Revised Common Lectionary (Complementary)
దావీదు స్తుతి కీర్తన.
141 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము.
త్వరపడి నాకు సహాయం చేయుము.
2 యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము.
నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.
3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము.
నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
4 నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు.
చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము.
చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
5 ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు.
అది నాకు మంచిదే.
వారి విమర్శను నేను అంగీకరిస్తాను.
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
6 ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు.
అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.
7 మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది.
అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడతాయి.
8 యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను.
నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
9 ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము.
ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
10 నేను హాని లేకుండా తప్పించుకొనగా
ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.
యెహోవా తన ప్రజల మధ్య నివసించుట
43 ఆ మనుష్యుడు నన్ను తూర్పు ద్వారం వద్దకు నడిపించాడు. 2 అక్కడ ఇశ్రాయేలు దేవుని మహిమతూర్పు నుండి వచ్చింది. దేవుని కంఠస్వరం సముద్ర ఘోషలా గంభీరంగా ఉంది. దేవుని మహిమవల్ల భూమి ప్రకాశమానమయ్యింది. 3 నేను చూచిన ఆ దర్శనం గతంలో నేను కెబారు కాలువవద్ద చూచిన దర్శనంవలెనే ఉంది. నేను సాష్టాంగ నమస్కారం చేశాను. 4 తూర్పు ద్వారం గుండా దేవుని మహిమ ఆలయంలోకి వచ్చింది.
5 అప్పుడు ఆత్మ నన్ను పట్టుకొని లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. 6 ఆలయం లోపలి నుండి ఎవరో నాతో మాట్లాడుతున్నట్లు నేను విన్నాను. నా ప్రక్కన ఒక మనుష్యుడు నిలబడివున్నాడు. 7 ఆలయంలో నుండి వచ్చిన కంఠస్వరం నాతో ఇలా అన్నది: “నరపుత్రుడా, ఇది నా సింహాసనం, పాదపీఠం నెలకొని వున్న చోటు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఈ ప్రదేశంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు వంశం మరెన్నడూ నా పవిత్ర నామాన్ని పాడు చేయదు. వ్యభిచార పాపాల చేత, ఈ ప్రదేశంలో రాజుల శవాలను పాతిపెట్టిన దోషాలచేత రాజులు, వారి ప్రజలు నా పేరును అవమాన పర్చరు. 8 వారి గడప నా గడప ప్రక్కన; వారి ద్వారం నా ద్వారం ప్రక్కన నెలకొల్పి వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయరు. గతంలో కేవలం ఒక్క గోడ మాత్రమే నాకు, వారికి అడ్డంగా ఉండేది. అందుచే వారు పాపం చేసిన ప్రతిసారి, భయంకర కార్యాలు చేసినప్పుడల్లా వారు నా పేరును అవమానపర్చారు అందుచేత నాకు కోపం వచ్చి నేను వారిని నాశనం చేశాను. 9 ఇప్పుడు వారు వ్యభిచార పాపాలకు దూరం కావాలి. వారి రాజుల కళేబరాలను నాకు దూరంగా తీసుకొనిపోవాలి. అప్పుడు నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను.
10 “నరపుత్రుడా, ఇప్పుడు ఇశ్రాయేలు వంశానికి ఈ ఆలయాన్ని గురించి చెప్పు. అప్పుడు వారు తమ పాపాల పట్ల సిగ్గుపడతారు. వారు ఆలయానికి సంబంధించిన నమూనాలు నేర్చుకొంటారు. 11 పైగా వారు తాము చేసిన చెడ్డ పనులన్నిటినీ తలపోసి సిగ్గుపడతారు. ఆలయ నమూనాను వారు తెలుసుకోవాలి. అది ఎలా నిర్మింపబడిందో, ఎక్కడెక్కడ లోపలికి వచ్చే, బయటకు వెళ్లే ద్వారాలున్నాయో, ఇంకా దాని మీద వున్న చెక్కడపు పనులను గురించే వారిని తెలిసికోనిమ్ము. దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నింటినీ వారికి నేర్పు. వారు చూడగలిగే విధంగా నీవు ఈ విషయాలన్నీ వ్రాసి పెట్టు. అప్పుడు ఆలయానికి సంబంధించిన నియమ నిబంధనలు వారు తప్పక పాటిస్తారు. అప్పుడు వారు వీటన్నిటినీ చేయగులుగుతారు. 12 ఆలయ ధర్మం ఇది, పర్వతం మీది శిఖరాగ్ర ప్రదేశమంతా అతి పవిత్ర స్థలం. ఇది ఆలయ ధర్మం.
యెరూషలేము విషయంలో దుఃఖించటం
(లూకా 13:34-35)
37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. 38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. 39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”
యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం
(మార్కు 13:1-31; లూకా 21:5-33)
24 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. 2 యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు.
3 యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.
4 యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. 5 ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. 6 యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు. 7 దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. 8 అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట.
9 “ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. 10 ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. 11 దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. 12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. 13 కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. 14 ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది.
© 1997 Bible League International