Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
12 మీకాయాను పిలవటానికి వెళ్లిన దూత అతనితో యీలా చెప్పాడు: “మీకాయా, వినండి; ప్రవక్తలంతా ఒకే రీతిగా ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరుతుందని వారు చెబుతున్నారు. వారు చెప్పినట్లుగానే నీవు కూడా తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే చెప్పు.”
13 “యెహోవా జీవముతోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెబుతాను” అని మీకాయా అన్నాడు.
14 పిమ్మట మీకాయా రాజైన అహాబు వద్దకు వచ్చాడు. రాజు అతనితో, “మీకాయా, మేము రామోత్గిలాదు పట్టణంపై దండెత్తటానికి వెళ్లవచ్చునో, లోదో తెలియజేయి” అని అన్నాడు.
అందుకు మీకాయా, “వెళ్లి దాడి చేయి, దేవుడు నీవాప్రజలను ఓడించేలా చేస్తాడు,” అని చెప్పాడు.
15 అహాబు రాజు మీకాయాతో, “గతంలో చాలా సార్లు నిజమే ప్రవచించేలా యెహోవా పేర నీచేత ప్రమాణం చేయించాను,” అని అన్నాడు.
16 అప్పుడు మీకాయా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా పర్వతాలపై చిందరవందరై పోయినట్లు నేను చూశాను. వారు కాపరిలేని గొర్రెల్లా వున్నారు. యెహోవా చెప్పినదేమంటే, ‘వారికి నాయకుడు లేడు. కావున ప్రతి ఒక్కడినీ క్షేమంగా ఇంటికి పోనిమ్ము.’”
17 అది విని ఇశ్రాయేలు రాజు అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “మీకాయా నాకు ఎప్పుడూ యెహోవా నుండి మంచి వార్త తేడని నేను నీకు ముందే చెప్పాను! నా గురించి అతడు తెచ్చేవన్నీ చెడు వర్తమానాలే!”
18 మీకాయా ఇంకా యిలా అన్నాడు: “యెహోవా వర్తమానాన్ని వినండి! యెహోవా తన సింహాసనంపై కూర్చుని వున్నట్లు నేను చూశాను. పరమండల సైన్యమంతా ఆయన చుట్టూ చేరివుంది. 19 యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు అక్కడ చంపబడే విధంగా, యుక్తిగా రామోత్గిలాదుపై అతనిని యుద్ధానికి ఎవరు పంపగలరు?’ అని అడిగినాడు. ఆయన చుట్టూ చేరిన పలువురు పలురకాలుగా చెప్పారు. 20 పిమ్మట ఒక ఆత్మవచ్చి యెహోవా ముందు నిలబడి, ‘అహాబును నేను మోసపుచ్చుతాను’ అని అన్నది. ‘ఎలా?’ అని యెహోవా ఆత్మని అడిగాడు. 21 ‘నేను అసత్యలాడే ఆత్మగా మారి అహాబు ప్రవక్తలలో ప్రవేశించి వారి నోట అబద్ధాలు పలికిస్తాను’ అని ఆత్మ చెప్పింది. అది విని ‘అహాబును మోసగించటంలో నీకు జయమగు గాక! నీవు బయటకు వెళ్లి కార్యము సాధించు’ అని యెహోవా అన్నాడు.
22 “అహాబూ, ఇప్పుడు చూడు; యెహోవా ఒక అసత్య ఆత్మను నీ ప్రవక్తలలో ప్రవేశపెట్టాడు. నీకు కీడు మూడుతుందని యెహోవా చెప్పియున్నాడు.”
యేసు క్రీస్తు మన పాపాలకు బలి
23 అందువల్ల పరలోకంలో ఉన్న వస్తువుల ప్రతిరూపాలను బలి యిచ్చి పరిశుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని, పరలోకంలో ఉన్న వాటిని పవిత్రం చెయ్యటానికి యింకా మంచిరకమైన బలులు కావాలి. 24 భూమ్నీదవున్న ఈ పవిత్ర స్థానం నిజమైన దానికి ప్రతిరూపం మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర స్థానాన్ని కాదు ప్రవేశించింది. ఆయన మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాడు.
25 ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పశువుల రక్తంతో అతి పవిత్ర స్థానాన్ని ప్రవేశించినట్లు, ఆయన తనను తాను పదే పదే బలిగా సమర్పించుకోవటానికి పరలోకానికి వెళ్ళలేదు. 26 అలా అర్పించి ఉంటే ప్రపంచం సృష్టింప బడినప్పటి నుండి క్రీస్తు ఎన్నోసార్లు మరణించ వలసి వచ్చేది. కాని, ప్రస్తుతం యుగాల అంతంలో తనను తాను ఒకే ఒకసారి బలిగా అర్పించుకుని పాపపరిహారం చెయ్యాలని ప్రత్యక్ష్యమయ్యాడు.
27 ప్రతి ఒక్కడూ, ఒక్కసారే మరణించాలి. తర్వాత దేవుని తీర్పుకు గురి అవ్వాలి. వాళ్ళపై తీర్పు చెబుతాడు. 28 అందువల్ల, అనేకుల పాపపరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్ష్యమౌతాడు. పాపం మోయటానికి కాదు తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కలిగించటానికి ప్రత్యక్ష్యమౌతాడు.
© 1997 Bible League International