Revised Common Lectionary (Complementary)
ఆసాపు కీర్తనలలో ఒకటి.
50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
2 సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
3 మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
ఆయన యెదుట అగ్ని మండుతుంది.
ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
5 “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.
6 అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.
7 దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
8 నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.
9 మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను.
మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు.
పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు
ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.”
14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,
దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.
15 “ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!
నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”
16 దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు,
“నా న్యాయ విధులను చదువుటకు,
నా ఒడంబడికకు బద్ధులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?[a]
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.
నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడతారు.
వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.
19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు.
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబుతారు.
మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను
నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు.
కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను.
మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”
యెహోవా దయాదాక్షిణ్యాలను కోరుట
7 దర్యావేషు పర్షియా రాజుగావున్న కాలంలో నాలుగవ సంవత్సరంలో యెహోవానుండి జెకర్యా ఒక వర్తమానం అందుకున్నాడు. ఇది తొమ్మిదవ నెలలో (కిస్లేవు) నాల్గవ రోజున జరిగింది. 2 బేతేలు ప్రజలు షెరెజెరును, రెగెమ్మెలెకును, వారి మనుష్యులను యెహోవా వద్దకు ఒక ప్రశ్న అడగటానికి పంపారు. 3 వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో ఉన్న ప్రవక్తలు, యాజకుల వద్దకు వెళ్లారు. ఆ మనుష్యులు వారిని ఈ ప్రశ్న అడిగారు: “ఆలయ వినాశనానికి కొన్ని సంవత్సరాలుగా మా విషాదాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాము. ప్రతి సంవత్సరం ఐదవ నెలలో ఒక ప్రత్యేక సంతాపదినాన్ని, నిరాహార దీక్షను పాటిస్తున్నాము. మేము ఇలా చేస్తూ ఉండవలసిందేనా?”
4 సర్వశక్తిమంతుడైన యెహోవానుండి నేను ఈ వర్తమానం అందుకున్నాను: 5 “ఈ దేశంలోని యాజకులకు, తదితర ప్రజలకు ఈ విషయం చెప్పు, ‘మీరు ఉపవాసాలు చేసి, మీ సంతాపాన్ని ఐదవ నెలలోను, ఏడవ నెలలోను ప్రకటించారు. నిజానికి ఆ ఉపవాసం నా కొరకకేనా? కాదు! 6 మరియు మీరు తినటం, తాగటం కూడ నా కొరకేనా? కాదు! అది మీ మంచి కొరకు మాత్రమే. 7 దేవుడు ఏనాడో ఈ విషయాలు చెప్పటానికి ఆనాటి ప్రవక్తలను వినియోగించాడు. యెరూషలేము జనంతో నిండి, ఐశ్వర్యంతో తులతూగేనాడే ఆయన ఈ విషయాలు చెప్పాడు. యెరూషలేము చుట్టూవున్న పట్టణాలలో, దక్షిణ పల్లపు ప్రాంతంలో, పడమటి కొండవాలులలో ప్రజలు నివసిస్తున్న రోజులలోనే దేవుడు ఈ విషయాలు చెప్పాడు.’”
8 యెహోవా నుండి జెకర్యాకు వచ్చిన వర్తమానం ఇది:
9 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“ఏది ధర్మమో, ఏది న్యాయమో మీరది చేయాలి.
మీరందరూ ఒకరికొకరు దయ,
కరుణ కలిగి ఉండాలి.
10 విధవ స్త్రీలను, అనాథ పిల్లలను,
కొత్తవారిని, పేదవారిని బాధించవద్దు.
కనీసం ఒకరికొకరు కీడు చేసుకోవాలనే
ఆలోచన కూడా మీరు రానీయకండి!”
11 కాని ఆ ప్రజలు ఇది వినటానికి నిరాకరించారు.
ఆయన కోరింది చేయటానికి వారు నిరాకరించారు.
దేవుడు చెప్పింది వినకుండా వుండేటందుకు వారు
తమ చెవులు మూసుకున్నారు.
12 వారు చాలా మొండి వైఖరి దాల్చారు.
వారు న్యాయాన్ని పాటించరు.
ఆత్మ ప్రేరణతో సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలకు
ప్రవక్తల ద్వారా వర్తమానాలు పంపాడు.
కాని ప్రజలు వాటిని వినలేదు.
అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా మిక్కిలి కోపగించాడు.
13 కావున సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు,
“నేను వారిని పిలిచాను,
కాని వారు పలకలేదు.
అందువల్ల ఇప్పుడు వారు పిలిస్తే
నేను పలకను.
14 ఇతర దేశాలను వారి మీదికి ఒక తుఫానులా తీసుకువస్తాను.
వారెవరో వీరికి తెలియదు;
కాని వారు దేశంలో తిరిగాక
అది నాశనమై పోతుంది.
రమ్యమైన ఈ దేశం నాశనమై పోతుంది.”
