); Isaiah 49:13-23 (God comforts the suffering); Matthew 18:1-14 (Become like a child) (Telugu Holy Bible: Easy-to-Read Version)
Revised Common Lectionary (Complementary)
148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
5 యెహోవా నామాన్ని స్తుతించండి.
ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
13 భూమి, ఆకాశములారా సంతోషించండి.
పర్వతములారా, ఆనందంగా కేకలు వేయండి.
ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఆదరిస్తాడు గనుక.
తన దీన జనులకు యెహోవా దయచూపిస్తాడు.
14 కానీ ఇప్పుడు సీయోను అంటుంది, “యెహోవా నన్ను విడిచిపెట్టాడు.
నా యజమాని నన్ను మరిచిపోయాడు” అని.
15 అయితే నేనంటాను,
“ఓ స్త్రీ తన శిశువును మరచిపోగలదా? లేదు.
తన గర్భంనుండి వచ్చిన శిశువును ఒక స్త్రీ మరువగలదా? లేదు.
ఒక స్త్రీ తన పిల్లలను మరువజాలదు.
మరి నేను (యెహోవాను) మిమ్ములను మరువజాలను.
16 చూడు, నేను నీ పేరు నా చేతి మీద వ్రాసుకొన్నాను.
ఎల్లప్పుడు నేను నిన్నుగూర్చి తలుస్తాను.
17 నీ పిల్లలు నీ దగ్గరకు తిరిగివస్తారు.
ప్రజలు నిన్ను ఓడించారు, కానీ ఆ ప్రజలు నిన్ను ఒంటరిగా విడుస్తారు.”
18 పైకి చూడు! నీ చుట్టూ చూడు!
నీ పిల్లలు అందరూ సమావేశమై నీ దగ్గరకు వస్తున్నారు.
యెహోవా చెబుతున్నాడు:
“నేను సజీవంగా ఉన్నాను, నేను మీకు ఈ వాగ్దానం చేస్తున్నాను:
నీ పిల్లలు నీకు కంఠహారంగా ఉంటారు.
పెండ్లి కుమార్తె ధరించే ఒడ్డాణంలా నీ పిల్లలు ఉంటారు.
19 “ఇప్పుడైతే నీవు ఓడించబడి, నాశనం చేయబడి ఉన్నావు.
నీ భూమి నిష్ప్రయోజనం.
అయితే కొంతకాలం తర్వాత నీ దేశంలో ఎందరెందరో మనుష్యులు ఉంటారు.
నిన్ను నాశనం చేసిన ఆ మనుష్యులు చాలా చాలా దూరంగా ఉంటారు.
20 నీవు పోగొట్టుకున్న పిల్లలకోసం నీవు విచారంగా ఉన్నావు. అయితే ఆ పిల్లలు,
‘ఈ స్థలం మేము నివసించేందుకు చాలా చిన్నదిగా ఉంది.
మేము నివసించేందుకు పెద్ద స్థలం ఇవ్వు’ అని నీతో చెబుతారు.
21 అప్పుడు నీలో నీవు అనుకొంటావు,
‘ఈ పిల్లలందర్నీ నాకు ఎవరు ఇచ్చారు?
ఇది చాలా బాగుంది. నేను విచారంగా, ఒంటరిగా ఉన్నాను.
నేను ఓడించబడి, నా ప్రజలకు దూరమయ్యాను.
అందుచేత ఈ పిల్లలను నాకిచ్చింది ఎవరు?
చూడు, నేను ఒంటరిగా విడువబడ్డాను.
ఈ పిల్లలంతా ఎక్కడనుండి వచ్చారు?’”
22 నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు,
“చూడు, రాజ్యాలకు నేను నా చేయి ఊపుతాను.
ప్రజలందరూ చూడగలిగేట్టు నేను నా పతాకాన్ని ఎగురవేస్తాను.
అప్పుడు ఆ ప్రజలు నీ పిల్లలను నీ దగ్గరకు తీసుకొని వస్తారు.
ఆ ప్రజలు నీ పిల్లలను వారి భుజాలమీద ఎత్తుకొంటారు,
మరియు వారు తమ చేతుల్లో వారిని పట్టు కొంటారు.
23 నీ పిల్లలకు రాజులు ఉపాధ్యాయులుగా ఉంటారు.
రాజకుమార్తెలు ఆ పిల్లల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటారు.
రాజులు, వారి కుమార్తెలు నీ ఎదుట సాష్టాంగపడ్తారు.
నీ పాదాల క్రింద ధూళిని వారు ముద్దు పెట్టుకొంటారు.
అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు.
నా యందు విశ్వాసం ఉంచే వాడెవడూ నిరాశచెందడని నీవు తెలుసుకొంటావు.”
దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?
(మార్కు 9:33-37; లూకా 9:46-48)
18 ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు.
2 యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు: 3 “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 4 అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు.
5 “అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను.
పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం
(మార్కు 9:42-48; లూకా 17:1-2)
6 “కాని నన్ను విశ్వసించే ఈ చిన్న పిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారకుడవటం కన్నా, మెడకు తిరుగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడటం మేలు. 7 ప్రపంచంలోని మానవుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు అలాంటివి. అవి జరుగక తప్పదు. కాని ఎవడు అలాంటివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది.
8 “మీ కాలుగాని లేక మీ చేయిగాని మీ పాపానికి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. కాళ్ళు చేతులు ఉండి నరకంలో శాశ్వతమైన మంటల్లో పడటం కన్నా, కుంటి వానిగా లేక వికలాంగునిగా జీవం పొందటం మేలు. 9 ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకిపారవేయండి. రెండు కళ్ళుండి నరకంలోని మంటల్లో పడటం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి జీవించటం మేలు.
తప్పిపోయిన గొఱ్ఱెల ఉపమానం
(లూకా 15:3-7)
10 “ఈ చిన్న పిల్లల్లో ఎవర్నీ చిన్న చూపు చూడకండి. నేను చెప్పేదేమిటంటే పరలోకంలో ఉన్న వీళ్ళ దూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. 11 [a]
12 “ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు వున్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే, అతడు ఆ తొంబైతొమ్మిది గొఱ్ఱెల్ని కొండమీద వదిలి, ఆ తప్పిపోయిన గొఱ్ఱె కోసం వెతుక్కొంటూ వెళ్ళడా? మీరేమంటారు? 13 ఇది సత్యం, ఒక వేళ ఆ గొఱ్ఱె దొరికితే ఆ తప్పిపోని తొంబైతొమ్మిది గొఱ్ఱెలు తన దగ్గరున్న దానికన్నా ఎక్కువ ఆనందిస్తాడు. 14 అతనిలాగే పరలోకంలోవున్న నా తండ్రి ఈ చిన్న పిల్లల్లో ఎవ్వరూ తప్పిపోరాదని ఆశిస్తుంటాడు.
© 1997 Bible League International