Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 3

దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన

యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు
    అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.

అయితే, యెహోవా, నీవు నాకు కేడెము.
    నీవే నా అతిశయం.
    యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా[a] చేస్తావు.
యెహోవాకు నేను ప్రార్థిస్తాను.
    ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!

నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును.
    ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును.
    కాని ఆ శత్రువులకు నేను భయపడను.

యెహోవా, లెమ్ము[b]
    నా దేవా, వచ్చి నన్ను రక్షించుము!
నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి,
    వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.

యెహోవా తన ప్రజలను రక్షించగలడు.
    యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.

హబక్కూకు 2:5-11

దేవుడు చెప్పాడు: “ద్రాక్షమద్యం మనిషిని మోసం చేయగలదు. అదే మాదిరి ఒక బలవంతుని గర్వం అతనిని అవివేకునిగా చేస్తుంది. అతనికి శాంతి ఉండదు. అతడు మృత్యువువలె ఉంటాడు. అతడు ఇంకా, ఇంకా కోరుతూనే ఉంటాడు. మృత్యువువలె అతనికి తృప్తి అంటూ ఉండదు. అతడు ఇతర దేశాలను ఓడించటం కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ ప్రజలను చెరపట్టటం కొనసాగిస్తూ ఉంటాడు. కాని అతి త్వరలోనే ఆ ప్రజలంతా అతనిని చూచి నవ్వుతారు. తన ఓటమిని గురించి వారు కథలు చెపుతారు. వారు నవ్వి, ‘అది మిక్కిలి హేయమైనది! ఆ వ్యక్తి అనేక వస్తువులు దొంగిలించాడు. తనవి కానివాటిని తన వశం చేసుకున్నాడు. అతడు ధనాన్ని విస్తారంగా తీసుకున్నాడు. ఆ వ్యక్తికి అది అతి శ్రమకారకమైన పని’ అని అంటారు.

“నీవు (బలవంతుడు) ప్రజలవద్ద డబ్బు తీసుకున్నావు. ఒక రోజు ఆ ప్రజలు మేల్కొని, జరుగుతున్నదానిని గుర్తిస్తారు. వారు నీకు ఎదురు తిరుగుతారు. అప్పుడు వారే నీనుండి వస్తువులు తీసుకొంటారు. నీవు చాలా భయపడతావు. నీవు అనేక దేశాలనుండి వస్తువులు దొంగిలించావు. కావున ఆ ప్రజలు నీ నుండి చాలా తీసుకుంటారు. నీవు అనేకమందిని చంపివేశావు. నీవు దేశాలను, నగరాలను నాశనం చేశావు. నీవక్కడ ప్రజలందరినీ చంపివేశావు.

“అవును, అన్యాయం చేసి ధనవంతుడైన వానికి మిక్కిలి శ్రమ. సురక్షిత ప్రదేశంలో నివసించటానికి అతడు ఆ పనులు చేశాడు. ఇతరులు తనను దోచుకోవటాన్ని తను ఆపగలనని అతడు అనుకొంటున్నాడు. కాని అతనికి కీడు వాటిల్లుతుంది. 10 నీవు (బలవంతుడు) అనేక మందిని నాశనం చేయటానికి వ్యూహాలు పన్నావు. ఇది నీ స్వంత ప్రజలనే అవమానానికి గురిచేసింది. నీవు ప్రాణాన్ని కోల్పోతావు. 11 గోడరాళ్ళు నీకు వ్యతిరేకంగా అరుస్తాయి. నీ స్వంత ఇంటి వాసాలు సహితం నీవు తప్పు చేశావని ఒప్పుకుంటాయి.

1 యోహాను 5:1-5

దేవుని కుమారునిలో విశ్వాసము

యేసే క్రీస్తు అని నమ్మినవాణ్ణి దేవుడు తన సంతానంగా పరిగణిస్తాడు. తండ్రిని ప్రేమించిన ప్రతీ ఒక్కడు కుమారుణ్ణి ప్రేమించినట్లుగా పరిగణింపబడతాడు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించటం వల్ల ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనము తెలుసుకోగలము. ఆయన ఆజ్ఞల్ని పాటించి మనము మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు. దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము. యేసు దేవుని కుమారుడని విశ్వసించే వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తారు.

1 యోహాను 5:13-21

చివరి మాట

13 దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను. 14 దేవుణ్ణి ఆయన యిష్టానుసారంగా మనము ఏది అడిగినా వింటాడు. దేవుణ్ణి సమీపించటానికి మనకు హామీ ఉంది. 15 మనమేది అడిగినా వింటాడని మనకు తెలిస్తే మన మడిగింది మనకు లభించినట్లే కదా!

16 మరణం కలిగించే పాపము తన సోదరుడు చెయ్యటం చూసినవాడు తన సోదరుని కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అతనికి క్రొత్త జీవితం యిస్తాడు. ఎవరి పాపం మరణానికి దారితీయదో వాళ్ళను గురించి నేను మాట్లాడుతున్నాను. మరణాన్ని కలిగించే పాపం విషయంలో ప్రార్థించమని నేను చెప్పటం లేదు. 17 ఏ తప్పు చేసినా పాపమే. కాని మరణానికి దారితీయని పాపాలు కూడా ఉన్నాయి.

18 దేవుని బిడ్డగా జన్మించినవాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించినవాణ్ణి దేవుడు కాపాడుతాడు. సాతాను అతణ్ణి తాకలేడు. 19 మనము దేవుని సంతానమని, ప్రపంచమంతా సాతాను ఆధీనంలో ఉందని మనకు తెలుసు. 20 దేవుని కుమారుడు వచ్చి నిజమైనవాడెవడో తెలుసుకొనే జ్ఞానాన్ని మనకు యిచ్చాడు. ఇది మనకు తెలుసు. మనము నిజమైనవానిలో ఐక్యమై ఉన్నాము. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో కూడా ఐక్యమై ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నిత్యజీవం. 21 బిడ్డలారా! విగ్రహాలకు దూరంగా ఉండండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International