Revised Common Lectionary (Complementary)
మొదటి భాగం
(కీర్తనలు 1–41)
1 ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
అతడు పాపులవలె జీవించనప్పుడు,
దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
2 ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
3 కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
4 అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
5 ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
2 మోషే ఇశ్రాయేలు ప్రజలందిర్నీ సమావేశపర్చాడు. అతను వాళ్లతో ఇలా చేప్పాడు: “ఈజిప్టు దేశంలో యెహోవా చేసిన వాటన్నింటినీ మీరు చూసారు. ఫరోకు, ఫరో నాయకులకు, అతని దేశం అంతటికీ యెహోవా చేసిన వాటిని మీరు చూసారు. 3 ఆయన వాళ్లకు కలిగించన గొప్ప కష్టాలు అన్నీ మీరు చూసారు. ఆయన చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు మీరు చూసారు. 4 కానీ జరిగిందేమిటో ఈ రోజూకూ మీకు అర్థంకాలేదు. మీరు చూసిన దానిని, విన్నదానిని యెహోవా మీకు అర్థం కానివ్వలేదు. 5 40 సంవత్సరాలు యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించాడు. ఆ కాలం అంతటిలో మీ బట్టలు పాతబడలేదు, మీ చెప్పులు అరిగిపోలేదు. 6 మీ వద్ద భోజనం ఏమీలేదు. ద్రాక్షారసంగాని తాగేందుకు మరేదీగాని మీ దగ్గరలేదు. కానీ మీ విషయంలో యెహోవా శ్రద్ధతీసుకొన్నాడు. ఆయన మీ దేవుడైన యెహోవా అని మీరు అర్థం చేసుకోవాలని ఆయన ఇలా చేసాడు.
7 “మీరు ఈ స్థలానికి వచ్చినప్పుడు, హెష్భోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మన మీద యుద్ధానికి వచ్చారు. కానీ మనం వాళ్లను ఓడించాం. 8 అప్పుడు వారి దేశాన్ని మనం స్వాధీనం చేసుకొని, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారికి స్వంతంగా ఇచ్చాము. 9 కనుక ఈ ఒడంబడికలోని ఆదేశాలకు పూర్తిగా లోబడుతుంటే మీరు చేసే ప్రతి దానిలో మీరు విజయం పొందుతూ ఉంటారు.
10 “ఈ వేళ మీరంతా ఇక్కడ మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. మీ నాయకులు, మీ అధికారులు, మీ పెద్దలు, మిగిలిన మనుష్యులంతా ఇక్కడ ఉన్నారు. 11 మీ భార్యలు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీ మధ్య నివసిస్తూ, మీ కట్టెలు కొట్టి, మీకు నీళ్లు మోసే విదేశీయులు కూడా ఇక్కడ ఉన్నారు. 12 మీరంతా మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకొనేందుకు ఇక్కడ ఉన్నారు. యెహోవా నేడు మీతో ఈ ఒడంబడిక చేస్తున్నాడు. 13 ఈ ఒడంబడిక మూలంగా యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొంటున్నాడు. మరియు సాక్షాత్తూ ఆయనే మీకు దేవుడుగా ఉంటాడు. ఇది ఆయన మీతో చెప్పాడు. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన దీనిని వాగ్దానం చేశాడు. 14 యెహోవా ఈ వాగ్దానాలన్నింటితో కూడిన ఈ ఒడంబడికను మీతో మాత్రమే చేయటం లేదు. 15 ఈ వేళ ఇక్కడ మన దేవుడైన యెహోవా యెదుట నిలిచిన మనందరితో ఆయన ఈ ఒడంబడిక చేస్తున్నాడు. అయితే ఈనాడు ఇక్కడ మనతో లేని మన సంతానానికి కూడ ఈ ఒడంబడిక వర్తిస్తుంది. 16 మనం ఈజిప్టు దేశంలో ఎలా జీవించామో మీకు జ్ఞాపకమే. ఇక్కడికి వచ్చే మార్గంలో ఉన్న దేశాల్లోంచి మనం ఎలా ప్రయాణం చేసామో అదీ మీకు జ్ఞాపకమే. 17 చెక్క, రాయి, వెండి, బంగారంతో వారు చేసిన అసహ్యమైన విగ్రహాలను మీరు చూసారు. 18 ఈ వేళ ఇక్కడ ఉన్న పురుషుడుగాని, స్త్రీగాని, కుటుంబంగాని, వంశం గాని మీ దేవుడైన యెహోవా నుండి తిరిగిపోకుండా గట్టి జాగ్రత్తలో ఉండండి. ఏ వ్యక్తి కూడా పోయి ఆ రాజ్యల దేవుళ్లను సేవించకూడదు. అలా చేసేవాళ్లు చేదైన విష ఫలాలు ఫలించే మొక్కల్లా ఉంటారు.
19 “ఒక వ్యక్తి ఈ శాపాలన్నీ విని, ‘నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూనే ఉంటాను. నాకేమీ కీడు సంభవించదు’ అంటూ తనను తాను ఆదరించుకో వచ్చును. ఆ వ్యక్తి తనకు మాత్రమేగాక ప్రతి ఒక్కరికీ చివరకు మంచి వాళ్లకుకూడ కీడు జరిగిస్తాడు. 20-21 ఆ వ్యక్తిని యోహోవ క్షమించడు. మరియు, ఆ వ్యక్తిమీద యెహోవాకు కోపం వస్తుంది, యెహోవా ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వంశాలన్నింటి నుండీ యెహోవా అతణ్ణి వేరు చేసేస్తాడు. యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడిన కీడులన్నీ అతనికి సంభవిస్తాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడికలో ఆ విషయాలన్నీ ఒక భాగం:
యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును
(లూకా 12:51-53; 14:26-27)
34 “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. 35-36 ఎందుకంటే నేను,
‘తండ్రి కుమార్ల మధ్య,
తల్లీ కూతుర్ల మధ్య,
అత్తా కోడళ్ళ మధ్య,
విరోధం కలిగించాలని వచ్చాను.
ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’(A)
37 “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు. 38 నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు. 39 జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు.
నిన్ను ఆహ్వానించువారిని దేవడు దీవించును
(మార్కు 9:41)
40 “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే. 41 ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు. 42 మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.”
© 1997 Bible League International