Revised Common Lectionary (Complementary)
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
1 ఆమోజు కుమారుడు యెషయా దర్శనం ఇది. యూదాకు, యెరూషలేముకు సంభవించే సంగతులను దేవుడు యెషయాకు చూపించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదాకు రాజులుగా ఉన్న కాలవ్యవధిలో ఈ సంగతులను యెషయా చూశాడు.
తన ప్రజల విరుద్ధంగా దేవుని వాదం
2 ఆకాశమా, భూమీ, యెహోవా మాట వినండి! యెహోవా ఇలా చెబుతున్నాడు.
“నా పిల్లల్ని నేను పెంచాను. నా పిల్లలు పెరగటానికి నేను సహాయం చేసాను.
కానీ నా పిల్లలు నా మీద తిరగబడ్డారు.
3 ఎద్దుకు తన కామందు తెలుసు.
గాడిదకు దాని సొంతదారుడు మేత పెట్టే చోటు తెలుసు.
కానీ ఇశ్రాయేలు ప్రజలకు నేను తెలియదు.
నా ప్రజలు గ్రహించరు.”
4 ఇశ్రాయేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు మోయాల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుణ్ణి) ఆ ప్రజలు అవమానించారు. వాళ్లు దేవుణ్ణి విడిచిపెట్టి, పరాయి వాళ్లలా ఉన్నారు.
5 దేవుడు చెబుతున్నాడు: “ప్రజలారా నేనెందుకు మిమ్మల్ని శిక్షిస్తూనే ఉండాలి? నేను మిమ్మల్ని శిక్షించాను. కాని మీరు మారలేదు. మీరు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతి తల, ప్రతిగుండె వ్యాధితో ఉన్నాయి. 6 మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు శ్రద్ధ తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. వాటికి కట్లు కట్టలేదు.
7 “మీ దేశం పాడైపోయింది. మీ పట్టణాలు అగ్నితో కాల్చివేయబడ్డాయి. మీ దేశాన్ని మీ శత్రువులు స్వాధీనం చేసుకొన్నారు. సైన్యం నాశనం చేసిన దేశంలా మీ భూమి పాడు చేయబడింది.”
యెరూషలేముకు హెచ్చరిక
8 ఇప్పుడు సీయోను కుమార్తె (యెరూషలేము) ద్రాక్ష తోటలో విడువబడిన ఖాళీ గుడారంలా ఉంది. దోస పాదుల్లో విసర్జించబడిన పాత గుడిసెలాగ ఉంది. అది శత్రువులచేత ఓడించబడిన పట్టణంలా ఉంది. 9 ఇది నిజమే, కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా కొద్ది మంది ప్రజలను బ్రతకనిచ్చాడు. సొదొమ, గొమొర్రా పట్టణాల్లా మనం సర్వనాశనం చేయబడలేదు.
39 “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు! 40 నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు. 41 మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు.
వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు.
42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు. 43 మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. 44 మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి.
45 “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు. 46 నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. 47 దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”
© 1997 Bible League International