Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 84:1-7

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన

84 సర్వశక్తిమంతుడువైన యెహోవా, నీ ఆలయం నిజంగా రమ్యమైనది.
యెహోవా, నేను వేచియుండి అలసిపోయాను.
    నేను నీ ఆలయంలో ఉండాలని ఆశిస్తున్నాను.
నాలోని ప్రతి అవయవం జీవంగల దేవునికి ఆనంద గానం చేస్తుంది.
సర్వ శక్తిమంతుడువైన యెహోవా, నా రాజా, నా దేవా,
    పిచ్చుకలకు, వానకోవెలలకు సహితం నివాసాలు ఉన్నాయి.
ఆ పక్షులు నీ బలిపీఠం దగ్గర గూళ్లు పెట్టుకొంటాయి.
    అక్కడే వాటి పిల్లలు ఉంటాయి.
నీ ఆలయం వద్ద నివసించే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.
    వారు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తారు.

ఎవరైతే వారి బలానికి నిన్ను ఆధారంగా ఉండనిస్తారో వారు సంతోషిస్తారు.
    వారు నిన్నే నడిపించ నిస్తారు.
దేవుడు నీటి ఊటగా చేసిన తొలకరి వాన నిలిచే
    నీటి మడుగుల బాకా లోయగుండా వారు పయనిస్తారు.
వారు దేవుని కలుసుకొనే సీయోనుకు పోయే మార్గంలో
    ఆ ప్రజలు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తారు.

యిర్మీయా 9:1-16

నా తల నీటితో నిండియున్నట్లయితే,
    నా నేత్రాలు కన్నీటి ఊటలైతే హతులైన
    నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్లు దుఃఖిస్తాను!

ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం
    ఎడారిలో నాకొకటి ఉంటే
అక్కడ నా ప్రజలను వదిలి వేయగలను.
    వారినుండి నేను దూరంగా పోగలను!
ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు.
    వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు.

“వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు.
    వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి.
సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది.
వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు.
    వారు నన్నెరుగకున్నారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.

“మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి!
    మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు!
ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే.
    ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే.
ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును.
    ఎవ్వడూ సత్యం పలుకడు.
యూదా ప్రజలు అబద్ధమాడుటలో
    తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు.
వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది!
ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది.
    అబద్ధాలను అబద్ధాలు అనుసరించాయి!
    ప్రజలు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.” ఈ
విషయాలను యెహోవా చెప్పినాడు!

కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెబుతున్నాడు,
“లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను!
    నాకు వేరే మార్గం లేదు.
    నా ప్రజలు పాపం చేశారు.
యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు.
    వారి నాలుకలు అబద్ధాలనే మాట్లాడతాయి.
ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు.
    కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు.
మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేను వారిని శిక్షించవద్దా?”
“ఆ రకమైన ప్రజలను నేను శిక్షించాలని నీకు తెలుసు.
    నేను వారికి తగిన శిక్ష విధించాలి.”
ఇది యెహోవా వాక్కు.

10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను.
    వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను.
    ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి.
ఎవ్వడూ అక్కడ పయనించడు.
    ఆ ప్రదేశాలలో పశువుల అరుపులు వినరావు.
పక్షులు ఎగిరి పోయాయి:
    పశువులు పారిపోయాయి.

11 “నేను (యెహోవా) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను.
    అది గుంట నక్కలకు[a] స్థావరమవుతుంది.
నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను.
    అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”

12 ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా?
    యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా?
యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా?
    రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది?
    జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.

13 యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు.
వారికి నా ఉపదేశములు ఇచ్చాను.
    కాని వారు వినటానికి నిరాకరించారు.
    వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు.
14 యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు.
    వారు మొండివారు.
వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు.
    బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”

15 సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు,
“యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను.
    విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను.
16 యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను.
వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది.
    వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు.
కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను.
    యూదా ప్రజలను వారు చంపివేస్తారు.
    ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”

2 తిమోతికి 3:1-9

చివరి కాలపు సంగతులు

ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి. మనుష్యుల్లో స్వార్థం, ధనంపై ఆశ, గొప్పలు చెప్పుకోవటం, గర్వం, దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, అపవిత్రత, ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని ప్రేమించకుండటం, ద్రోహబుద్ధి, దురుసుతనం, అహంభావం, దేవునికంటె సుఖాన్ని ప్రేమించటం. పైకి భక్తిపరుల్లా ఉండి దాని శక్తిని అంగీకరించకుండటం ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండు.

వాళ్ళు ఇళ్ళల్లోకి చొరబడి, దురాశల్లో చిక్కుకు పోయి, పాపాలతో జీవిస్తున్న బలహీనమైన మనస్సుగల స్త్రీలను లోబరచుకొంటారు. ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చుకొంటారు. కాని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. యన్నే మరియు యంబ్రే అనువారు మోషేను ఎదిరించిన విధంగా వీళ్ళ బుద్ధులు పాడై సత్యాన్ని ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. వీళ్ళు ముందుకు పోలేరు. మోషేను ఎదిరించినవాళ్ళలాగే వీళ్ళ అవివేకం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International