Revised Common Lectionary (Complementary)
4 “తీర్పు సమయం వస్తుంది. అది కాలుతున్న అగ్ని గుండంలా ఉంటుంది. ఆ గర్విష్ఠులు అందరూ శిక్షించబడతారు. ఆ దుర్మార్గులు అందరూ గడ్డిలా కాలిపోతారు. ఆ సమయంలో వారు అగ్నిలో మండుతున్న ఒక పొదలా ఉంటారు-దాని కొమ్మగాని, వేరుగాని మిగలదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
2 “అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చిపెడ్తుంది. పాకనుండి విడిచిపెట్టబడిన దూడల్లా, మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు.
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
పని చెయ్యటం మీ కర్తవ్యం
6 సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు పేరిట మేము ఆజ్ఞాపిస్తున్నదేమనగా, మా నుండి విన్న క్రీస్తు సందేశం ప్రకారం జీవించక అక్రమంగా జీవిస్తున్న ప్రతి సోదరునితో సాంగత్యం చెయ్యకండి. 7 మమ్మల్ని అనుసరించాలని మీకు బాగా తెలుసు. మేము మీతో ఉన్నప్పుడు సోమరులంగా ఉండలేదు. 8 అంతేకాక మేము ఎవరి ఇంట్లోనైనా ఊరికే భోజనం చేయలేదు. మీలో ఎవ్వరికీ కష్టం కలిగించరాదని మేము రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసాము. 9 మీ నుండి అలాంటి సహాయం కోరే అధికారం మాకు ఉంది. కాని మీకు ఆదర్శంగా ఉండాలని అలా చేసాము. 10 మేము మీతో ఉన్నప్పుడే, “మనిషి పని చేయకపోతే భోజనం చేయకూడదు” అని చెప్పాము.
11 మీలో కొందరు సోమరులని విన్నాము. వాళ్ళు పని చెయ్యకపోవటమే కాకుండా ఇతరుల విషయంలో జోక్యం కలుగ చేసుకొంటున్నారని విన్నాము. 12 వాళ్ళు ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోరాదని, తాము తినే ఆహారం పనిచేసి సంపాదించాలని యేసు క్రీస్తు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. 13 ఇక మీ విషయమంటారా, మంచి చెయ్యటం మానకండి.
యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం
(మత్తయి 24:1-14; మార్కు 13:1-13)
5 ఆయన శిష్యుల్లో కొందరు ఆ మందిరానికి చెక్కబడిన రాళ్ళ అందాన్ని గురించి, ప్రజలు యిచ్చిన కానుకలతో చేసిన అలంకరణను గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు.
6 కాని యేసు, “మీరిక్కడ చూస్తూన్నవన్నీ రాయి మీద రాయి నిలువకుండా నేలమట్టమై పోయ్యే సమయం వస్తుంది” అని అన్నాడు.
7 వాళ్ళు, “అయ్యా! యివి ఎప్పుడు సంభవిస్తాయి! ఇవి జరుగబోయేముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయి” అని అడిగారు.
8 ఆయన, “జాగ్రత్త! మోసపోకండి. నా పేరిట అనేకులు వచ్చి, ‘నేనే ఆయన్ని అని, కాలం సమీపించింది’ అని అంటారు. వాళ్ళను అనుసరించకండి. 9 యుద్ధాల్ని గురించి, తిరుగుబాట్లను గురించి వింటే భయపడకండి. ఇవన్నీ ముందు జరిగి తీరవలసిందే. కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు.
10 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “దేశం దేశంతో, రాజ్యం రాజ్యంతో యుద్ధం చేస్తుంది. 11 అన్నిచోట్లా తీవ్రమైన భూకంపాలు, కరువులు, రోగాలు సంభవిస్తాయి. ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆకాశంలో భయంకర గుర్తులు కనిపిస్తాయి.
12 “కాని యివన్నీ జరుగక ముందే యూదులు మిమ్మల్ని బంధించి, హింసించి సమాజ మందిరాలకు అప్పగిస్తారు. ఆ సమాజ మందిరాల అధికారులు మిమ్మల్ని కారాగారంలో పడవేస్తారు. రాజుల ముందు, రాజ్యాధికారుల ముందు నిలబెడతారు. ఇవన్నీ నాపేరు కారణంగా జరుగుతాయి. 13 తద్వారా వాళ్ళకు సువార్తను గురించి చేప్పే అవకాశం మీకు కలుగుతుంది. 14 వాళ్ళ సమక్షంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి సిద్ధం కారాదని మీ మనస్సులో నిర్ణయించుకోండి. 15 ఎందుకంటే సరియైన సమయానికి మాట్లాడటానికి అవసరమైన పదాన్ని నేను మీకు అందిస్తాను. కావలసిన జ్ఞానం యిస్తాను. మీ ప్రతివాదులు మీ మాటల్ని ఖండించకుండా ఉండేటట్లు చేస్తాను. వాళ్ళలో తిరిగి వాదించే శక్తి లేకుండా చేస్తాను. 16 మీ తల్లి తండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు మీకు ద్రోహం చేస్తారు. మీలో కొందర్ని చంపి వేస్తారు. 17 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. 18 కాని మీ తల మీదనున్న ఒక్కవెంట్రుక కూడా రాలిపోదు. 19 సహనంతో ఉండండి. అప్పుడే మిమ్మల్ని మీరు వీటన్నిటియందు విశ్వాసం ద్వారా రక్షించుకోగలుగుతారు.
© 1997 Bible League International