Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 111

111 యెహోవాను స్తుతించండి!
మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో
    నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.
యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.
దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.
దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
    కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.
దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.
    దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు
    వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.
దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.
    ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.
దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.
    ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.
దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.
    దేవుని నామం అద్భుతం, పవిత్రం!
10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.
    దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు.
శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.

లేవీయకాండము 14:33-53

ఇంటికి కుష్ఠుపొడను గూర్చిన నియమాలు

33 మోషే, అహరోనులతో యెహోవా ఇంకా ఇలా అన్నాడు: 34 “కనాను దేశాన్ని నేను మీ ప్రజలకు ఇస్తున్నాను. మీ ప్రజలు ఆ దేశం చేరుతారు. ఆ సమయంలో ఎవరి యింట్లోనైనా (ఇంటి గోడకు) నేను కుష్ఠుపొడను పెరగనీయవచ్చు. 35 ఆ యింటి స్వంతదారుడు యాజకుని దగ్గరకు వచ్చి, ‘కుష్ఠుపొడలాంటిది ఏదో నాయింట్లో కనిపిస్తుంది’, అనిచెప్పాలి.

36 “అప్పుడు యాజకుడు ఆ ఇంటి వారిని ఇల్లు ఖాళీచేయమని ఆజ్ఞాపించాలి.” యాజకుడు కుష్ఠుపొడను చూడటానికి వెళ్లక ముందే వారు ఇల్లు ఖాళీచేయాలి. ఈ విధంగా ఆ ఇంట్లోని అపవిత్రమైన వాటన్నింటినీ యాజకుడు కాపాడవలసిన పనిలేదు. ఆ మనుష్యులు ఇల్లు ఖాళీచేసిన తర్వాత, ఆ ఇంటిని చూడటానికి యాజకుడు లోనికి వెళ్లాలి. 37 యాజకుడు కుష్ఠుపొడను పరిశీలించాలి. ఆ ఇంటి గోడలమీద పొడకు పచ్చటి లేక ఎర్రటి రంధ్రాలు ఉండి, ఆ పొడ గోడల ఉపరితలంలో చొచ్చుకు పోతున్నట్లు కనబడితే, 38 యాజకుడు ఆ ఇంటినుండి బయటకు వెళ్లిపోయి ఏడు రోజులవరకు ఆ ఇంటికి తాళంవేయాలి.

39 “ఏడో రోజున యాజకుడు తిరిగి వచ్చి ఆ ఇంటిని పరిశీలించాలి.” ఆ పొడ ఇంటి గోడలమీద వ్యాపించి ఉంటే, 40 పొడ ఉన్న రాళ్లను లాగి పారవేయమని యాజకుడు ఆ ప్రజలకు ఆజ్ఞాపించాలి. పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థలంలో వారు ఆ రాళ్లను వేయాలి. 41 అప్పుడు యాజకుడు ఆ ఇంటిలోపల అంతా గీకించాలి. అలా గీకిన పెచ్చులను వారు పారవేయాలి. పట్టణం బయట ప్రత్యేకమైన ఒక అపవిత్ర స్థలంలో ఆ పెచ్చులను వారు వేయాలి. 42 అప్పుడు ఆ వ్యక్తి ఆ ఇంటికి కొత్త రాళ్లు పెట్టాలి. అతడు ఆ రాళ్లకు కొత్త అడుసు పూయించాలి.

43 “ఒకవేళ ఒకడు పాతరాళ్లను, పాత పెచ్చులను తీసివేసి, కొత్తరాళ్లు, కొత్త అడుసు పెట్టి ఉండొచ్చు. ఒకవేళ ఆ ఇంటిలో మరల పొడ కనబడవచ్చును. 44 అప్పుడు యాజకుడు లోనికి వచ్చి ఇంటిని పరిశీలించాలి. ఆ పొడ ఇంటిలో వ్యాపించి ఉంటే, అది త్వరగా యితర స్థలాలకు గూడా వ్యాపించే వ్యాధి. అందుచేత ఆ యిల్లు అపవిత్రము. 45 ఆ వ్యక్తి ఆ ఇంటిని కూలగొట్టాలి. ఆ రాళ్లను, పెచ్చులను, చెక్కముక్కలను పట్టణం వెలుపల అపవిత్రమైన ప్రత్యేక స్థలానికి తీసుకొని పోవాలి. 46 ఆ ఇంట్లోకి వెళ్లే ఏ వ్యక్తి అయినాసరే సాయంత్రం వరకు అపవిత్రమవుతాడు. 47 ఎవరైనా ఆ ఇంటిలో భోజనంచేసినా, పండుకొన్నా ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి.

48 “ఆ ఇంట్లో కొత్త అడుసుతో కొత్త రాళ్లు వేసిన తర్వాత యాజకుడు ఆ ఇంటిని పరిశీలించాలి. ఒకవేళ ఆ పొడ ఇంటిలో వ్యాపించకపోతే ఆ ఇల్లు పవిత్రం అని యాజకుడు ప్రకటించాలి. ఎందుచేతనంటే ఆ పొడ పోయింది గనుక!

49 “అప్పుడు ఆ ఇంటిని పవిత్రం చేయటానికి యాజకుడు రెండు పక్షులను, దేవదారు చెక్క ముక్కను, ఒక ఎర్ర గుడ్డ ముక్కను, ఒక హిస్సోపు రెమ్మను తీసుకోవాలి. 50 పారుతున్న నీళ్లలో ఒక మట్టి పాత్రలో యాజకుడు ఒక పక్షిని వధించాలి. 51 తరువాత యాజకుడు దేవదారు చెక్క ముక్కను, హిస్సోపును, ఎర్రగుడ్డ ముక్కను, ప్రాణంతో ఉన్న పక్షిని తీసుకోవాలి. పారుతున్న నీళ్లలో వధించబడిన పక్షి రక్తంలో యాజకుడు వీటన్నింటినీ ముంచాలి. అప్పుడు యాజకుడు ఆ రక్తాన్ని ఇంటిమీద ఏడు సార్లు చిలకరించాలి. 52 ఈ విధంగా యాజకుడు ఆ యింటిని పవిత్రం చేయటానికి వీటిని ఉపయోగించాలి. 53 యాజకుడు పట్టణం వెలుపలి బయలు ప్రదేశానికి వెళ్లి, బ్రతికి ఉన్న పక్షిని అక్కడ స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. ఈ విధంగా యాజకుడు ఆ యింటిని పవిత్రం చేయాలి. ఆ ఇల్లు పవిత్రం అవుతుంది.”

2 తిమోతికి 1:13-18

13 నేను నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. యేసు క్రీస్తులో విశ్వాసంతో, ప్రేమతో వాటిని మార్గదర్శంగా ఉంచుకో. 14 దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సహాయముతో కాపాడు.

15 ఆసియ ప్రాంతములో ఉన్నవాళ్ళంతా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపొయ్యారని నీకు తెలుసు. “పుగెల్లు” “హెర్మొగెనే” కూడా నన్ను వదిలి వెళ్ళిపొయ్యారు. 16 నా చేతికి సంకెళ్ళు ఉన్నాయని సంకోచించక “ఒనేసిఫోరు” ఎన్నోసార్లు వచ్చాడు. అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక! 17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు. 18 ఆ “రానున్న రోజున” కనికరము పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక! నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్ని విధాల సహాయం చేసాడో నీకు బాగా తెలుసు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International