Revised Common Lectionary (Complementary)
దావీదు ప్రార్థన.
17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
నీవు సత్యాన్ని చూడగలవు.
3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
5 నేను నీ మార్గాలు అనుసరించాను.
నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
కనుక ఇప్పుడు నా మాట వినుము.
7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
8 నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
9 యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
యూదా మరియు తామారు
38 సుమారు అదే సమయంలో యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒకతని దగ్గర ఉండేందుకు వెళ్లాడు. హీరా అదుల్లాము నివాసి. 2 అక్కడ యూదా ఒక కనానీ అమ్మాయిని కలుసుకొని ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు షూయ. 3 ఆ కనానీ స్త్రీకి ఒక కుమారుడు పుట్టగా, వారు అతనికి ఏరు అని పేరు పెట్టారు. 4 తర్వాత ఆమె మరో కుమారుని కన్నది. ఆ కుమారునికి వారు ఓనాను అని పేరు పెట్టారు. 5 తర్వాత షేలా అనే పేరుగల ఇంకో కుమారుడు ఆమెకు పుట్టాడు. యూదాకు మూడో కుమారుడు పుట్టినప్పుడు, అతడు కజీబులో నివాసం ఉంటున్నాడు.
6 యూదా తన మొదటి కుమారుడైన ఏరుకు భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయి పేరు తామారు. 7 కానీ ఏరు చాలా చెడ్డపనులు చేశాడు. అతని విషయంలో యెహోవాకు సంతోషం లేదు. అందుచేత యెహోవా అతణ్ణి చంపేశాడు. 8 అప్పుడు యూదా ఏరు సోదరుడైన ఓనానుతో, “పోయి, చనిపోయిన నీ సోదరుని భార్యతో శయనించు. ఆమెకు భర్తలా ఉండు. పిల్లలు పుడితే వారు నీ సోదరుడైన ఏరు పిల్లలుగా పరిగణించబడతారు” అని చెప్పాడు.
9 ఈ సంబంధంవలన కలిగే పిల్లలు తన పిల్లలుగా పరిగణింపబడరని ఓనానుకు తెలుసు. ఓనాను తామారుతో శయనించి, ఇంద్రియమును బయట పడవేశాడు. 10 దీనితో యెహోవాకు కోపము వచ్చి ఆయన ఓనానును చంపేశాడు. 11 అప్పుడు యూదా, “నీవు తిరిగి నీ తండ్రి యింటికి వెళ్లిపో. నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్లీ పెళ్లి చేసుకోకు” అని తన కోడలైన తామారుతో చెప్పాడు. షేలా కూడ తన అన్నల్లాగే చస్తాడేమోనని యూదాకు భయం. అతని కోడలు తామారు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది.
12 ఆ తర్వాత షూయ కుమార్తె, యూదా భార్య చనిపోయింది. యూదాకు దుఃఖ కాలం తీరిపొయ్యాక, అతడు తన స్నేహితుడు, అదుల్లాము నివాసి హీరాతో కలిసి తిమ్నాతునకు వెళ్లాడు. తన గొర్రెల బొచ్చు కత్తిరించాలని యూదా తిమ్నాతునకు వెళ్లాడు. 13 తామారు తన మామగారు యూదా తన గొర్రెల బొచ్చు కత్తిరించేందుకు తిమ్నాతునకు వస్తున్నాడని తెలుసుకొంది. 14 తామారు ఎప్పుడు విధవరాలి గుడ్డలే ధరించేది. కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి, నెత్తిమీద ముసుగు వేసుకొంది. అప్పుడు తిమ్నాతునకు దగ్గర్లో ఏనాయిము అనే పట్టణానికి పోయే మార్గంలో కూర్చొంది. యూదా చిన్న కుమారుడు షేల ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. అయినా గాని ఆమె అతణ్ణి పెళ్లి చేసికొనే ఏర్పాట్లు యూదా చేయటం లేదు.
15 యూదా ఆ మార్గాన ప్రయాణం చేశాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.) 16 కనుక యూదా ఆమె దగ్గరకు వెళ్లి, “నన్ను నీతో లైంగింకంగా కలవనీ” అని అడిగాడు. (ఆమె తన కోడలు తామారు అని యూదాకు తెలియదు.)
“అసలు నీవు ఏ మాత్రం ఇస్తావేంటి?” అంది ఆమె.
