Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: యెదూతూను రాగం. దావీదు కీర్తన.
62 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.
2 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు.
3 ఇంకెంత కాలం వారు నా మీద దాడి చేస్తూ ఉంటారు?
నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను.
పడిపోతున్న కంచెలా ఉన్నాను.
4 ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి
పథకాలు వేస్తున్నారు.
వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబుతారు,
కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు.
5 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను.
దేవుడు ఒక్కడే నా నిరీక్షణ.
6 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు.
పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే.
7 నా కీర్తి, విజయం దేవుని నుండి వస్తాయి.
ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం
8 ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి.
మీ సమస్యలు దేవునితో చెప్పండి.
దేవుడే మన క్షేమ స్థానం.
9 మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు.
నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు.
వారు గాలిబుడగల్లా వట్టి ఊపిరియైయున్నారు.
10 బలవంతంగా విషయాలను చేజిక్కించుకొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు.
దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలంచవద్దు.
నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం
ధనాన్ని నమ్ముకొనవద్దు.
11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబుతున్నాడు,
“బలము దేవుని నుండే వస్తుంది.”
12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది.
ఒకడు చేసినవాటినిబట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు.
8 ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన యెహోవా తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు:
“యాకోబుకు గర్వకారణమైన వస్తువులను నేను అసహ్యించుకుంటాను.
అతని బలమైన బురుజులను నేను అసహ్యించుకుంటాను.
అందుచేత ‘శత్రువు’ నగరాన్ని,
దానిలోని ప్రతి వస్తువును తీసుకునేలా చేస్తాను.”
ప్రాణంతో మిగిలే ఇశ్రాయేలీయులు తక్కువ
9 ఆ సమయంలో ఒకానొక ఇంట్లో పదిమంది జీవించియుండవచ్చు. ఆ ఇంటిలో మరి కొంతమంది మరణించవచ్చు. 10 ఒక బంధువు ఆ శవాన్ని బయటకు తీసికొనిపోయి దహనం చేయవచ్చు. ఆ బంధువు ఇంటినుంచి ఎముకలు తేవటానికి వెళ్తాడు. ఇంటిలో దాగిన ఏ వ్యక్తినైనా ప్రజలు పిలిచి, “నీ వద్ద ఇంకా ఏమైనా శవాలు మిగిలియా?” అని అడుగుతారు.
ఆ వ్యక్తి, “లేవు …” అని సమాధానమిస్తాడు.
అప్పుడా వ్యక్తియొక్క బంధువు ఇలా అంటాడు: “నిశ్శబ్దం! మనం యెహోవా మాట ఎత్తకూడదు.”
11 చూడు, దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇవ్వగా,
పెద్ద ఇండ్లు ముక్కలుగా పగిలిపోతాయి.
చిన్న ఇండ్లు చిన్న ముక్కలైపోతాయి.
12 గుర్రాలు బండలపై పరుగిడతాయా?
లేదు! ప్రజలు ఆవులను నేల దున్నటానికి వినియోగిస్తారా?
అవును! కాని మీరు అన్నిటినీ తారుమారు చేస్తారు.
మీరు మంచిని, న్యాయాన్ని విషంగా మార్చారు.
13 మీరు లో-దెబారులో సుఖంగా ఉన్నారు.
“మేము కర్నయీమును మా స్వశక్తిచే తెచ్చుకున్నాం” అని మీరంటారు.
14 “కాని ఇశ్రాయేలూ, నేను మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను. ఆ రాజ్యం మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. లేబో-హమాతు నుండి అరాబా వాగువరకూ మీ అందరికీ కష్టాలు వస్తాయి.” దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
లవొదికయలోని సంఘానికి
14 “లవొదికయలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఈ విషయాలకు ఆమేన్[a] అనువాడును, దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును, నిజమైన సాక్షి అయినవాడును చెప్పుచున్నాడు.
15 “నీవు చేసిన పనుల్ని గురించి నాకు తెలుసు. నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక. 16 నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మి వేయబోతున్నాను. 17 ‘నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యం ఉంది. నాకు ఏ కొరతా లేదు’ అని నీవంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు. దీనావస్థలో ఉన్నావు. నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. 18 నీవు ధనవంతుడవు కావాలనుకొంటే, నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే నీ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి నా నుండి తెల్లని దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్ళకు పెట్టుకో. అప్పుడు చూడగల్గుతావు.
19 “నేను ప్రేమించిన వాళ్ళను గద్దిస్తాను. వాళ్ళను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితితో ఉండి పశ్చాత్తాపం చెందు. 20 ఇదిగో! నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను. అతడు నాతో కలిసి తింటాడు.
21 “నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి ఆయన సింహాసనంపై కూర్చున్నాను. అదే విధంగా విజయం సాధించినవాడు నాతో సింహాసనంపై కూర్చుంటాడు. 22 సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.”
© 1997 Bible League International