Revised Common Lectionary (Complementary)
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
8 దుర్మార్గులు అర్పించే అర్పణలు యెహోవాకు అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు వినటం యెహోవాకు సంతోషం.
9 దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు అసహ్యం. మంచి పనులను చేయాలని ప్రయత్నించే మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
10 ఒక వ్యక్తి అక్రమంగా జీవించటం మొదలు పెడితే అతడు శిక్షించబడుతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని మనిషి నాశనం చేయబడతాడు.
11 మరణస్థానంలో జరిగేదానితో సహా, సమస్తం యెహోవాకు తెలుసు. కనుక మనుష్యుల హృదయాల్లో, మనస్సుల్లో ఏమి జరుగుతుందో యెహోవాకు నిశ్చయంగా తెలుసు.
24 జ్ఞానముగల మనిషి చేసే పనులు విజయానికి నడిపిస్తాయి. అతడు మరణ స్థానానికి దిగజారిపోకుండా ఆ విషయాలు అతనిని వారిస్తాయి.
25 గర్విష్ఠికి ఉన్న గృహమును యెహోవా నాశనం చేస్తాడు. అయితే విధవరాలి వస్తువులను యెహోవా కాపాడుతాడు.
26 చెడు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కాని దయగల మాటల విషయంలో యెహోవా సంతోషిస్తాడు.
27 ఒక వ్యక్తి వస్తువులు సంపాదించటం కోసం దురాశపడితే అతడు తన కుటుంబానికి కష్టం తెచ్చి పెడ్తాడు. కాని లంచగొండితనాన్ని ద్వేషించే నిజాయితీపరుడు బతుకుతాడు.
28 మంచి మనుష్యులు జవాబు చెప్పక ముందు ఆలోచిస్తారు. అయితే దుర్మార్గులు ఆలోచించక ముందే మాట్లాడేస్తారు. అది వారికి కష్ఠం కలిగిస్తుంది.
29 యెహోవా దుర్మార్గులకు చాలా దూరంగా ఉంటాడు. కాని మంచివాళ్ల ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ వింటాడు.
30 నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోషపెడ్తాడు. శుభవార్త మనుష్యులకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది.
31 ఒక మనిషి తాను తప్పు చేసినప్పుడు, దానిని సరిదిద్దుటకు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేవాడు చాలా జ్ఞానముగలవాడు.
32 ఒకడు నేర్చుకొనేందుకు నిరాకరిస్తే అతడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. అయితే ఒక మనిషి తాను చేసింది తప్పు అని చెప్పినప్పుడు వినే మనిషి మరీ ఎక్కువగా గ్రహిస్తాడు.
33 యెహోవాను గౌరవించువాడు జ్ఞానము గలిగి ఉండటానికి నేర్చుకొంటున్నాడు. ఒక వ్యక్తి నిజంగా యెహోవాను గౌరవించేముందు, వినమ్రుడవ్వాలి.
1 దైవేచ్ఛ వల్ల యేసు క్రీస్తు అపొస్తులునిగా ఉన్న పౌలు నుండి, మన సోదరుడైన తిమోతి నుండి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతంలోని పవిత్రులకు.
2 మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించాలని కోరుతున్నాను.
దేవునికి వందనాలు చెల్లించుట
3 మన యేసు క్రీస్తు ప్రభువును, తండ్రియైన దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుడు దయామయుడు. మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. 4 ఆయన మన కష్టాలు తొలగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయనలాగే మనము కూడా యితరుల కష్టాలు తొలగించటానికి సహాయం చెయ్యాలని ఆయన ఉద్దేశం. 5 క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము. 6 మీకు సహాయం చెయ్యాలని, రక్షణ కలగాలని మేము కష్టాలు అనుభవిస్తున్నాము. మీకు సహాయం చెయ్యటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం వల్ల మేము అనుభవించిన కష్టాలు మీరు కూడా అనుభవించేటట్లు మీలో సహనం కలుగుతుంది. 7 నాకు మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు పంచుకొన్నట్లుగానే, మాకు కలిగే సహాయాన్ని కూడా పంచుకొంటారని మాకు తెలుసు.
8 మేము ఆసియ ప్రాంతంలో అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. మాకు అక్కడ తీవ్రమైన కష్టాలు కలిగాయి. అవి మేము మోయలేనంతగా ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది. 9 మా మనస్సులకు మరణదండన పొందినట్లు అనిపించింది. మమ్మల్ని మేము నమ్ముకోరాదని, చనిపోయినవాళ్ళను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది. 10 దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావునుండి రక్షించాడు. ఇక ముందు కూడా రక్షిస్తాడు. మాకు ఆయన పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. 11 మీరు ప్రార్థించి మాకు సహాయం చెయ్యాలి. ఎంతమంది ప్రార్థిస్తే దేవుడు మాకు అంత సహాయం చేస్తాడు. దేవుడు మాకు ఆ సహాయం చేసాక, అందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం కలుగుతుంది.
© 1997 Bible League International