Revised Common Lectionary (Complementary)
8 సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించే
యాకోబు దేవా, నా మాట వినుము.
9 దేవా, మా సంరక్షకుని కాపాడుము.
నీవు ఏర్పరచుకొన్న రాజుకు దయ చూపుము.[a]
10 దేవా, నేను మరో స్థలంలో వెయ్యి రోజులు గడుపుటకంటె
నీ ఆలయంలో ఒక్కరోజు ఉండుట మేలు.
దుర్మార్గుల ఇంటిలో నివసించుటకంటె
నా దేవుని ఆలయ ద్వారము దగ్గర నేను నిలిచియుండుట మేలు.
11 యెహోవా మా సంరక్షకుడు, మహిమగల రాజు.
దేవుడు మమ్మల్ని దయ, మహిమతో దీవిస్తున్నాడు.
యెహోవాను వెంబడించి ఆయనకు విధేయులయ్యే ప్రజలకు
ఆయన ఆన్ని మేళ్లూ అనుగ్రహిస్తాడు.
12 సర్వశక్తిమంతుడవైన యెహోవా, నిన్ను నమ్ముకొనే ప్రజలు నిజంగా సంతోషిస్తారు.
గోడమీది వ్రాత
5 రాజైన బెల్షస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు. 2 బెల్షస్సరు ద్రాక్షామద్యం త్రాగుతుండగా తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంనుంచి తీసుకువచ్చిన బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకులకు ఆజ్ఞాపించాడు. బెల్షస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు. 3 కనుక యెరూషలేము ఆలయంనుంచి తెచ్చిన ఆ ప్రాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు. 4 త్రాగుచూ వారు బంగారం, వెండి, కంచు, ఇనుము, కర్ర, రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు.
5 అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడి, గోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి వ్రాస్తుండగా, రాజు చూశాడు.
6 రాజైన బెల్షస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం పాలిపోయింది. మోకాళ్ళు వణకుతు ఒకదానితో ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంకాగా, అతడు నిలబడలేక పోయాడు. 7 అప్పుడు ఇంద్రజాలికుల్ని, కల్దీయుల్ని, తన సమక్షానికి తీసుకురావలసిందిగా కోరాడు. ఆ వివేకవంతులతో, “గోడమీది ఈ వ్రాతను చదివే ఏ వ్యక్తికైనా నేను బహుమతి ఇస్తాను, అతను దాని అర్థం కూడా తెలపాలి. ఊదారంగు వస్త్రాలు అతనికి బహూకరిస్తాను. అతని మెడలో ఒక బంగారు గొలుసు వేస్తాను. అతనిని రాజ్యంలో మూడవ ఉన్నత పరిపాలకునిగా చేస్తాను” అని చెప్పాడు.
8 అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. కాని వారు ఆ వ్రాతను చదవలేకపోయారు. దాని అర్థాన్నికూడా చెప్పలేకపోయారు. 9 బెల్షస్సరు, అతని అధికారులు కలవరపడ్డారు. అతనికి చింత, భయం కూడా ఎక్కువయ్యాయి. ఆ భయంతో అతని ముఖం తెల్లబోయింది.
10 విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజుయొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్థిల్లాలి. ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద నివ్వకు. 11 నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. పవిత్ర దేవుళ్ల[a] ఆత్మ అతనిలో ఉంది. నీ తండ్రి పరిపాలించే రోజుల్లో అతను రహస్య విషయాలు తెలుసుకోగలనని నిరూపించాడు. చాలా చురుగ్గా, వివేకవంతంగా ఉన్నట్లుగా కూడా అతను కనిపించాడు. ఇటువంటి విషయాల్లో అతను దేవతలవంటివాడు. నీ తండ్రి నెబుకద్నెజరు ఈ వ్యక్తిని వివేకవంతులందరికీ అధికారిగా నియమించాడు. అతను ఇంద్రజాలికులందరికి, కల్దీయులందరికి ఆధిపత్యం వహించాడు. 12 నేను మాటలాడుతున్న వ్యక్తి పేరు దానియేలు. రాజు అతనికి బెల్తెషాజరు అని నామకరణం చేశాడు. బెల్తెషాజరు చాలా బుద్ధిమంతుడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అతను కలయొక్క అర్థాలు చెప్పగలడు. రహస్య విషయాలు వివరించగలడు. కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పగలడు. దానియేలును పిలిపించు. గోడమీది వ్రాతకుగల అర్థమేమిటో అతను చెప్పగలడు” అని ఆమె చెప్పింది.
దేవుని మంద
5 మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయట మేమనగా, మీలాగే నేను కూడ ఒక పెద్దను. క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసినవాణ్ణి. దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్థుణ్ణి. 2 సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే! డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభీష్టంతో ఆ కార్యాన్ని చేయండి. 3 దేవుడు మీకప్పగించిన వాళ్ళపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి. 4 ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నిటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది.
5 అదే విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి యితర్ల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో:
“దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు,
కాని, వినయంతో ఉన్నవాళ్ళకు కృపననుగ్రహిస్తాడు.”(A)
అని వ్రాయబడి ఉంది. 6 అందువల్ల దేవుని బలమైన చేతి క్రింద వినయంతో ఉండండి. సరియైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. 7 ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదలివేయండి.
8 మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సాతాను సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని మ్రింగివేయాలని మీ చుట్టు తిరుగుతూ ఉన్నాడు. 9 ఈ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు యిలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు. గనుక దృఢవిశ్వాసంతో ఉండి సాతానుకి ఎదురు తిరగండి.
10 దయామయుడైన దేవుడు, మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలనుభవించాక, ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని యిచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. 11 ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండుగాక! ఆమేన్.
© 1997 Bible League International