Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
3 యెహోవా, మా మీద దయ చూపించుము.
మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.
యోబు జవాబు
21 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
17 అయితే దుర్మార్గుల దీపం ఆర్పివేయబడటం అనేది, ఎంత తరచుగా జరుగుతుంది?
దుర్మార్గులకు ఎన్నిసార్లు కష్టం వస్తుంది?
దేవుడు వారి మీద కోపగించి వారిని శిక్షిస్తాడా?
18 గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గాలి ఊకను ఎగురగొట్టినట్లు
దేవుడు దుర్మార్గులను ఎగురగొట్టి వేస్తాడా?
19 ‘తండ్రి పాపాల మూలంగా దేవుడు అతని కుమారుణ్ణి శిక్షిస్తాడు’ అని మీరంటారు.
కాదు! ఆ దుర్మార్గుడినే దేవుడు శిక్షించనివ్వండి. అప్పుడు ఆ దుర్మార్గుడు తన స్వంత పాపాల కోసమే శిక్షించబడుతున్నట్టు అతనికి తెలుస్తుంది.
20 పాపి తన స్వంత శిక్షను చూడాలి.
సర్వశక్తిమంతుడైన దేవుని కోపాన్ని అతడు అనుభవిస్తాడు.
21 దుర్మార్గుని జీవిత కాలం అయిపోయి, అతడు చనిపోయినప్పుడు
అతడు విడిచిపెడుతున్న తన కుటుంబం విషయమై అతడు లెక్కచేయడు.
22 “దేవునికి ఎవరూ జ్ఞానం ఉపదేశించలేరు.
ఉన్నత స్థానాల్లో ఉండే మనుష్యులకు కూడ దేవుడు తీర్పు తీరుస్తాడు.
23 ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక మరణిస్తాడు.
అతడు పూర్తిగా క్షేమం, సుఖం ఉన్న జీవితం జీవించాడు.
24 అతని శరీరం బాగా పోషించబడింది,
అతని ఎముకలు మూలుగతో యింకా బలంగా ఉన్నాయి
25 అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదనగల ఆత్మతో మరణిస్తాడు.
అతడు మంచిది ఎన్నడూ, ఏదీ అనుభవించలేదు.
26 వీళ్లద్దరూ ఒకే చోట దుమ్ములో పండుకొని ఉంటారు.
వాళ్లిద్దర్నీ పురుగులు పట్టేస్తాయి.
27 “కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.
మరియు మీరు నాకు అపకారం చేయాలని తలపెడుతున్నారని నాకు తెలుసు.
28 ‘యువరాజు ఇల్లు ఎక్కడ?
దుర్మార్గుడు నివసించిన ఆ ఇల్లు ఏది?’ అని మీరు అంటారు.
29 “కానీ ప్రయాణం చేసే మనుష్యులను మీరు ఎన్నడూ అడగలేదు.
వారి కథలను మీరు అంగీకరించనూ లేదు.
30 విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్టబడతారు.
ఏ రోజు దేవుడు కోపంతో శిక్షిస్తాడో ఆ రోజు వాళ్లు రక్షింపబడతారు.
31 దుర్మార్గుడు చేసిన దుర్మార్గాన్ని గూర్చి దుర్మార్గుని ముఖంమీదే అతణ్ణి విమర్శించే వ్యక్తి ఎవ్వడూ లేడు.
అతడు చేసిన కీడుకు అతనిని ఎవ్వరూ శిక్షించరు.
32 దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు
ఒక కాపలావాడు అతని సమాధి దగ్గర నిలుస్తాడు.
33 ఆ దుర్మార్గునికి లోయలోని మట్టి తియ్యగా ఉంటుంది.
వాని చావు ఊరేగింపులో వేలాది మంది ఉంటారు.
34 “అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను ఆదరించలేరు.
మీ జవాబులు ఇంకా అబద్ధాలే!”
1 దేవుడు ఎన్నుకున్న అమ్మగారికి, ఆమె సంతానానికి, పెద్దనైన నేను వ్రాస్తున్నది ఏమనగా, 2 మీ పట్ల నాకు నిజమైన ప్రేమవుంది. సత్యం మాలో శాశ్వతంగా ఉంది కాబట్టే, నాకే కాకుండా సత్యం తెలిసిన వాళ్ళందరికీ మీ పట్ల ప్రేమ ఉంది.
3 తండ్రి అయిన దేవుడు, తండ్రి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు మనకు సత్యంతో, ప్రేమతో ఇచ్చిన కృప, దయ, శాంతి మనలో ఉండాలని కోరుతున్నాను.
4 మీ సంతానంలో కొందరు, తండ్రి ఆజ్ఞాపించినట్లు నిజాయితీగా జీవిస్తున్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. 5 అమ్మా! మొదటినుండి ఉన్న ఆజ్ఞనే నేను మీకు వ్రాస్తున్నాను కాని, క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మనము పరస్పరం ప్రేమతో ఉండాలని అంటున్నాను. 6 ఆయన ఆజ్ఞల్ని విధేయతతో పాటించటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్నట్లు, ప్రేమతో జీవించుమని ఆయన ఆజ్ఞాపించాడు.
7 యేసు క్రీస్తు శరీరంతో రాలేదనే మోసగాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో వ్యాపించారు. వాళ్ళు మోసగాళ్ళు; క్రీస్తు విరోధులు. 8 పని చేయటంవల్ల లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. సంపూర్ణమైన ఫలం లభించేటట్లు చూసుకోండి.
9 క్రీస్తు ఉపదేశాన్ని ఉల్లంఘించినవానిపై దేవుని అనుగ్రహం ఉండదు. ఆ ఉపదేశానుసారం నడుచుకొనేవానిపై తండ్రి, కుమారుల అనుగ్రహం ఉంటుంది. 10 ఈ ఉపదేశం తమ వెంట తీసుకురాకుండా మీ దగ్గరకు వచ్చినవాణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాంటివాణ్ణి పలుకరించకండి. 11 ఎవరైనా అలాంటివాణ్ణి పలుకరిస్తే, ఆ పలుకరించబడినవాడు చేసిన చెడ్డ పనుల్లో అతడు కూడ భాగస్థుడౌతాడు.
12 నాకింకా ఎన్నో విషయాలు వ్రాయాలని ఉంది. కాని కాగితాన్ని, సిరాను ఉపయోగించటం నాకు యిష్టం లేదు. నేను మిమ్మల్ని కలిసి ముఖాముఖి మీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. అప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. 13 దేవుడు ఎన్నుకొన్న మీ సోదరి యొక్క సంతానం,[a] వాళ్ళ అభివందనాలు మీకు తెలుపుతున్నారు.
© 1997 Bible League International