Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
3 యెహోవా, మా మీద దయ చూపించుము.
మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.
జోఫరు జవాబు
20 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
2 “యోబూ! నా తలంపులు నాకు జవాబిస్తాయి.
నేను అనుకొంటున్నది ఏమిటో నేను త్వరపడి నీకు చెప్పాలి.
3 మేము చెప్పిన దానికి నీవు ఇచ్చిన జవాబులు మాకు అవమానకరంగా ఉన్నాయి.
కానీ నేను జ్ఞానం గలవాడను, నీకు ఎలా జవాబు ఇవ్వాలో నాకు తెలుసు.
4-5 “మొట్ట మొదటిసారిగా ఆదాము భూమి మీద చేయ బడినప్పటి నుండి
ఒక దుర్మార్గుని సంతోషం ఎక్కువ సేపు ఉండదు అనే విషయం చాలా కాలంగా నీకు తెలిసిందే.
దేవుని లక్ష్యపెట్టని వాని ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుంది.
6 ఒకవేళ దుర్మార్గుని గర్వం ఆకాశాన్ని అంటవచ్చు.
అతని తల మేఘాలను తాకవచ్చు.
7 కానీ అతని స్వంత మలం పోయినట్లే అతడు శాశ్వతంగా పోతాడు.
అతన్ని ఎరిగిన ప్రజలు, ‘అతడు ఎక్కడ?’ అని అంటారు.
8 ఒక కల వేగంగా ఎగిరిపోయినట్టు అతడు ఎగిరి పోతాడు.
ఏ మనిషీ మరల అతణ్ణి చూడడు. అతడు పోయి ఉంటాడు. రాత్రి పూట పీడకలలా అతడు వదిలించబడతాడు.
9 అతనిని చూచిన మనుష్యులు అతన్ని మరల చూడరు
అతని కుటుంబం అతన్ని మరల ఎన్నడూ చూడదు.
10 దుర్మార్గుని పిల్లలు, పేదవారి దగ్గర అతడు తీసుకొన్న వాటిని తిరిగి ఇచ్చివేస్తారు.
దుర్మార్గుని స్వహస్తాలే తన ఐశ్వర్యాన్ని తిరిగి ఇచ్చివేయాలి.
11 అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం బలంగా ఉంటుంది.
కాని త్వరలోనే అది మట్టి అవుతుంది.
ప్రవచన వాక్యం
16 యేసు క్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము మీకు చెప్పలేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా చూసాము. 17 ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా, గొప్ప బలముగల స్వరము వినిపించింది: “ఈయన నా కుమారుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది”[a] అని, 18 పవిత్రమైన పర్వతంపై మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకంనుండి ఈ స్వరం వినిపించటం మేము స్వయంగా విన్నాము.[b]
19 అందువల్ల, ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు యింకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే వెలుగులాంటిది. సూర్యోదయమయ్యే వరకూ, వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి. 20 అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. 21 ఎందుకంటే, “ప్రవచనం” మానవులు తమ యిష్ట ప్రకారం పలికింది కాదు. పవిత్రాత్మచే ప్రేరేపణ పొంది వాళ్ళు దేవుణ్ణుండి సందేశాన్ని పలికారు.
© 1997 Bible League International