Revised Common Lectionary (Complementary)
7 దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
8 నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.
9 మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను.
మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు.
పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు
ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.”
14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,
దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.
15 “ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!
నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”
కొత్త రాతి పలకలు
34 అప్పుడు మోషేతో యెహోవా ఇలాగు చెప్పాడు: “ముందు పగులగొట్టబడ్డ రెండు రాతి పలకల్లాంటివే మరో రెండు రాతి పలకలు తయారు చేయి. మొదటి రెండు రాళ్లమీద వ్రాయబడ్డ మాటలే ఈ రాళ్ల మీద నేను రాస్తాను. 2 రేపు ఉదయం సిద్ధంగా ఉండు. సీనాయి కొండమీదికి రమ్ము. అక్కడ కొండ శిఖరం మీద నా ఎదుట నిలబడు. 3 నీతో ఇంక ఏ వ్యక్తీ రావడానికి వీలులేదు. కొండమీద ఎక్కడా ఏ వ్యక్తి కనబడకూడదు. కనీసం ఆ కొండ కిందకూడ నీ పశువుల మందలు కాని, గొర్రెల మందలు గాని మేత కూడ మేయకూడదు.”
4 కనుక మొదటి వాటిలాగే మరో రెండు రాతి పలకలను మోషే చేసాడు. ఆ మర్నాడు ఉదయాన్నే సీనాయి కొండ మీదికి అతడు వెళ్లాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమే అంతా చేసాడు. ఆ రెండు రాతి పలకలను మోషే తీసుకొని వెళ్లాడు. 5 మోషే కొండ మీద ఉన్నప్పుడు, ఒక మేఘం మీద యెహోవా దిగి వచ్చాడు. అక్కడ మోషే దగ్గర యెహోవా నిలబడ్డాడు. అతడు యెహోవాను పేరుపెట్టి పిలిచాడు. 6 మోషే ఎదుట యెహోవా దాటి వెళ్తూ ఇలా అన్నాడు: “యెహోవా దయ, జాలిగల దేవుడు. యెహోవా త్వరగా కోపపడడు. యెహోవా మహా ప్రేమపూర్ణుడు. యెహోవా నమ్ముకోదగినవాడు. 7 వేలాది తరాలకు దయచూపించే వాడు యెహోవా. ప్రజలు చేసే తప్పులను యెహోవా క్షమిస్తాడు. అయితే నేరస్తులను శిక్షించడం యెహోవా మరచిపోడు. నేరస్తులను యెహోవా శిక్షించడమే కాదు, వారు చేసే తప్పులవల్ల వారి పిల్లలు, మనుమళ్లు, మూడు నాలుగు తరాల వరకు శ్రమ అనుభవిస్తారు.”
8 వెంటనే మోషే సాష్టాంగపడి యెహోవాను ఆరాధించాడు. మోషే ఇలా అన్నాడు: 9 “ప్రభూ, నా విషయం నీకు ఇష్టమైతే దయచేసి మాతోకూడా రమ్ము. వీళ్లు మొండి ప్రజలని నాకు తెలుసు. అయితే మేము చేసిన తప్పుల విషయంలో మమ్మల్ని క్షమించు. మమ్మల్ని నీ ప్రజలుగా స్వీకరించు.”
ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపు కలిగించటం
27 యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా యిద్దరు గ్రుడ్డివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు.
28 యేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
29 అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, “మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని అన్నాడు. 30 వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి!” అని వాళ్ళను హెచ్చరించాడు. 31 కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేసారు.
32 వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాడి నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్ఘాంతపోయి, “ఇలాంటిదేదీ ఇదివరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే?” అని అన్నారు.
34 కాని పరిసయ్యులు, “అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.
© 1997 Bible League International