5 మీకీ విషయాలన్నీ తెలుసు. అయినా కొన్ని విషయాలు జ్ఞాపకం చెయ్యాలని అనుకొంటున్నాను. ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉండిన తన ప్రజలకు, ప్రభువు స్వేచ్ఛ కలిగించాడు. కాని ఆ తర్వాత వాళ్ళలో విశ్వాసం లేని వాళ్ళను నాశనం చేసాడు. 6 తమ తమ స్థానాలను, అధికారాలను వదిలిన దేవదూతలను దేవుడు చిరకాలపు సంకెళ్ళతో అంధకారంలో బంధించి ఉంచాడు. చివరి రోజుదాకా అదేవిధంగా బంధించి ఉంచుతాడు. 7 సొదొమ, గొమొఱ్ఱా పట్టణాల ప్రజలు, వాటి పరిసర పట్టణాల్లోని ప్రజలు లైంగిక అవినీతికి, అసహజమైన లైంగిక సహవాసాలకు లోనైపొయ్యారు. అందువల్ల వాళ్ళు శాశ్వతమైన మంటల్లో శిక్షననుభవించారు. తద్వారా ఈ సంఘటన కూడా ఇతరులకు నిదర్శనంగా నిలిచిపోయింది.
8 వాళ్ళలాగే కలలుగనే ఈ దుర్బోధకులు తమ శరీరాల్ని మలినం చేసికొంటూ, అధికారాన్ని ఎదిరిస్తూ, దేవదూతల్ని దూషిస్తూ ఉంటారు. 9 కాని ప్రధాన దేవదూత అయిన మిఖాయేలు కూడా తాను మోషే దేహం విషయంలో వాదించినప్పుడు సాతాన్ని నిందించలేదు. వాణ్ణి దూషించ లేదు. అతడంత ధైర్యం చెయ్యలేకపొయ్యాడు. సాతానుతో, “ప్రభువు నిన్ను గద్దిస్తాడు” అని మాత్రం అన్నాడు.
10 ఈ దుర్బోధకులు తమకర్థం కాని విషయాన్ని గురించి దూషిస్తూ మాట్లాడుతారు. తెలివిలేక లౌకికంగా అర్థం చేసికొంటారు. పశువుల్లా వీటి ద్వారా నశించిపోతారు. 11 వీళ్ళు కయీను మార్గాన్ని అనుసరించారు. లాభం కోసం బిలాము చేసిన తప్పునే చేసారు. కోరహు వలె తిరుగుబాటు చేసి అతనిలాగే నశించిపొయ్యారు. వీళ్ళకు శ్రమ కలుగుగాక!
12 వీళ్ళు మీరు చేసే సమాజ విందుల్లో ఏ మాత్రం సిగ్గు లేకుండా పాల్గొంటారు. తమ కడుపులు బాగా నింపుకొంటారు. గాలికి ఎగిరే నీళ్ళులేని మేఘాల్లాంటి, ఫలమివ్వని ఎండిన వృక్షంలాంటివాళ్ళు. వ్రేళ్ళు పెకిలింపబడి రెండు సార్లు చనిపోయిన వృక్షంలాంటివాళ్ళు. 13 అవమానమనే నురుగు కక్కే సముద్రపు కెరటాల్లాంటివాళ్ళు. ఆకాశంలో గతితప్పి తిరిగే నక్షత్రాల్లాంటివాళ్ళు. వారి కోసం దేవుడు గాఢాంధకారాన్ని శాశ్వతంగా దాచి ఉంచాడు.
14 ఆదాము తర్వాత ఏడవ వాడైన హనోకు వీళ్ళను గురించి ఈ విధంగా ప్రవచించాడు: “అదిగో! ప్రభువు వేలకొలది పరిశుద్ధులతో కలిసి వస్తున్నాడు. 15 వచ్చి అందరిపై తీర్పు చెపుతాడు. దుర్మార్గపు పనులు చేసే అవిశ్వాసుల్ని, తమకు వ్యతిరేకంగా చెడు మాట్లాడే పాపుల్ని శిక్షిస్తాడు.”
16 ఈ దుర్బోధకులు సణుగుతూ తప్పులెంచుతూ ఉంటారు. తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ, ప్రగల్భాలు చెప్పుకొంటూ తమ లాభం కోసం ఇతర్లను పొగుడుతూ ఉంటారు.
హెచ్చరికలు, ఉపదేశాలు.
17 కాని ప్రియ మిత్రులారా! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. 18 “చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించేవాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ వస్తారు” అని అపొస్తలులు చెప్పారు. 19 వాళ్ళు ప్రస్తావించిన ఈ దుర్బోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్బోధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఉండదు.
20 కాని ప్రియ మిత్రులారా! మీలో ఉన్న విశ్వాసం అతి పవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి. పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి. 21 దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచుకొని ఉండండి.
© 1997 Bible League International