Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.
49 సర్వ దేశములారా, ఇది వినండి.
భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
3 నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
4 సామెతపైనా ఆసక్తినుంచుతాను.
ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.
5 అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
6 ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
7 ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
8 ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
9 ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
వారు జంతువుల్లా మరణిస్తారు.
1 ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు అయిన ప్రసంగి చెప్పిన మాటలు.
2 అన్నీ చాల అర్థరహితాలు. “సమస్తం వృధా కాలయాపన!”[a] అంటాడు ప్రసంగి. 3 ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా?[b] (లేదు!)
ఏవీ ఎన్నడూ మారవు
4 ఒక తరం మారి మరొకతరం వస్తుంది. కాని, ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది. 5 సూర్యుడు ఉదయించును మరియు అస్తమించును. మరల ఉదయించే చోటుకు త్వరగా వెళతాడు.
6 గాలి దక్షిణ దిశకి వీస్తుంది, తిరిగి ఉత్తర దిశకి వీస్తుంది. గాలి, చుట్టూ తిరిగి తిరిగి చివరకు తాను బయల్దేరిన చోటుకే రివ్వున వస్తుంది.
7 నదులన్నీ మరల మరల ఒక్క చోటుకే ప్రవహిస్తాయి. అవన్నీ సముద్రంలోకే పోయి పడినా సముద్రం నిండదు.
8 ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించలేవు.[c] అయితేనేమి, మనుష్యులు మాట్లాడుతూనే వుంటారు.[d] మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడుతూనే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. అయినా మనకి తనివి తీరదు.
కొత్తదంటూ ఏదీ లేదు
9 అన్నీ ఆదినుంచి ఉన్నట్లే కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ జరుగుతాయి. ఈ జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు.
10 ఎవరైనా, “చూడండి, ఇదిగో ఇది కొత్తది” అని చెప్పవచ్చు. కాని, అది ఎప్పుడూ ఇక్కడ ఉన్నదే. మనం పుట్టక ముందు అది ఇక్కడ ఉన్నదే!
11 పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలు మనుష్యులకి గుర్తుండవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జనానికి గుర్తుండవు. దానికి తర్వాత, అప్పటివాళ్లకి, తమ పూర్వపు వాళ్లు చేసిన పనులు గుర్తుండవు.
ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం
(మత్తయి 19:16-30; లూకా 18:18-30)
17 యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరుగెత్తుకొంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా! నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
18 యేసు, “నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు. దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా! 19 హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యం చెప్పరాదు. మోసం చెయ్యరాదు. నీ తల్లి తండ్రుల్ని గౌరవించు” అని అన్నాడు.
20 అతడు, “అయ్యా! నా చిన్నతనంనుండి నేను వీటిని పాటిస్తున్నాను!” అని అన్నాడు.
21 యేసు అతని వైపు చూసాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, “నీవు యింకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు.
22 ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల దుఃఖంతో అక్కడినుండి వెళ్ళిపొయ్యాడు.
© 1997 Bible League International