Revised Common Lectionary (Complementary)
ముగ్గురు అతిథులు
18 తర్వాత మళ్లీ అబ్రాహాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మమ్రేలోని సింధూర వనమునకు దగ్గర్లో అబ్రాహాము నివసిస్తున్నాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అబ్రాహాము తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు. 2 అబ్రాహాము తలెత్తి చూడగా, తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబడ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్లి, వారి ముందు వంగి, 3 ఇలా అన్నాడు, “అయ్యలారా, మీ దాసుడనైన నా దగ్గర దయచేసి కొంత కాలం ఉండండి. 4 మీ కాళ్లు కడుక్కొనేందుకు నేను నీళ్లు తెస్తాను. చెట్ల క్రింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. 5 మీ కోసం నేను భోజనం తెస్తాను, కడుపు నిండా భోంచేయండి. తర్వాత మీ దారిన మీరు వెళ్లొచ్చు.”
“చాలా బాగుంది, అలాగే కానీయి” అని ఆ ముగ్గురు మనుష్యులు అన్నారు.
6 అబ్రాహాము తన గుడారము దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. “మూడు రొట్టెలకు సరిపడె గోధుమలు త్వరగా తయారు చేయి” అని అబ్రాహాము శారాతో అన్నాడు. 7 తర్వాత అబ్రాహాము తన పశువుల దగ్గరకు పరుగెత్తాడు. అబ్రాహాము చాలా మంచి లేత దూడను తీసుకొని తన సేవకునికి ఇచ్చాడు. త్వరగా ఆ దూడను వధించి, దానితో భోజనం సిద్ధం చేయమని అబ్రాహాము చెప్పాడు. 8 ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుష్యులు భోంచేసేందుకు అబ్రాహాము ఇచ్చాడు. అతడు పాలు, వెన్న కూడ వాళ్లకు ఇచ్చాడు. ఆ ముగ్గురు చెట్టు క్రింద భోజనం చేస్తూ ఉండగా అబ్రాహాము వారి దగ్గర నిలబడ్డాడు.
9 “నీ భార్య శారా ఎక్కడ?” అంటూ ఆ ముగ్గురు అబ్రాహామును అడిగారు.
“ఆమె అక్కడ గుడారంలో ఉంది” అని అబ్రాహాము అన్నాడు.
10 అప్పుడు యెహోవా, “మళ్లీ వసంతకాలంలో నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు” అని అన్నాడు.
గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది.
దావీదు కీర్తన.
15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
5 ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
క్రీస్తు యొక్క గొప్పతనము
15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.
17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
ఆయనే అన్నిటికీ మూలం.
చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.
19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20 దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.
21 మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. 22 కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం.
23 మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, దృఢంగా, స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింపబడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను.
సంఘం కోసం పౌలు పడిన శ్రమ
24 మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు యిప్పుడు నాకు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించవలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తోంది. 25 తన సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఉపదేశించమని దేవుడు నన్ను నియమించాడు. తత్కారణంగా నేను క్రీస్తు సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. 26 యుగయుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన ఈ దైవసందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది. 27 భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులు కానివాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది. 28 ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందినవాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము.
యేసు మార్త యింటికి వెళ్ళటం
38 యేసు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో మార్త అనే స్త్రీ ఆయన్ని తన యింటికి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే ఒక సోదరి ఉంది. మరియ యేసు ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంది. 40 కాని మార్తకు పని ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరి యింటి పనులంతా నామీద వదిలి వేయటం మీకు న్యాయమనిపిస్తుందా? వచ్చి నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పండి” అని అన్నది.
41 ప్రభువు, “మార్తా! మార్తా! పనులు ఎక్కువగా ఉండటంవల్ల నీకు చింత, చిరాకు కలుగుతున్నాయి. 42 నిజంగా చెయ్యవలసింది ఒక్కటే పని. మరియ ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకొంది. దాన్ని ఆమెనుండి ఎవ్వరూ తీసుకోలేరు” అని అన్నాడు.
© 1997 Bible League International