Revised Common Lectionary (Complementary)
దావీదు యాత్ర కీర్తన.
122 “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు
నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
2 ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
3 కొత్త యెరూషలేము
ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
4 దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు.
యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
5 ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది.
దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.
6 యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి.
“యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
7 నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”
8 నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను,
శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
9 మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం
ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
15 “మా దేవుడవైన యెహోవా, నీవు నీ మహాశక్తివల్ల నీ ప్రజల్ని ఈజిప్టునుండి వెలుపలికి తెచ్చావు. అందువలననే నీవీనాటికినీ నీ నామాన్ని గొప్పదిగా చేశావు. కాని మేము చెడుగా ప్రవర్తించి పాపం చేశాము. 16 దేవా, నీ నీతి క్రియలను దృష్టిలో ఉంచుకొని, పరిశుద్ధ పట్టణంపట్ల, యెరూషలేంపట్ల నీ కోపాన్ని మానుము. మా పాపాలవల్ల, మా పూర్వీకుల అపరాధాలవల్ల యెరూషలేము, నీ ప్రజలు మా పొరుగువారి మధ్యలో అవమానం పాలైరి.
17 “కాబట్టి మా దేవా! ఇప్పుడు, నీ సేవకుడనైన నా ప్రార్థన, మనవి ఆలకించుము. నీ నామం కొరకు, ప్రభువా! నీ ముఖకాంతి పాడుబడిన నీ పరిశుద్ధ స్థలంమీద ప్రకాశించుగాక! 18 నా దేవా, నీ చెవి వంచి నా ప్రార్థన వినుము! నీ కన్నులు తెరిచి, పాడుబడిన, నీ పేరు పెట్టబడిన ఈ నగరముపైన నీ దృష్టినుంచుము. మేము నీతిమంతులమని కాదుగాని, నీవు కృపామయుడవని నీకు మొర పెట్టుచున్నాము. 19 ప్రభువా! నా మొర ఆలకించు. ప్రభువా! మమ్ము మన్నించుము. ప్రభువా, మా ప్రార్థన విని, సహాయం చేయి. నా దేవా! ఆలస్యం చేయవద్దు. నా దేవా, నీ నామ మహిమ కొరకు నీ పట్టణం, నీ ప్రజలు నీ పేరును ధరించియున్నారు.”
దేవుణ్ణి శరణు కోరండి
4 మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం? 2 మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు చంపటానికి కూడా సిద్ధమౌతారు. మీలో అసూయ కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు. 3 మీరు దురుద్దేశ్యంతో అడుగుతారు. కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు.
4 నమ్మక ద్రోహులారా! ప్రపంచంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? ప్రపంచంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 లేఖనాల్లో ఈ విషయం వృధాగా వ్రాసారనుకుంటున్నారా? “ఆయన మనకిచ్చిన ఆత్మను[a] మనం ఆయన కోసం మాత్రమే వాడాలని చూస్తుంటాడు.” 6 దేవుడు మనపై ఎంతో అనుగ్రహం చూపుతున్నాడు. అందువల్ల లేఖనాల్లో, “దేవుడు అహంకారం కలవాళ్ళను ద్వేషిస్తాడు. వినయం కలవాళ్ళను కనికరిస్తాడు”(A) అని వ్రాయబడింది.
7 అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సాతాన్ను ఎదిరించండి. అప్పుడు సాతాను మీనుండి పారిపోతాడు. 8 దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా! మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి. 9 విచారించండి, దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. మీ ఆనందాన్ని విషాదంగా మార్చుకోండి. 10 ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పైకిలేపుతాడు.
© 1997 Bible League International