Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
121 కొండల తట్టు నేను చూసాను.
కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
నాకు సహాయం వస్తుంది.
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
8 నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
11 “అయ్యో, దీన పట్టణమా!
తుఫానులు నిన్ను బాధించాయి,
మరియు నీవు ఓదార్చబడలేదు.
నేను నిన్ను మరల నిర్మిస్తాను.
ప్రశస్తమైన రాళ్లను ఉపయోగించి నేను నీ పునాదులు వేస్తాను.
నీలాంజనాలు, నీలాలు నేను ఉపయోగిస్తాను.
12 మాణిక్య మణులతో నేను నీ గోడలు కడతాను.
సూర్యకాంతాలతో నేను నీ ద్వారాలు కడతాను.
ప్రశస్త రత్నాలతో నేను నీ గోడలన్నింటినీ కడతాను.
13 నీ పిల్లలు దేవుని వెంబడిస్తారు, ఆయన వారికి ఉపదేశం చేస్తాడు.
నీ పిల్లలకు ఎంతో శాంతి ఉంటుంది.
14 న్యాయం ప్రయోగించి నేను నిర్మిస్తాను.
కనుక నీవు అన్యాయానికి, కృ-రత్వానికి దూరంగా ఉండాలి.
అప్పుడు నీవు భయపడాల్సింది.
ఏమీ ఉండదు. ఏదీ నిన్ను బాధించుటకు రాదు.
15 నా సైన్యాలు ఏవీ నీకు వ్యతిరేకంగా పోరాడవు.
మరియు ఏ సైన్యమైనా నీ మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తే నీవు ఆ సైన్యాన్ని ఓడిస్తావు.
16 “చూడు, కమ్మరిని నేను చేశాను. అగ్నిని రాజ బెట్టేందుకు అతడు నిప్పుమీద విసరుతాడు. అప్పుడు అతడు వేడి ఇనుమును తీసుకొని, తాను చేయదలచుకొన్న పనిముట్టును చేస్తాడు. అదేవిధంగా నాశనం చేసే ‘నాశన కర్తను’ నేను సృజించాను.
17 “నీ మీద పోరాడుటకు మనుష్యులు ఆయుధాలు చేస్తారు. కానీ ఆ ఆయుధాలు నిన్ను ఓడించవు. కొంత మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. కానీ నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వ్యక్తిది తప్పు అని చూపించబడుతుంది.”
“యెహోవా సేవకులకు ఏమి లభిస్తుంది? నా దగ్గర లభించే మంచి వాటన్నింటినీ వారు పొందుతారు” అని యెహోవా చెబుతున్నాడు.
22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. 23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.
24 “ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. 25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతి వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.
27 “మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. 28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’
29 “మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు. 30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”
32 చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు. 33 పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు. 34 కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసి అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగువాళ్ళున్నారు.
© 1997 Bible League International