Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
3 యెహోవా, మా మీద దయ చూపించుము.
మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.
యోబుకు బిల్దదు జవాబు
25 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “దేవుడే పాలకుడు.
ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి.
దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.
3 దేవుని దూతలను ఏ మనిషీ లెక్కించలేడు.
దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు.
4 కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు.
స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు.
5 దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు.
దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు.
6 మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు.
పనికి మాలిన పురుగులాంటివాడు!”
బిల్దదుకు యోబు జవాబు
26 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “బిల్దదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీనులైన మనుష్యులకు నిజంగా సహాయం చేయగలరు.
అవును, మీరు నన్ను ప్రోత్సహించారు. బలహీనమైన నా చేతులను మీరు తిరిగి బలం గలవిగా చేసారు.
3 అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు.
మీరు చాలా జ్ఞానం ప్రదర్శించారు.
4 ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం చేశారు.
ఎవరి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది?
5 “మరణించిన వారి ఆత్మలు
భూమి కింద నీళ్లలో విలవిల్లాడుతున్నాయి.
6 మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం.
దేవునికి మరణం మరుగు కాదు.
7 ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు.
దేవుడు భూమిని శూన్యంలో వేలాడతీశాడు.
8 మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు.
కానీ నీటి భారం మూలంగా మేఘాలు బద్దలు కాకుండా దేవుడు చూస్తాడు.
9 పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు.
దేవుడు తన మేఘాలను చంద్రుని మీద విస్తరింపచేసి, దానిని కప్పుతాడు
10 మహా సముద్రం మీది ఆకాశపు అంచులను
చీకటి వెలుగులకు మధ్య సరిహద్దుగా దేవుడు చేస్తాడు.
11 ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను
దేవుడు బెదిరించగా అవి భయంతో వణకుతాయి.
12 దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది.
దేవుని జ్ఞానము రాహాబు సహాయకులను నాశనం చేసింది.
13 దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది.
తప్పించుకోవాలని ప్రయత్నించిన సర్పాన్ని దేవుని హస్తం నాశనం చేస్తుంది.
14 దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే.
దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తిగలవాడో ఏ మనిషి నిజంగా అర్థం చేసుకోలేడు.”
యేసు దేవుని అధికారం కలిగియున్నాడు
19 యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు. 20 తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు. 21 తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు.
22 “అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు. 23 తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు.
24 యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట. 25 ఇది సత్యం. దేవుని కుమారుని స్వరం చనిపోయిన వాళ్ళు వినే కాలం రాబోతూవుంది. ఇప్పటికే వచ్చింది. ఆ స్వరం విన్నవాళ్ళు క్రొత్త జీవితాన్ని పొందుతారు. 26 ఎందుకంటే, జీవానికి తండ్రి ఏ విధంగా మూలపురుషుడో అదేవిధంగా కుమారుడు కూడా జీవానికి మూలపురుషుడు. కుమారుణ్ణి మూలపురుషుడుగా చేసింది తండ్రి! 27 కుమారుడు మానవావతారం పొందాడు కనుక తండ్రి ఆయనకు తీర్పు చెప్పే అధికారంయిచ్చాడు. ఆయన స్వరం వినే కాలం రానున్నది.
28 “ఆశ్చర్యపడకండి! సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం వినే కాలం రానున్నది. 29 వెలుపలికి రండి! మంచి చేసిన వాళ్ళు నిరంతరం జీవించటానికి బ్రతికి వస్తారు. కీడు చేసిన వాళ్ళు నిరంతరం శిక్షింపబడటానికి బ్రతికివస్తారు.
© 1997 Bible League International