Revised Common Lectionary (Complementary)
20 మరల యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ గొమొఱ్ఱాల అరుపులు చాలా పెద్దవి. వారి పాపం చాలా భయంకరమైనది అని నేను విన్నాను. 21 కనుక నేను వెళ్లి, అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా ఉన్నాయేమో చూస్తాను. అప్పుడు నాకు నిశ్చయంగా తెలుస్తుంది.”
22 అంచేత ఆ మనుష్యులు మళ్లీ సొదొమవైపు నడక ప్రారంభించారు. అయితే అబ్రాహాము యెహోవాతో అక్కడ ఉండిపోయాడు. 23 అప్పుడు అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అడిగాడు. “యెహోవా, నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచివారిని కూడా నాశనం చేస్తావా? 24 ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది మంచివాళ్లు ఉంటే ఎలా? ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? అక్కడ నివసిస్తున్న 50 మంది మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు. 25 ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచివాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.”
26 అప్పుడు, “సొదొమ పట్టణంలో 50 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను” అన్నాడు యెహోవా.
27 దానికి అబ్రాహాము ఇలా అన్నాడు: “ప్రభూ, నీతో పోల్చుకొంటే, నేను ధూళిని, బూడిదను మాత్రమే. అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగుతున్నాను. 28 ఒకవేళ అయిదుగురు మంచివాళ్లు తప్పిపోయి, 45 మంది మంచివాళ్లు మాత్రమే ఆ పట్టణంలో ఉంటే ఎలా? కేవలం అయిదుగురు తక్కువ అయినందువల్ల మొత్తం పట్టణమంతటిని నాశనం చేస్తావా?”
“అక్కడ 45 మంది మంచివాళ్లు గనుక నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను వదిలివేస్తాను” అన్నాడు యెహోవా.
29 మరల అబ్రాహాము, “అక్కడ 40 మంది మంచివాళ్లు మాత్రమే నీకు కనబడినా, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని యెహోవాను అడిగాడు.
“40 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు యెహోవా.
30 అందుకు అబ్రాహాము, “ప్రభూ, నా మీద కోపగించకు. మరొక్క మాట అడుగుతాను. ఆ పట్టణంలో 30 మంది మంచివాళ్లు మాత్రమే కనబడితే, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని అడిగాడు.
అందుకు యెహోవా, “అక్కడ 30 మంది మంచివాళ్లు నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని చెప్పాడు.
31 అప్పుడు అబ్రాహాము, “నా ప్రభువుతో మరోసారి మాటలాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది మంచివాళ్లే ఉంటే” అన్నాడు.
“20 మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని జవాబిచ్చాడు యెహోవా.
32 అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు, “ప్రభూ, నాపై కోపగించకు, ఈ ఒక్కసారే చివరిగా నీతో మాటలాడ తెగిస్తున్నాను. పదిమంది మంచివాళ్లే గనుక అక్కడ నీకు కనబడితే, నీవేం చేస్తావు?”
“పదిమంది మంచివాళ్లు గనుక అక్కడ నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అన్నాడు యెహోవా.
దావీదు కీర్తన.
138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
యెహోవా మహిమ గొప్పది.
6 దేవుడు గొప్పవాడు.
అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం
6 మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి. 7 మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి.
8 మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు. దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజంవల్ల కలిగిన నియమాలు కారణం. 9 ఎందుకంటే, దేవుని ప్రకృతి క్రీస్తులో సంపూర్ణంగా మానవ రూపంతో జీవిస్తోంది. 10 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీకు ఆ సంపూర్ణత లభించింది. క్రీస్తు అన్ని శక్తులకూ, అన్ని అధికారాలకూ అధిపతి.
