Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
17 రాజును (దేవుణ్ణి) ఆయన సంపూర్ణ సౌందర్యంలో మీరు చూస్తారు. ఆ మహా దేశాన్ని మీరు చూస్తారు. 18-19 గతంలో మీకు కలిగిన కష్టాలను గూర్చి మీరు ఆలోచిస్తారు. “ఆ ఇతర దేశాల మనుష్యులు ఎక్కడ? మనకు అర్థం కాని భాషలు వాళ్లు మాట్లాడారు. ఇతర దేశాల అధికారులు, పన్ను వసూలు చేసే వాళ్లు అంతా ఏమయ్యారు? మన రక్షణ గోపురాలను లెక్కించిన ఆ గూఢచారులు ఎక్కడ? వాళ్లంతా పోయారు!” అని మీరు అనుకొంటారు.
దేవుడు యెరూషలేమును కాపాడుతాడు
20 మన మతపరమైన పండుగల పట్టణం సీయోనును చూడు. ఆ అందమైన విశ్రాంతి స్థలం యెరూషలేమును చూడు. ఎన్నటికీ కదలని ఒక గుడారంలా ఉంది యెరూషలేము. దానిని తన స్థానంలో ఉంచే మేకులు ఎన్నటికి పెరికి వేయబడవు. దాని తాళ్లు ఎన్నటికీ తెగిపోవు. 21-23 ఎందుకంటే, శక్తిగల యెహోవా అక్కడ ఉన్నాడు గనుక. ఆ దేశం ఏరులు, పెద్ద నదులు ఉన్న దేశం. కాని ఆ నదుల్లో శత్రు పడవలుగాని లేక బలమైన ఓడలుగాని ఏమీ ఉండవు. ఆ పడవల్లో పనిచేసే మనుష్యులారా, మీరు మీ త్రాళ్ల పని విడిచి పెట్టవచ్చును. ఓడ కొయ్యను చాలినంత గట్టిగా చేయలేరు. మీరు మీ తెర చాపలను తెరువలేరు. ఎందుకంటే, యెహోవాయే మన న్యాయమూర్తి మన చట్టాలను యెహోవా చేస్తాడు. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు. అందుచేత యెహోవా మనకు విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. కుంటివాళ్లు సహా యుద్ధంలో గొప్ప ఐశ్వర్యాలు సంపాదిస్తారు.
8 యోహాను అనబడే నేను ఈ విషయం చూసాను. నేను అవి విని, చూసినప్పుడు నాకు యివి చూపిస్తున్న దూతను ఆరాధించటానికి అతని కాళ్ళమీద పడ్డాను. 9 కాని అతడు నాతో, “నేను నీ తోటి సేవకుణ్ణి, నీ సోదరులతో, ప్రవక్తలతో, ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించేవాళ్ళతో కలిసి సేవ చేసేవాణ్ణి. నన్ను ఆరాధించకు. దేవుణ్ణి ఆరాధించు” అని అన్నాడు.
10 అతడు యింకా ఈ విధంగా అన్నాడు: “కాలం సమీపిస్తోంది, కనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్కును రహస్యంగా దాచవద్దు. 11 తప్పు చేసేవాణ్ణి తప్పు చేయనీ! నీచంగా ప్రవర్తించేవాణ్ణి నీచంగా ప్రవర్తించనీ! నీతిగా ఉండేవాణ్ణి నీతిగా ఉండనీ! పవిత్రంగా ఉండేవాణ్ణి పవిత్రంగా ఉండనీ.”
12 “జాగ్రత్త, నేను త్వరలో రాబోతున్నాను. ప్రతి ఒక్కనికి అతడు చేసేవాటిని బట్టి నా దగ్గరున్నదాన్ని బహుమతిగా ఇస్తాను. 13 ఆదియు, అంతమును[a] నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే, ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే.
14 “జీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్ళే అర్హత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు. 15 పట్టణానికి వెలుపట కుక్కలు, మంత్రగాళ్ళు, అవినీతిపరులు, హంతకులు, విగ్రహారాధికులు, అసత్యాన్ని ప్రేమించి జీవించేవాళ్ళు రకరకాల మనుష్యులు ఉంటారు.
16 “నేను యేసును. ఈ విషయాన్ని సంఘాలకు చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను వేరును, దావీదు వంశాంకురాన్ని, ప్రకాశించే వేకువచుక్కను.”
17 ఆత్మ మరియు పెళ్ళికుమార్తె “రండి” అని అంటున్నారు. ఇది విన్నవాడు “రండి!” అనాలి. దాహంతో ఉన్నవాళ్ళు రావచ్చును. ఇష్టమున్నవాడు ఉచితంగా లభించే జీవజలాన్ని త్రాగవచ్చు.
18 ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్కును వినే ప్రతి ఒక్కణ్ణి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. 19 ఒకవేళ ఎవరైనా దీనికి ఏదైనా చేర్చితే, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకు వస్తాయి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంనుండి ఏవైనా మాటలు తీసి వేస్తే, ఈ గ్రంథంలో వర్ణింపబడిన జీవవృక్షంలో, పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు తీసివేస్తాడు.
20 యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు ఆయన, “ఔను, నేను త్వరలోనే వస్తాను” అని అంటున్నాడు.
ఆమేన్! రండి యేసు ప్రభూ!
21 యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.
© 1997 Bible League International