Revised Common Lectionary (Complementary)
దావీదు ప్రార్థన.
17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
నీవు సత్యాన్ని చూడగలవు.
3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
5 నేను నీ మార్గాలు అనుసరించాను.
నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
కనుక ఇప్పుడు నా మాట వినుము.
7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
8 నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
9 యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
13 దానికి మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని చెబితే, ‘ఆ దేవుడి పేరేమిటి’ అని వాళ్లు నన్ను అడుగుతారు గదా! మరి నేనేమని చెప్పాలి,” అని దేవుణ్ణి అడిగాడు.
14 “‘నేను ఉన్నవాడను’[a] (అని వారితో చెప్పు) అన్నాడు దేవుడు మోషేతో. ఇశ్రాయేలీయుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, ‘ఉన్నవాడను,’ అనువాడు నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్పు” అన్నాడు దేవుడు మోషేతో. 15 దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఎల్లప్పుడూ నా పేరు యెహోవాగానే[b] ఉంటుంది. తరతరాల ప్రజలు ఆ పేరుతోనే నన్ను తెలుసుకొంటారు. ‘యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని వాళ్లతో చెప్పు.
16 “వెళ్లి ఇశ్రాయేలు సమాజంలోని పెద్దలందరిని సమావేశపరిచి, ‘మీ పూర్వీకుల దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షం అయ్యాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాతో మాట్లాడాడు. మిమ్మల్ని గూర్చి ఈజిప్టులో మీకు సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచించాను. 17 ఈజిప్టులో మీరు అనుభవిస్తున్న శ్రమలనుండి మిమ్మల్ని తప్పించాలనే నిర్ణయానికొచ్చాను. ప్రస్తుతం కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, అనే రకరకాల ప్రజలకు చెందిన ఒక దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను. చాలా మంచి మంచి వాటితో నిండిన ఒక మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను’ అని వాళ్లతో చెప్పు.
18 “పెద్దలు (నాయకులు) నీ మాట వింటారు. అప్పుడు నీవు, పెద్దలు (నాయకులు) కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్లాలి. ‘హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు. మూడు రోజుల దూరము అరణ్యంలోనికి ప్రయాణం చేసి వెళ్లమని ఆయన చెప్పాడు. అక్కడ మా యెహావా దేవునికి మేము బలులు అర్పించాలి. అని నీవు అతనితో చెప్పాలి.’
19 “అయితే ఈజిప్టు రాజు మిమ్మల్ని పోనియ్యడని నాకు తెలుసు. అతడు మిమ్మల్ని పోనిచ్చేటట్టు ఒక మహాశక్తి మాత్రమే అతణ్ణి బలవంతం చేస్తుంది. 20 కనుక ఈజిప్టు మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. ఆ దేశంలో అద్భుతాలు జరిగేటట్టు చేస్తాను. నేను అలా చేసిన తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు.
యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం
(మత్తయి 21:23-27; మార్కు 11:27-33)
20 ఒక రోజు మందిరంలో యేసు ప్రజలకు బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధానయాజకులు, శాస్త్రులు, పెద్దలు అంతా కలిసి ఆయన దగ్గరకు వచ్చారు. 2 “ఎవరిచ్చిన అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు? చెప్పు” అని వాళ్ళు అడిగారు.
3 ఆయన, “నన్నొక ప్రశ్న అడుగనివ్వండి. 4 యోహానుకు బాప్తిస్మము నిచ్చే అధికారం ఎవరిచ్చారు? దేవుడా? లేక ప్రజలా” అని అన్నాడు.
5 వాళ్ళు పరస్పరం ఈ విధంగా చర్చించుకున్నారు: “దేవుడంటే, అతడు ‘మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అంటాడు 6 ప్రజలంటే, ‘ప్రజలు యోహానును ఒక ప్రవక్త అని విశ్వాసిస్తూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు మనల్ని రాళ్ళతో కొడతారు.’ 7 అందువల్ల ఆ అధికారం ఎక్కడినుండి వచ్చిందో మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
8 యేసు, “మరి అలాగైతే నేను కూడా ఎవరి అధికారంతో యివన్నీ చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.
© 1997 Bible League International