Revised Common Lectionary (Complementary)
రెండవ భాగం
(కీర్తనలు 42–72)
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం
42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
2 సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
3 నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.
4 కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.
5 నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
ఆయన నన్ను కాపాడుతాడు.
6 నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
7 నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.
8 ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
9 ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
“యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
“నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.
11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
నా సహాయమా! నా దేవా!
ఆలయంనుంచి పారే నీరు
47 ఆ మనుష్యుడు నన్ను మళ్లీ ఆలయ ద్వారంవద్దకు నడిపించాడు. ఆలయ తూర్పు గుమ్మం క్రిందనుంచి నీరు బయటకు రావటం చూశాను. (ఆలయ ముఖద్వారం తూర్పునకే ఉంది) బలిపీఠానికి దక్షిణంగా ఉన్న ఆలయ దక్షిణపు భాగం చివరి నుండి నీరు ప్రవహిస్తూ ఉంది. 2 ఆ మనుష్యుడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటికి తీసుకొని వచ్చి ఆ తరువాత తూర్పున ఉన్న వెలుపలి ద్వారం బయట చుట్టూ తిప్పాడు. ఆలయ దక్షిణ భాగాంలో నీరు బయటికి వస్తూఉంది.
3 ఆ మనుష్యుడు ఒక కొలత బద్ద పట్టుకొని నూరు మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లను దాటమని అతడు నాకు చెప్పాడు. నీళ్లు చీలమండలవరకు వచ్చాయి. 4 అతడు మరో ఐదు వందల ఎనభై ఆరు గజాల రెండడుగుల దూరం కొలిచాడు. మళ్లీ ఆ ప్రదేశంలో నీళ్లలో నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మోకాళ్ల వరకు వచ్చింది. మరో వెయ్యి మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లలోనుండి నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మొలలోతు వచ్చింది. 5 ఆ మనిషి మరో వెయ్యి మూరలు కొలిచాడు. కాని అక్కడ నీరు దాటలేనంత లోతుగా ఉంది. అది ఒక నది అయింది. నీరు ఈదటానికి అనువైన లోతున ఉంది. అది దాట శక్యముగానంత లోతైన నది అయ్యింది. 6 “నరపుత్రుడా, నీవు చూచిన విషయాలను శ్రద్ధగా పరిశీలించావా?” అని ఆ మనుష్యుడు నన్నడిగాడు.
పిమ్మట నది ప్రక్కగా ఆ మనుష్యుడు నన్ను తిరిగి వెనుకకు తీసుకొని వచ్చాడు. 7 నేను నది ప్రక్కగా తిరిగి వస్తూ వుండగా నీటికి రెండు ప్రక్కలా రకరకాల చెట్లు చూశాను. 8 ఆ మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఈ నీరు తూర్పుగా అరబా లోయలోకి ప్రవహిస్తూ ఉంది. ఈ నీరు మృత సముద్రంలోకి ప్రవహించటంతో, దానిలోని నీరు మంచినీరై శుభ్ర పడుతూ ఉంది.[a] 9 ఈ నీటిలో చేపలు విస్తారంగా వుంటాయి. ఈ నది ప్రవహించే ప్రాంతంలో అన్ని రకాల జంతువులు నివసిస్తాయి. 10 ఏన్గెదీ పట్టణం నుండి ఏనెగ్లాయీము పట్టణం వరకు బెస్తవాళ్లు నది ఒడ్డున నిలబడి ఉండటం నీవు చూడగలవు. వారు తమ వలలు విసరి రకరకాల చేపలు పట్టటం నీవు చూడవచ్చు. మధ్యధరా సముద్రంలో ఎన్ని రకాల చేపలు వుంటాయో మృత సముద్రంలో అన్ని రకాల చేపలు ఉంటాయి. 11 కాని అక్కడి పర్రలు, మరియు కొద్దిగానున్న తడి ప్రదేశాలు మంచి భూమిగా మారవు. అవి ఉప్పు తయారు చేయటానికి వదిలివేయబడతాయి. 12 అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు నదికి ఇరు ప్రక్కల పెరుగుతాయి. వాటి ఆకులు ఎన్నడూ ఎండవు. ఆ చెట్లు పండ్లు ఇవ్వకుండా ఎప్పుడూ ఉండవు. ప్రతినెలా అవి పండ్లు ఇస్తూనే ఉంటాయి. చెట్లకు కావలసిన నీరు ఆలయం నుండి వస్తూ ఉంటుంది గనుక ఇలా జరుగుతుంది. చెట్ల నుండి లభించే పండ్లు ఆహారం నిమిత్తమూ, ఆకులు ఔషధాలకూ వినియోగపడతాయి.”
హెచ్చరికలు, ఉపదేశాలు.
17 కాని ప్రియ మిత్రులారా! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. 18 “చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించేవాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ వస్తారు” అని అపొస్తలులు చెప్పారు. 19 వాళ్ళు ప్రస్తావించిన ఈ దుర్బోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్బోధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఉండదు.
20 కాని ప్రియ మిత్రులారా! మీలో ఉన్న విశ్వాసం అతి పవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి. పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి. 21 దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచుకొని ఉండండి.
22 సంశయాలున్నవాళ్ళ పట్ల కనికరం చూపండి. 23 మంటల్లో పడబోయేవాళ్ళను బయటకు లాగి కాపాడండి. దుర్నీతిలో మలినమైన దుస్తుల్ని వేసుకొన్నవాళ్ళ పట్ల మీకు అసహ్యము, భయము కలిగినా, వాళ్ళ పట్ల కనికరం చూపండి.
24 క్రిందపడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడగలడు. మీలో ఏ లోపం లేకుండా చేసి తేజోవంతమైన తన సమక్షంలో నిలుపుకొని ఆనందాన్ని కలిగించగలడు. అలాంటి ఆయనకు, 25 మన రక్షకుడైనటువంటి ఏకైక దేవునికి, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా గొప్పతనము, తేజస్సు, శక్తి, అధికారము భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లభించుగాక! ఆమేన్.
© 1997 Bible League International