Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
18 ఈ వర్తమానం రాజునుండి వచ్చనది.
సర్వశక్తిమంతుడైన యెహోవాయే ఆ రాజు.
“నిత్యుడనగు నా తోడుగా ప్రమాణము చేస్తున్నాను.
ఒక మహాశక్తివంతుడైన నాయకుడు వస్తాడు.
తాబోరు కొండలా, సముద్రతీరానగల కర్మెలు పర్వతంలా అతడు గొప్పవాడై ఉంటాడు.
19 ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి.
బందీలై పోవటానికి సిద్ధమవండి.
ఎందువల్లనంటే, నోపు (మెంఫిస్) నగరం శిథిలమై నిర్మానుష్యమవుతుంది.
నగరాలు నాశనమవుతాయి.
వాటిలో ఎవరూ నివసించరు!
20 “ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది.
కాని ఉత్తరాన్నుండి ఒక జోరీగ దాన్ని ముసరటానికి వస్తున్నది.
21 ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు.
అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు.
శత్రు దాడికి వారు తట్టుకోలేరు.
వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది.
వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.
22 బుసకొట్టుతూ పారిపోవటానికి ప్రయత్నించే
పాములా ఈజిప్టు వుంది.
శత్రువు మిక్కిలి దరిజేరుతూ వున్నాడు.
అందుచే ఈజిప్టు సైన్యం పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంది.
గొడ్డళ్లు చేపట్టి శత్రవులు ఈజిప్టు మీదికి వస్తున్నారు.
వారు చెట్లను నరికే మనుష్యుల్లా వున్నారు.”
23 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు,
“ఈజిప్టు అరణ్యాన్ని (సైన్యం) శత్రువు నరికివేస్తాడు.
అరణ్యంలో (సైన్యం) చెట్లు (సైనికులు) చాలా వున్నాయి. కాని
అది నరికివేయబడుతుంది.
మిడుతలకంటె ఎక్కువగా శత్రు సైనికులున్నారు.
లెక్కకు మించి శత్రు సైనికులున్నారు.
24 ఈజిప్టుకు తలవంపులవుతుంది.
ఉత్తరాన్నుండి వచ్చే శత్రు సైన్యం వారిని ఓడిస్తుంది.”
25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “అతి త్వరలో థేబెసు దేవతయైన ఆమోనును[a] నేను శిక్షింపనున్నాను. నేను ఫరోను, ఈజిప్టును మరియు దాని దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. ఫరో మీద ఆధారపడి, అతన్ని నమ్మిన ప్రజలను కూడా నేను శిక్షిస్తాను. 26 వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, అతని సేవకులకు అప్పగిస్తాను.
“చాల కాలం ముందట ఈజిప్టు శాంతియుతంగా వుండేది. ఈ కష్ట కాలాలు అయిన తర్వాత ఈజిప్టు మరలా శాంతంగా వుంటుంది.” ఈ విషయాలను యెహోవా చెప్పాడు.
ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి ఒక వర్తమానం
27 “నా సేవకుడవైన యాకోబూ,[b] భయపడవద్దు.
ఇశ్రాయేలూ, బెదరవద్దు.
ఆ దూర ప్రాంతాలనుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను.
వారు బందీలుగా వున్న దేశాలనుండి మీ పిల్లల్ని కాపాడతాను.
యాకోబుకు మరల శాంతి, రక్షణ కల్పించబడతాయి.
అతనిని ఎవ్వరూ భయపెట్టలేరు.”
28 యెహోవా ఇలా అంటున్నాడు,
“నా సేవకుడవైన యాకోబూ, భయపడకు.
నేను నీతో వున్నాను.
నిన్ను అనేక ఇతర దేశాలకు నేను పంపియున్నాను.
ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను.
కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను.
నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి.
కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను.
నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”
5 సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు.
6 ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. 7 జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము. 8 కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు.
9 ఏడు పాత్రలతో ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉన్నవారిలో ఒక దూతవచ్చి నాతో, “పెళ్ళికూతుర్ని, అంటే గొఱ్ఱెపిల్ల భార్యను చూపిస్తాను, రా!” అని అన్నాడు. 10 అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు.
11 అది దేవుని మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్య కాంతమణిలా ఉంది. అది స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. 12 దాని చుట్టూ ఎత్తైన ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి. పన్నెండుమంది దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి. 13 తూర్పు వైపు మూడు ద్వారాలు, ఉత్తరం వైపు మూడు ద్వారాలు, దక్షిణం వైపు మూడు ద్వారాలు, పడమర వైపు మూడు ద్వారాలు ఉన్నాయి. 14 ఆ నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటి మీద గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుగురు అపొస్తలుల పేర్లు ఉన్నాయి.
15 నాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన కొలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు. 16 ఆ పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొలతబద్దతో పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, 1,500 మైళ్ళు[a] ఉన్నట్లు కనుగొన్నాడు. 17 ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని కొలిచి దాని ఎత్తు ఆ నాటి కొలత పద్ధతి ప్రకారం 144 మూరలు[b] ఉన్నట్లు కనుగొన్నాడు. 18 ఆ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి ఉంది. ఆ పట్టణం బంగారంతో కట్టబడి ఉంది. అది గాజువలె స్వచ్ఛంగా ఉంది.
19 ఆ ప్రాకారాల పునాదులు రకరకాల రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాదిరాయి సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమున, నాలుగవది పచ్చ, 20 ఐదవది వైఢూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, పదకొండవది పద్మరాగము, పన్నెండవది సుగంధము. 21 ఆ పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగారంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్ఛంగా ఉన్నాయి.
22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. 23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.
24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. 25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. 26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. 27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.
© 1997 Bible League International