవుడని తెలుసుకొనుము.
ఆయనే మనలను సృజించాడు.
మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
4 కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి.
స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి.
ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.
5 యెహోవా మంచివాడు.
ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.
దేవుడు మళ్లీ మోషేను పిల్చాడు
28 ఈజిప్టు దేశంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. 29 “నేను యెహోవాను. నేను నీతో చెప్పిందంతా ఈజిప్టు రాజుతో చెప్పు” అన్నాడు.
30 “కానీ, నేను చక్కగా మాట్లాడలేను గదా! రాజు నా మాట వినడు” అని జవాబిచ్చాడు మోషే.
7 మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “నేను నీకు తోడుగా ఉంటాను. ఫరోకు నీవు ఒక మహారాజులా[a] ఉంటావు. అహరోను నీ పక్షంగా మాట్లాడే మాటకారిగా[b] ఉంటాడు. 2 నీకు నేను ఆజ్ఞాపించేదంతా అహరోనుతో చెప్పు. నేను చెప్పే విషయాలన్నీ అతను రాజుతో చెబుతాడు. ఇక ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఈ దేశాన్ని వదిలిపోనిస్తాడు. 3 అయితే నేను ఫరోను మొండిగా చేస్తాను. (మీరు అతనితో చెప్పే సంగతులను అతడు లెక్క చేయడు) అప్పుడు నేను ఈజిప్టులో అనేక అద్భుతాలు చేస్తాను. అయినా అతను వినేందుకు నిరాకరిస్తాడు. 4 అందుచేత ఈజిప్టును నేను ఘోరంగా శిక్షిస్తాను. తర్వాత నా ప్రజలను ఆ దేశం నుండి నేను బయటకు నడిపిస్తాను. 5 అప్పుడు నేనే యెహోవాను అని ఈజిప్టు ప్రజలు తెలుసుకుంటారు. నేను వాళ్లకు వ్యతిరేకంగా ఉంటాను. నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. అప్పుడు నేనే నా ప్రజలను ఆ దేశంనుండి బయటకు నడిపిస్తాను.”
6 మోషే, అహరోనులు యెహోవా తమతో చెప్పిన ఈ మాటలకు విధేయులయ్యారు. 7 అప్పటికి మోషే వయస్సు 80 సంవత్సరాలు అహరోను వయస్సు 83 సంవత్సరాలు.
మోషే కర్ర పాము అవుతుంది
8 మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు: 9 “మీ శక్తి రుజువు చేయమని ఫరో మిమ్మల్ని అడుగుతాడు. ఒక అద్భుతం చేయమని మిమ్మల్ని అడుగుతాడు. అతని కర్ర నేలమీద పడవేయమని అహరోనుతో చెప్పు. ఫరో చూస్తూ ఉండగానే ఆ కర్ర పావు అవుతుంది.”
10 కనుక మోషే, అహరోను ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా చెప్పినట్టు చేసారు. అహరోను తన చేతి కర్రను కింద పడవేసాడు. ఫరో తన అధికారులతో కలసి చూస్తూ ఉండగానే ఆ కర్ర పాముగా అయింది.
11 కనుక రాజు తన విద్వాంసులను, మంత్రగాళ్లను పిలిపించాడు. వాళ్లు మంత్రాలు వేసి, అహరోను చేసినట్లే చేయగల్గారు. 12 వాళ్లు కూడా వారి కర్రలను నేల మీద పడవేసారు. ఆ కర్రలు పాములయ్యాయి, కాని అహరోను కర్ర వాళ్ల కర్రలను మింగేసింది. 13 అయినా సరే ప్రజలను వెళ్లనిచ్చేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఏమి జరుగుతుందని యెహోవా చెప్పాడో అలాగే ఇది జరిగింది. మోషే, అహరోనుల మాట వినేందుకు రాజు ఒప్పుకోలేదు.
దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం
(మత్తయి 15:1-20)
7 యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు,[a] శాస్త్రులు యేసు చుట్టూ చేరారు. 2 వాళ్ళు, యేసు శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో, అంటే ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం గమనించారు. 3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చెయ్యరు. 4 వాళ్ళు వీథిలోకి వెళ్ళివస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యరు. ఇదేకాక వాళ్ళింకా అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను, చెంబులను, గిన్నెలను[b] శుద్ధి చేయటం వాళ్ళ ఆచారం.
5 అందువల్ల పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో, “మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు పాటించరు?” అని అడిగారు.
6 యేసు సమాధానంగా, “యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు:
‘వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు.
కాని వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి.
7 వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు.
కనుక వాళ్ళ ఆరాధన నిరర్థకం.’(A)
8 దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తున్నారు.
9 “మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని, మీ ఆచారాలను స్థాపించటంలో ఘనులు. 10 ఉదాహరణకు, మోషే మీ తల్లితండ్రుల్ని గౌరవించమని(B) మరియు తల్లిని కాని, తండ్రిని కాని దూషించినవారికి మరణ దండన విధించమని ఆజ్ఞాపించాడు.(C) 11 కాని ఒక మనిషి దగ్గర తన తల్లితండ్రులకు సహాయం చెయ్యటానికి కొంత ధనం ఉన్నా అతడు వాళ్ళతో, అది అంటే దేవునికి అర్పితం అని అంటే, 12 ఆ మనిషి తన తల్లి తండ్రులకు సహాయం చేయనవసరంలేదని మీరు అతణ్ణి సమర్థిస్తున్నారు. 13 మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు” అని అన్నాడు.
© 1997 Bible League International