Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 66:10-14

10 యెరూషలేమా, సంతోషించు! యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి.
    విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి. కనుక మీరు కొంతమంది మనుష్యులు విచారించారు. కానీ, అలాంటి మీరు ఇప్పుడు ఎంతో ఎంతో సంతోషించాలి.
11 ఎందుకంటే ఆమె స్థనాలనుండి పాలు వచ్చినట్లుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ “పాలు” నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి.
    ప్రజలారా, మీరు పాలు త్రాగుతారు.
    మరియు మీరు యెరూషలేము మహిమను నిజంగా అనుభవిస్తారు.

12 యెహోవా చెబుతున్నాడు:
“చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది.
    భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి.
మీరు చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు ‘పాలు’ త్రాగుతారు.
    మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు.
    మీరు నా మోకాళ్లమీద ఊపబడతారు.
13 యెరూషలేములో మీరు ఓదార్చబడతారు.
    ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను.”

14 మీరు నిజంగా అనుభవించేవాటిని మీరు చూస్తారు.
    మీరు స్వతంత్రులై, గడ్డి పెరుగునట్లు పెరుగుతారు.
యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు.
    కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు.

కీర్తనలు. 66:1-9

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.

గలతీయులకు 6:1-6

అందరికీ మంచి చెయ్యండి

నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్నవాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి. పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించినవాళ్ళౌతారు. తనలో ఏ గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే తనను తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు. ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

మంచి చేయుట ఎన్నడూ మానవద్దు

దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.

గలతీయులకు 6:7-16

మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము. శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు. కనుక మనం విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడువకుండా మంచి చేస్తే సరియైన సమయానికి మంచి అనే పంట కోయగలుగుతాము. 10 మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం.

చివరి మాట

11 ఇది మీకు నేను నా స్వహస్తాలతో వ్రాసాను. మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో చూడండి. 12 నలుగురిలో మంచి పేరు పొందాలనుకొన్నవాళ్ళు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళీ విధంగా చెయ్యటానికి ఒకే ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువను గురించి బోధించటం వల్ల కలిగే హింసనుండి తప్పించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. 13 సున్నతి చేసుకొన్నవాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. కాని శారీరకంగా వాళ్ళు గర్వించటానికి మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటున్నారు.

14 యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించను. ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చియున్నాము. 15 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోకపోయినా ఒకటే. క్రొత్త జీవితం పొందటం ముఖ్యం. 16 ఈ నియమాల్ని పాటించేవాళ్ళందరికీ, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు శాంతి, అనుగ్రహం లభించును గాక.

లూకా 10:1-11

యేసు తన డెబ్బది రెండు మంది శిష్యులను పంపటం

10 ఆ తర్వాత యేసు మరొక డెబ్బది రెండు[a] మంది శిష్యులను నియమించాడు. వాళ్ళను జతలు జతలుగా తాను వెళ్ళబోయే ప్రతి గ్రామానికి, పల్లెకు తన కంటే ముందు పంపుతూ, “పంటబాగా పండింది. కాని పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల పంటనిచ్చిన ఆ ప్రభువును పని వాళ్ళను తన పొలాలకు పంపమని ప్రార్థించండి.

“వెళ్ళండి! తోడేళ్ళ మందలోకి గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. మీ వెంటడబ్బు దాచుకొనే సంచి కాని, జోలి కాని, చెప్పులు కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడకండి. ఒకరి యింట్లోకి వెళ్ళేముందు, మొదట సమాధానం కలుగుగాక అని చెప్పండి. ఆ యింటిలో శాంతి పొందనర్హుడైన వ్యక్తి ఉంటే మీ ఆశీస్సు అతనికి తోడౌతుంది. లేని పక్షంలో మీ ఆశీస్సు మీకు తిరిగివస్తుంది. ఉన్న యింట్లోనే ఉండండి. ఇచ్చిన దాన్ని భుజించండి. పని చేసినవానికి కూలి దొరకాలి కదా! ఇల్లిల్లు తిరగకండి.

“ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగతమిచ్చి ఏది మీ ముందు పెడితే అది భుజించండి. గ్రామంలో ఉన్న రోగులకు నయం చెయ్యండి. వాళ్ళతో, ‘దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తోంది’ అని చెప్పండి.

10 “మీరొక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగత మివ్వకుంటే 11 వీధిలోకి వెళ్ళి మీరు చేస్తున్నది తప్పని సూచించటానికి, ‘మా కాలికంటిన మీ ఊరి ధూళి కూడా దులిపి వేస్తున్నాము. కాని యిది మాత్రం నిజం. దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది. తెలిసికోండి’ అని అనండి.

లూకా 10:16-20

16 “మీ బోధనలు వింటే నా బోధనలు విన్నట్టే. మిమ్మల్ని నిరాకరిస్తే నన్నును నిరాకరించినట్టే. నన్ను నిరాకరిస్తే నన్ను పంపినవానిని నిరాకరించినట్లే” అని వాళ్ళతో అన్నాడు.

సాతాను పడిపోవటం

17 ఆ డెబ్బది రెండు మంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి, “ప్రభూ! మీ పేరు చెప్పగానే దయ్యాలు కూడా మా మాటలకు లోబడ్డాయి” అని అన్నారు.

18 యేసు, “సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడిపోవటం నేను చూశాను. 19 పాముల మీద నడవటానికి మీకు అధికారము యిచ్చాను. శత్రువును జయించే అధికారం యిచ్చాను. ఏది మీకు హాని చెయ్యలేదు. 20 దయ్యాలు మీ మాట వింటున్నంత మాత్రాన ఆనందించకండి. మీ పేరు పరలోకంలో వ్రాయబడినందుకు ఆనందించండి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International