17 యూదా, “నా మందలోనుంచి ఒక మేక పిల్లను పంపిస్తా” అని జవాబిచ్చాడు.
“సరే, ఒప్పుకొంటాను. కాని నీవు ఆ మేక పిల్లను పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకొనేందుకు నీవు యింకేమైన నాకు ఇవ్వాలి సుమా” అని జవాబు చెప్పింది ఆమె.
18 “నేను నీకు మేకపిల్లను పంపిస్తానని రుజువుగా ఉండేందుకు నన్నేమి ఇవ్వమంటావు?” అడిగాడు యూదా.
తామారు, “నీవు నీ ఉత్తరాల మీద ఉపయోగించే నీ ముద్ర, దాని దారం, నీ చేతి కర్ర ఇవ్వు” అని చెప్పింది. యూదా అవన్నీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు యూదా తామారును కూడగా ఆమె గర్భవతి అయ్యింది. 19 తామారు ఇంటికి వెళ్లి, తన ముఖం మీద ముసుగు తీసివేసింది. మరల విధవ వస్త్రాలే ఆమె ధరించింది.
20 యూదా తామారుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను ఏనాయిముకు పంపించాడు. మరియు ఆమె దగ్గర్నుండి ప్రత్యేక ముద్రను, చేతి కర్రను తీసుకొని రమ్మని యూదా అతనితో చెప్పాడు. కానీ హీరాకు ఆమె కనబడలేదు. 21 “ఇక్కడ దారి ప్రక్కగా ఉంటూండే ఆ వేశ్య ఏమయింది?” అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా.
“ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే” అని వాళ్లు అన్నారు.
22 కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు తిరిగి వెళ్లి, “ఆ స్త్రీ నాకు కనబడలేదు. అక్కడ ఎన్నడూ వేశ్య లేదని అక్కడ ఉండేవాళ్లు చెప్పారు” అన్నాడు.
23 అందుచేత యూదా, “ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు. మనుష్యులు నన్ను చూచి నవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నం చేశాను, కానీ ఆమె మనకు కనబడలేదు. అది చాలు” అన్నాడు.
తామారు గర్భవతి
24 మూడు నెలల తర్వాత, “నీ కోడలు తామారు ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది” అని యూదాతో చెప్పారు.
అప్పుడు యూదా, “ఆమెను బయటకు లాగి చంపేసి, ఆమె శరీరాన్ని కాల్చివేయండి” అన్నాడు.
25 తామారును చంపటానికి మనుష్యులు వెళ్లారు. అయితే ఆమె తన మామగారికి ఒక సందేశం పంపింది. “నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల స్వంతదారుడే. (ప్రత్యేక ముద్ర, చేతి కర్ర ఆమె అతనికి చూపించింది.) ఈ వస్తువులు చూడు. ఇవి ఎవరివి? ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతి కర్ర ఎవరిది?”
26 వాటిని యూదా గుర్తుపట్టి, “ఆమెదే సరి. నాదే తప్పు. నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడైన షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు” అన్నాడు. యూదా మళ్లీ ఇక ఆమెతో శయనించలేదు.
పౌలు నిర్దోషినని ఫేలిక్సుముందు చెప్పుకొనటం
10 రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను. 11 నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్నదానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు. 12 నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు. 13 వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.
14 “వాళ్ళు, దేన్ని వేరొక మతంగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వికుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. 15 వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. 16 అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.
17 “పేదవాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేముకు వచ్చాను. 18 నేనీ కార్యాలు మందిరావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు. 19 కాని ఆసియనుండి అక్కడికి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది. 20 నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఇక్కడ నిలుచున్నవాళ్ళను చెప్పమనండి. 21 ఔను! నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచొని బిగ్గరగా ‘చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈ రోజు నేరస్థునిగా నిలుచున్నాను’ అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.”
22 యేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫేలిక్సు సభను ముగిస్తూ, “సహస్రాధిపతి లూసియ వచ్చాక నీ విషయం నిర్ణయిస్తాను” అని అన్నాడు. 23 శతాధిపతితో, “పౌలును కాపలాలో ఉంచు! కాని కొంత స్వేచ్ఛనివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా ఇవ్వటానికి వస్తే వాళ్ళనాపవద్దు” అని అన్నాడు.
© 1997 Bible League International