Revised Common Lectionary (Complementary)
113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
యెహోవా నామాన్ని స్తుతించండి.
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
ఆయన తప్పక కిందికి చూడాలి.
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.
యెహోవాను స్తుతించండి!
8 మీరు చాలా కిక్కిరిసి నివసిస్తారు. ఇంక దేనికి స్థలంలేనంతగా మీరు ఇళ్లు నిర్మించేస్తారు. కానీ యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దేశం మొత్తంలో మీరు మాత్రమే ఉంటారు. 9 సర్వశక్తిమంతుడైన యెహోవా నాతో ఇలా చెప్పాడు, నేను అది విన్నాను, “ఇప్పుడు చాలా ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లన్నీ నాశనం చేయబడుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అందమైన పెద్ద భవనాలు ఉన్నాయి. కానీ ఆ ఇళ్లు ఖాళీ అయిపోతాయి. 10 ఆ సమయంలో ఒక పదెకరాల ద్రాక్షాతోట కొంచెం మాత్రమే ద్రాక్షారసం ఇస్తుంది. చాలా బస్తాల గింజలతో కొద్దిపాటి ధాన్యం మాత్రం దిగుబడి అవుతుంది.”
11 మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగాలని చూస్తుంటారు. ద్రాక్షామద్యంతో మత్తెక్కి రాత్రి చాలాసేపు మెళకువగా ఉంటారు. 12 మీరు ద్రాక్షామద్యంతో, సితారాలు, డప్పులు, పిల్లన గ్రోవులు, ఇతర సంగీత వాయిద్యాలతో మీరు విందులు చేసుకొంటారు. యెహోవా చేసిన కార్యాలు మీరు చూడరు. యెహోవా హస్తాలు ఎన్నెన్నో కార్యాలు చేశాయి. కాని మీరు వాటిని గమనించరు. అందుచేత అది మీకు చాలా కీడు.
13 యెహోవా చెబుతున్నాడు: “నా ప్రజలు బంధించబడి తీసుకొని పోబడతారు. ఎందుకంటే వారు నిజంగా నన్నెరుగరు. ఇశ్రాయేలులో నివసిస్తున్న మనుష్యులు ఇప్పుడు చాలా ప్రముఖలు. వారి సుఖ జీవనాలతో వారు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ గొప్ప వాళ్లంతా దప్పిగొంటారు, ఆకలితో ఉంటారు. 14 అప్పుడు వారు చనిపోతారు, పాతాళం మరింత మంది మనుష్యులతో నిండిపోతుంది. ఆ మరణ స్థానం అపరిమితంగా దాని నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ మనుష్యులంతా ఆ పాతాళంలోకి వెళ్లిపోతారు.”
15 ఆ మనుష్యులు తగ్గించబడతారు. ఆ గొప్పవాళ్లంతా తలలు వంచి నేలమీదికి చూస్తారు. 16 సర్వశక్తిమంతుడైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు, ఆయన గొప్పవాడని ప్రజలు తెలుసుకొంటారు. పవిత్ర దేవుడు సరైన వాటినే చేస్తాడు, ప్రజలు ఆయనను గౌరవిస్తారు. 17 ఇశ్రాయేలు ప్రజలు వారి దేశం విడిచి వెళ్లిపోయేట్టుగా దేవుడు చేస్తాడు, దేశం శూన్యం అవుతుంది. గొర్రెలు వాటికి ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాయి. ఒకప్పుడు ధనికులదైన భూమిమీద గొర్రె పిల్లలు నడుస్తాయి.
18 ఆ మనుష్యుల్ని చూడండి. మనుష్యులు తాళ్లతో బండ్లను లాగినట్టు, వాళ్లు తమ పాపాల్ని దోషాన్ని వారి వెనుక లాగుతున్నారు. 19 వాళ్లు అంటారు: “దేవుడు చేయాలనుకొనే పనులు ఆయన త్వరగా చేస్తే బాగుండును. అప్పుడు జరిగేది ఏమిటో మాకు తెలుస్తుంది. యెహోవా పథకం త్వరగా జరిగిపోతే బాగుండును. ఆయన పథకం ఏమిటో అప్పుడు మాకు తెలుస్తుంది.”
20 ఆ మనుష్యులు మంచివాటిని చెడ్డవి అంటారు, చెడ్డవాటిని మంచివి అంటారు. వెలుగును చీకటి అని, చీకటిని వెలుగు అని వాళ్లు అనుకొంటారు. వాళ్లు చేదును తీపి, తీపిని చేదు అనుకొంటారు. 21 వాళ్లు చాలా తెలివిగల వాళ్లు అని ఆ మనుష్యులు తలస్తారు. వాళ్లు చాలా జ్ఞానంగలవాళ్లు అని తలస్తారు. 22 ద్రాక్షామద్యం తాగటంలో ఆ మనుష్యులు చాలా ప్రసిద్ది. మద్యము కలపటంలో వారు ప్రముఖులు. 23 మీరు వారికి డబ్బు చెల్లిస్తే, వారు నేరస్థుల్ని క్షమించేస్తారు. కానీ వారు మంచి వాళ్లకు న్యాయం జరుగనివ్వరు.
నిజమైన కానుక
(లూకా 21:1-4)
41 ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేసారు. 42 కాని ఒక పేద వితంతువు వచ్చి రెండు రాగి నాణెములను ఆ పెట్టెలో వేసింది.
43 యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఇది నిజం. ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది. 44 మిగతా వాళ్ళు తాము దాచుకొన్న ధనంలో కొంత భాగం మాత్రమే వేసారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది” అని అన్నాడు.
© 1997 Bible League International