Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 61

సంగీత నాయకునికి: తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.

61 దేవా, నా ప్రార్థనా గీతం వినుము.
    నా ప్రార్థన ఆలకించుము.
నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా,
    సహాయం కోసం నీకు మొరపెడతాను.
ఎత్తయిన క్షేమస్థలానికి
    నన్ను మోసికొనిపొమ్ము.
నీవే నా క్షేమ స్థానం.
    నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే.
నీ గుడారంలో[a] నేను శాశ్వతంగా నివసిస్తాను.
    నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.

దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు.
    కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది.
రాజుకు దీర్ఘాయుష్షు దయచేయుము.
    అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము.
అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము.
    నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము.
నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను.
    నేను ప్రమాణం చేసినవాటిని ప్రతి రోజూ చేస్తాను.

2 రాజులు 5:15-19

15 నయమాను మరియు అతని బృందంవారు దైవజనుడు (ఎలీషా) వద్దకు వచ్చారు. ఎలీషా ఎదుట అతను నిలబడి, “ఇదుగో, ఇశ్రాయేలులో తప్ప యీ ప్రపంచంలో మరెచ్చట కూడా దేవుడు లేడని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కానుకను స్వికరింపుము” అని పలికాడు.

16 కాని ఎలీషా, “నేను యెహోవాను సేవిస్తున్నాను. యెహోవా జీవముతోడు, నేను ఎట్టి కానుకను స్వీకరింపనని వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు.

నయమాను కష్టతరంగా అతనిని సముదాయించుటకు ప్రయత్నించాడు. కాని ఎలీషా తిరస్కరించాడు. 17 అప్పుడు నయమాను, “ఈ కానుకను కనుక నీవు స్వీకరించపోతే, కనీసం ఇదైనా నా కోసం చేయుము. నారెండు కంచర గాడిదలు మీది గంపలను ఇశ్రాయేలు దేశపు మన్నులో నింపుటకు అనుమతింపుము. ఎందుకనగా, ఇతర దేవతలకు నేను ఎన్నటికీ ఎటువంటి బలులు సమర్పించను, యెహోవాకి మాత్రమే సమర్పిస్తాను. 18 ఇది చేయడం వల్ల నన్ను యెహోవా క్షమించునట్లు యెహోవాని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో, నా యజమాని (సిరియా రాజు) రిమ్మోను ఆలయంలోకి వెళ్లి అసత్య దేవతలను పూజిస్తాడు. రిమ్మోను ఆరాధన జరుగునప్పుడు నా సహాయము కొరకు రాజు నా మీద ఆధారపడి వుంటాడు. అందువల్ల నేను రిమ్మోను ఆలయంలో మోకరిల్లుతాను. అలా జరిగినప్పుడు నన్ను క్షమింపుమని యెహోవాని వేడుకొనుచున్నాను” అని పలికాడు.

19 “నెమ్మదికలిగి వెళ్లుము” అని ఎలీషా నయమానుకు చెప్పాడు.

అందువల్ల నయమాను ఎలీషాని విడిచి కొంతదూరం వెళ్లాడు.

అపొస్తలుల కార్యములు 26:24-29

పౌలు అగ్రిప్పను ఒప్పించుటకు ప్రయత్నించటం

24 పౌలు తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు.

25 పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను. 26 రాజుకు యివన్నీ తెలుసు. నేను రాజుతో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టినుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి రహస్యంగా సంభవించలేదు. 27 అగ్రిప్ప రాజా! నీవు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నావని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు.

28 అగ్రిప్ప, “అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు.

29 పౌలు, “సులభమో, కష్టమో! నీవే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International