11 ఆయనతో మీకు కలిగిన ఐక్యతవల్ల మీరు సున్నతి పొందారు. ఈ సున్నతి మానవులు చేసింది కాదు. ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి విముక్తి పొందటమే ఈ సున్నతి. 12 మీరు బాప్తిస్మము పొందటంవల్ల క్రీస్తులో సమాధి పొందారు. క్రీస్తును బ్రతికించిన దేవుని శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాప్తిస్మము వల్ల యిది కూడా సంభవించింది. 13 మీరు చేసిన పాపాలవల్ల, పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి స్వేచ్ఛ పొందకుండా మీరు గతంలో ఆత్మీయంగా మరణించారు. కాని దేవుడు మీ పాపాలన్నిటినీ క్షమించి, క్రీస్తుతో సహా మిమ్మల్ని బ్రతికించాడు. 14 ఆ పద్ధతులను గురించి, నియమాలను గురించి మనం వ్రాత మూలంగా అంగీకరించిన పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక, ఆయన దానిని తీసుకెళ్ళి మేకులతో సిలువకు కొట్టాడు. 15 అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా చేసి వాటిని బహిరంగంగా హేళన చేసి, సిలువతో వాటిపై విజయం సాధించాడు.
మానవకల్పిత నియమాలు పాటించకు
16 అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి. 17 ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది. 18 కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్తపడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూ ఉంటారు. 19 శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు.
యేసు ప్రార్థన గురించి బోధించటం
(మత్తయి 6:9-15)
11 ఒక రోజు యేసు ఒక చోట ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించటం ముగించాక ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ! యోహాను తన శిష్యులకు ప్రార్థించటం నేర్పించినట్లు మాక్కూడా ప్రార్థించటం నేర్పండి” అని అడిగాడు.
2 ఆయన వాళ్ళతో, “మీరు ఈ విధంగా ప్రార్థించాలి:
‘తండ్రీ! నీ పేరు పవిత్రంగానే ఉండాలి!
నీ రాజ్యం రావాలి!
3 మాకు ప్రతి రోజు ఆహారం యివ్వు!
4 మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము క్షమించినట్లు
మా పాపాలు క్షమించు.
మమ్మల్ని శోధనలో పడనివ్వవద్దు!’”
నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము
(మత్తయి 7:7-11)
5-6 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “ఒక వేళ మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన స్నేహితుని యింటికి వెళ్ళి, ‘నా స్నేహితుడు ఒకడు అకస్మాత్తుగా మా యింటికొచ్చాడు. మా యింట్లో తినటానికి ఏమి లేదు. మూడు రొట్టెలుంటే యిస్తావా?’ అని అడిగాడనుకొండి. 7 ఆ స్నేహితుడు యింటి నుండి బయటకు రాకుండా, ‘నేను, నా పిల్లలు పడుకున్నాం. తలుపులు కూడా తాళం వేసాం. అనవసరంగా బాధ పెట్టొద్దు. అయినా యిప్పుడు లేచి నేను రొట్టెలివ్వలేను’ అని అన్నాడనుకోండి. నేను చెప్పేదేమిటంటే, 8 అతడు తన స్నేహితుడైనందుకు రొట్టెలు యివ్వకపోయినా మొండిగా అడగటం వల్ల తప్పక లేచి అతడడిగిన రొట్టెలు యిస్తాడు. 9 కనుక, నేను మీకు చెప్పేదేమంటే; అడగండి, మీకు లభిస్తుంది. వెతకండి దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది. 10 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన వానికి దొరుకుతుంది. తలుపు తడితే అది అతని కోసం తెరుచుకుంటుంది. 11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు? 12 లేక గ్రుడ్డునడిగితే తేలునిస్తాడు? 13 మీరు చెడ్డవాళ్లైనా మీ కుమారులకు మంచి బహుమతులు ఎట్లా యివ్వాలో మీకు తెలుసు. కనుక పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగినవాళ్ళకు పవిత్రాత్మను తప్పక యిస్తాడని గ్రహించండి” అని చెప్పాడు.
© 1997 Bible League International