Revised Common Lectionary (Complementary)
దావీదు స్తుతి కీర్తన.
141 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము.
త్వరపడి నాకు సహాయం చేయుము.
2 యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము.
నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.
3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము.
నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
4 నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు.
చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము.
చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
5 ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు.
అది నాకు మంచిదే.
వారి విమర్శను నేను అంగీకరిస్తాను.
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
6 ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు.
అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.
7 మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది.
అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడతాయి.
8 యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను.
నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
9 ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము.
ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
10 నేను హాని లేకుండా తప్పించుకొనగా
ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.
యెరూషలేము శేషులకు విరోధంగా ప్రవచనాలు
14 కాని యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 15 “నరపుత్రుడా, ఈ దేశాన్నుండి వెడలగొట్టబడిన ఇశ్రాయేలు సంతతివారగు నీ సోదరులను నీవు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇక్కడికి చాలా దూరంలో వున్న దేశంలో వారు నివసిస్తున్నారు. అయినా నేను వాళ్ళను తిరిగి రప్పిస్తాను. ‘కాని యెరూషలేములో ఉంటున్న జనులు యెహోవాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాకు ఇవ్వబడింది.’ ఇది మాది అని అంటున్నారు.
16 “కావున ఈ విషయాలు ఆ ప్రజలకు తెలియ జేయుము, మన ప్రభువైన యెహోవా చెప్పున దేమంటే, ‘నా ప్రజలు దూరదేశాలకు తరలిపోయేలా నేను ఒత్తిడి చేసిన మాట నిజమే. అనేక దేశాలలో నివసించేలా వారిని చెల్లా చెదురు చేశాను. అయినా వాళ్ళు ఆ దేశాలలో ఉన్నప్పుడు కొద్దికాలం నేనే వారి ఆలయమై ఉంటాను. 17 కావున వారి ప్రభువైన యెహోవా వారిని తిరిగి తీసుకువస్తాడని నీవు ఆ ప్రజలకు చెప్పాలి. నేను మిమ్మల్ని అనేకదేశాలకు చెదరగొట్టాను. కాని మిమ్మల్ని మళ్లీ చేరదీసి, ఆయా దేశాలనుండి తిరిగి తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు దేశాన్ని మళ్లీ మీకు ఇస్తాను! 18 నా ప్రజలు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అపవిత్రమైన విగ్రహాలన్నింటినీ వారు నాశనం చేస్తారు. 19 నేను వారందరినీ చేరదీసి, ఒక్క మనిషిలా వారిలో ఐకమత్యం కలుగజేస్తాను. వారికి నూతన ఆత్మ కలుగజేస్తాను. రాతి గుండెను తీసివేసి, దాని స్థానంలో మాంసపు గుండెను అమర్చుతాను. 20 అప్పుడు వారు నా ధర్మాలను పాటిస్తారు. వారు నా ఆజ్ఞలను పాటిస్తారు. నేను వారికి చెప్పిన పనులు చేస్తారు. అప్పుడు వారు నిజంగా నా ప్రజలవుతారు. నేను వారి దేవుడి నవుతాను.’”
యెహోవా మహిమ యెరూషలేమును వదలుట
21 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “కాని ఇప్పుడు వారి హృదయాలు ఆ భయంకరమైన, హేయమైన విగ్రహాలకు చెందివున్నాయి. కనుక ఆ ప్రజలు చేసిన దుష్కార్యాలకు నేను వారిని శిక్షించాలి.” నా ప్రభువైన యెహోవా ఆ మాటలు చెప్పాడు. 22 పిమ్మట కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలో ఎగిరిపోయారు. చక్రాలు వారితో వెళ్లాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వారిపైన ఉంది. 23 యెహోవా మహిమ గాలిలోకి లేచి యెరూషలేమును వదిలి వెళ్లింది. యెరూషలేముకు తూర్పున వున్న కొండ[a] మీద దేవుడు ఒక్క క్షణం ఆగాడు. 24 పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపి మళ్ళీ బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వచ్చాడు. ఆయన నన్ను ఇశ్రాయేలు నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల వద్దకు తీసుకొనివచ్చాడు. ఆ దర్శనంలోనే యెహోవా ఆత్మ గాలిలోకి లేచి, నన్ను వదిలి వెళ్లాడు. అవన్నీ నేను దర్శనంలో చూశాను. 25 పిమ్మట బందీలుగా వున్న (చెరపట్టబడిన) ప్రజలతో నేను మాట్లాడాను. యెహోవా నాకు చూపిన అన్ని విషయాల గురించీ వారికి చెప్పాను.
25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. 26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. 27 సాతానుకు అవకాశమివ్వకండి. 28 దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు.
29 దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్నవాళ్ళకు లాభం కలగాలి. 30 మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 31 మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. 32 దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
5 మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. 2 క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.
© 1997 Bible League International