Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
2 నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
3 ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
వారు యెహోవాను నమ్ముకొంటారు.
4 ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
5 యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.
6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
యెహోవా వద్దకు తిరిగివచ్చుట
14 ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరా. 2 నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరా. ఆయనతో ఇలా చెప్పు,
“మా పాపాన్ని తీసివేయి.
మా మంచి పనులను అంగీకరించు.
మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము.
3 అష్షూరు మమ్మల్ని కాపాడదు.
మేమిక యుద్ధగుర్రాలపైన స్వారీ చేయము.
మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను
ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము.
ఎందుకంటే, అనాధుల పట్ల
జాలి చూపేది నువ్వొక్కడివే.”
యెహోవా ఇశ్రాయేలును క్షమించుట
4 అందుకు యెహోవా ఇలా అంటాడు:
“నా కోపం చల్లారింది, కనుక,
నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను.
నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను.
5 నేను ఇశ్రాయేలీయులకు మంచువలె వుంటాను.
ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు.
అతడు లెబానోను దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు.
6 అతని శాఖలు విస్తరిస్తాయి,
అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు.
అతను లెబానోనులోని దేవదారు చెట్లు
వెలువరించే సువాసనలాగ ఉంటాడు.
7 ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు.
గోధుమ కంకుల్లాగ పెరుగుతారు.
ద్రాక్షా తీగల్లాగ పుష్పించి ఫలిస్తారు.
వారు లెబానోను ద్రాక్షారసంవలె ఉంటారు.”
విగ్రహాల విషయంలో ఇశ్రాయేలుకు యెహోవా హెచ్చరిక
8 “ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు.
నీ ప్రార్థనలు ఆలకించేది నేనే. నిన్ను కాపాడేది నేనే.
నిరంతరం పచ్చగానుండే
మీ ఫలము నానుండి వస్తుంది.”
చివరి సలహా
9 వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు.
చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి.
యెహోవా మార్గాలు సరైనవి.
మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు.
పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.
యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు
(మార్కు 2:23-28; లూకా 6:1-5)
12 ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు, తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలు పెట్టారు. 2 పరిసయ్యులు ఇది చూసి యేసుతో, “విశ్రాంతి రోజు మీ శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు” అని అన్నారు.
3-4 యేసు, “దావీదుకు, అతని అనుచరులకు ఆకలివేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు. తర్వాత అతడు, అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు చదువలేదా? యాజకులకు తప్ప దావీదుకు కాని, అతని అనుచరులకు కాని, మరెవ్వరికి ఆ రొట్టెను తినే అధికారం లేదు. 5 అంతేకాక, యాజకులు విశ్రాంతి రోజు పని చేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. ఇది మీరు చదువలేదా? వాళ్ళు అలా చెయ్యటం తప్పుకాదు. 6 నేను చెప్పేదేమిటంటే మందిరం కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. 7 ‘నాకు దయకావాలి, బలికాదు’(A) అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు.
8 “విశ్రాంతి రోజుకు మనుష్యకుమారుడు ప్రభువు” అని అన్నాడు.
© 1997 Bible League International