Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.
57 దేవా, నన్ను కరుణించు
నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
నేను నీ శరణు జొచ్చియున్నాను.
2 మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
3 పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
నాకు చూపిస్తాడు.
4 నా జీవితం ప్రమాదంలో ఉంది.
నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.
5 దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
6 నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
కాని వారే దానిలో పడ్డారు.
7 దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
నేను నీకు స్తుతులు పాడుతాను.
8 నా ఆత్మా, మేలుకొనుము!
స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
9 నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.
నాబాలు మరణము
36 అబీగయీలు తిరిగి వచ్చేసరికి నాబాలు ఇంటి వద్దనే ఉన్నాడు. నాబాలు ఒక రాజులా తింటూ ఉన్నాడు. బాగా తాగి, ఉల్లాసంగా ఉన్నాడు. అందుచేత అబీగయీలు మరుసటి రోజు ఉదయం వరకు నాబాలుతో ఏమీ చెప్పలేదు. 37 మరుసటి ఉదయం నాబాలు మామూలుగా ఉన్నాడు. కనుక అతని భార్య జరిగినదంతా అతనితో చెప్పింది. అది వినగానే అతనికి గుండెపోటు వచ్చి, రాయిలా బిగుసుకుపోయాడు. 38 ఆ తరువాత పదిరోజులకు నాబాలు చచ్చేటట్టుగా చేసాడు యెహోవా.
39 నాబాలు మరణ వార్త విన్న దావీదు, “యెహోవాకు స్తోత్రం! నాబాలు నన్ను గూర్చి చెడుగా మాట్లాడాడు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు. నాబాలు తప్పు చేసాడు గనుక యెహోవా వానిని చచ్చేటట్టు చేసాడు” అని చెప్పాడు.
అప్పుడు దావీదు అబీగయీలుకు ఒక వర్తమానం పంపాడు. ఆమె తనకు భార్య కావాలని దావీదు అడిగాడు. 40 దావీదు సేవకులు కర్మెలుకు వెళ్లి అబీగయీలును కలిసి, “దావీదు నిన్ను తీసుకుని రమ్మని మమ్ములను పంపించాడు. నీవు అతని భార్యవు కావాలని దావీదు కోరిక” అని చెప్పారు. 41 అబీగయీలు సాగిలపడి సమస్కరించి, “నేను మీ దాసిని. మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. నేను నా యజమానియైన దావీదు సేవకుల పాదప్రక్షాళనం[a] చేయటానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.
42 అబీగయీలు వెంటనే ఒక గాడిద మీద ఎక్కి, దావీదు పంపిన సేవకులతో కలిసి వెళ్లింది. ఆమెతో అయిదుగురు పనిగత్తెలను కూడ తీసుకుని వెళ్లింది. అబీగయీలు దావీదు భార్య అయింది.
యేసు ఏకాంతంగా ప్రార్థించటం
(మత్తయి 26:36-46; మార్కు 14:32-42)
39 “అలవాటు ప్రకారం యేసు ఒలీవల కొండ మీదికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. 40 అక్కడికి చేరుకొన్నాక వాళ్ళతో, మీరు శోధనలో పడకుండ ఉండటానికి ప్రార్థించాలి” అని అన్నాడు.
41 ఆయన వాళ్ళనుండి రాయి విసిరినంత దూరం వెళ్ళి, మోకరిల్లి ఈ విధంగా ప్రార్థించాడు: 42 “తండ్రీ! నీకిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివెయ్యి. కాని నెరవేరవలసింది నా యిచ్ఛ కాదు: నీది.” 43 అప్పుడు ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చి ఆయనకు శక్తినివ్వటానికి ప్రత్యక్షమైనాడు. 44 ఆయన ఆవేదనతో యింకా తీవ్రంగా దేవుణ్ణి ప్రార్థించాడు. నేలమీద పడ్తున్న ఆయన చెమట చుక్కలు రక్తపు చుక్కల్లా ఉన్నాయి. 45 ప్రార్థించటం ముగించాక ఆయన తన శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. దుఃఖంవల్ల అలసిపోయి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. 46 వాళ్ళతో, “ఎందుకు పడుకున్నారు? లేచి మీరు శోధింపబడకూడదని ప్రార్థించండి” అని అన్నాడు.
© 1997 Bible League International