Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 101

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

2 రాజులు 18:19-25

19 ఒక సైన్యాధిపతి ఇలా చెప్పాడు, “అష్షూరు మహా రాజు చెప్పుచున్నది:

‘హిజ్కియాతో చెప్పు. నీవు దేనిని విశ్వసిస్తున్నావు? 20 నీ మాటలు విలువలేనివి. యుద్ధంలో “నాకు సహాయంగా వుండదగినంత. సలహా, శక్తివున్నాయి” అని నీవు చెప్పుచున్నావు. కాని నీవు నా పరిపాలన నుండి వేరుపడిన తర్వాత నీవెవరిని నమ్ముతున్నావు? 21 విరిగిపోయిన రెల్లుతో చేయబడిన చేతికర్రను ఊని ఉన్నావు! ఈ చేతికర్ర ఈజిప్టు. ఈ చేతికర్రను ఊని నడిస్తే అది విరిగిపోయి, చేతిలో గుచ్చుకొని గాయపరుస్తుంది. తనను విశ్వసించే వారికందరికీ ఈజిప్టు రాజు అటువంటివాడు. 22 “మీ దేవుడైన యెహోవాని నమ్ముతున్నట్లు” నీవు చెప్పవచ్చు. కాని ఉన్నత స్థలాలను బలిపీఠాలను హిజ్కియా తొలగించి యెరూషలేములోని బలిపీఠం ఎదురుగా మాత్రమే ఆరాధించాలని యూదా, యెరూషలేము ప్రజలకు చెప్పినట్లు నాకు తెలుసు.

23 ‘నా యాజమాని అయిన అష్షూరు రాజుతో ఇప్పుడు నీవు ఈ ఒడంబడిక చేసుకో. స్వారీ చేయగల మనుష్యులుంటే, నీకు రెండు వేల గుర్రాలు ఇస్తానని నేను వాగ్దానం చేస్తాను. 24 నా యజమానికి గల చాలా తక్కువ అధిపతిని కూడా నీవు ఓడించలేవు. రథాలకు, అశ్విక వీరులకు నీవు ఈజిప్టు మీద ఆధారపడి వున్నావు.

25 ‘యెహోవా ఆజ్ఞ లేకుండ యెరూషలేమును నాశనం చేయుటకు నేను రాలేదు. “ఈ దేశానికి విరుద్ధంగా వెళ్లి దానిని నాశనము చేయుము” అని యెహోవా నాకు చెప్పాడు.’

2 రాజులు 19:1-7

హిజ్కియా యెషయా ప్రవక్తతో మాటలాడుట

19 ేహిజ్కియా రాజు ఆ విషయములు అన్నియు విన్నాడు. అతను తన వస్త్రాలు చింపుకుని గోనెపట్ట ధరించాడు. (అతను విచారంగాను తలక్రిందులైనట్లుగాను అది తెలుపుతుంది.) తర్వాత అతను యెహోవా ఆలయానికి వెళ్లెను.

హిజ్కియా, ఎల్యాకీము (రాజభవన అధికారి) షెబ్నా (కార్యదర్శి) మరియు యాజకులలో పెద్ద వారిని అమోజు కుమారుడైన యెషయాప్రవక్త వద్దకు పంపాడు. తాము విచారంగాను తలక్రిందులైనట్లుగాను తెలుపడానికి గోనెపట్ట ధరించారు. వారు యెషయాతో ఇలా అన్నారు: “ఇది యిబ్బంది రోజనీ, మేము తప్పు చేసినట్లుగా తెలిపే రోజనీ హిజ్కియా చెప్పుచున్నాడు. పిల్లలు పుట్టుటకు ఇది సమయము, అయితే వారికి పుట్టుక ఇచ్చేందుకు తగిన బలము లేదు. అష్షూరు రాజుయొక్క సైన్యాధిపతి సజీవుడైన దేవుని గురించి చెడు విషయాలు చెప్పాడానికి ఇక్కడికి పంపబడియున్నాడు. మీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆ విషయములు వినవచ్చు. యెహోవా ఆ విరోధిని శిక్షించవచ్చు. కనుక ఇంకా మిగిలివున్న వారికోసము ప్రార్థన చేయండి.”

హిజ్కియా రాజుయొక్క అధికారులు యెషయా వద్దకు వెళ్లారు. “మీ యాజమాని అయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. యెహోవా ఇలా చెప్పుచున్నాడు అష్షూరు రాజు, అధికారులు నన్ను ఎగతాళి చేయడానికి మీకు చెప్పిన విషయాలు విని మీరు భయపడవద్దు. నేనతనిలో ఒక ఆత్మను ప్రవేశపెడుతున్నాను. అతను ఒక వందతి వింటాడు. అప్పుడతను తన దేశానికి తిరిగి పారిపోతాడు. అతని దేశంలోనే ఒక ఖడ్గంతో అతను చంపబడేలా నేను చేస్తాను” అని యెషయా వారితో చెప్పాడు.

లూకా 18:18-30

ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం

(మత్తయి 19:16-30; మార్కు 10:17-31)

18 ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.

19 “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు. 20 నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు.

21 “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.

22 ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. 23 ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.

24 యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.

ఎవరు రక్షింపబడగలరు

26 ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.

27 “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.

28 పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.

29 యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు. 30 ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International