Revised Common Lectionary (Complementary)
ప్రజలందరూ దేవుని గూర్చి నేర్చుకొంటారు
65 యెహోవా చెబుతున్నాడు: “సలహాకోసం నా వద్దకు రాని ప్రజలకు నేను సహాయం చేశాను. నన్ను కనుగొన్నవారు నాకోసం వెదకిన వారు కారు. నా పేరు పెట్టబడని ఒక ప్రజతో నేను మాట్లాడాను. ‘నేనిక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను’ అని నేను చెప్పాను.
2 “నాకు విరోధంగా తిరిగిపోయిన వారిని చేర్చుకొనేందుకు నేను సిద్ధంగా నిలబడ్డాను. ఆ ప్రజలు నా దగ్గరకు వస్తారని నేను కనిపెట్టాను. కానీ వారు చెడుమార్గంలోనే జీవించటం కొనసాగించారు. వారి హృదయాలు కోరినవన్నీ వారు చేశారు. 3 ఆ మనుష్యులు నాకు ఎల్లప్పుడూ కోపం పుట్టిస్తూ, నా యెదుట ఉన్నారు. ఆ ప్రజలు వారి ఉద్యానవనాల్లో బలులు అర్పిస్తారు. ధూపం వేస్తారు. 4 ఆ మనుష్యులు సమాధుల్లో కూర్చొంటారు. చనిపోయిన వారి దగ్గర్నుండి సందేశాలకోసం వారు కనిపెడ్తారు. వారు శవాలమధ్య కూడా నివసిస్తారు. వారు పంది మాంసం తింటారు. వారి కత్తులు, గరిటెలు కుళ్లిపోయిన మాంసంతో మైలపడ్డాయి. 5 కానీ ఆ ప్రజలే, ‘దగ్గరకు రాకు, నేను నిన్ను శుద్ధి చేసేంతవరకు నన్ను ముట్టకు’ అని ఇతరులతో చెబుతారు. ఆ ప్రజలు నా కంటికి పొగలా ఉన్నారు. మరియు వారి అగ్ని ఎంతసేపూ మండుతూనే ఉంటుంది.”
ఇశ్రాయేలు శిక్షింపబడాలి
6 “చూడు, నీవు చెల్లించాల్సిన లెక్క చీటి ఒకటి ఇక్కడ ఉంది. నీ పాపాల మూలంగా నీవు దోషివి అని ఈ లెక్క చీటి చూపిస్తుంది. ఈ లెక్క చీటి చెల్లించే వరకు నేను ఊరుకోను, నేను మిమ్మల్ని శిక్షించటం ద్వారా లెక్క చీటి చెల్లిస్తాను. 7 మీ పాపాలు, మీ తండ్రుల పాపాలు అన్నీ ఒకటే. యెహోవా ఇలా చెప్పాడు, ‘మీ తండ్రులు పర్వతాల్లో ధూపం వేసినప్పుడు ఈ పాపాలు చేశారు. ఆ కొండల మీద వారు నన్ను అవమానించారు. మరియు నేను మొదట వాళ్లను శిక్షించాను. వారు పొందాల్సిన శిక్ష నేను వారికి ఇచ్చాను.’”
8 యెహోవా చెబుతున్నాడు: “ద్రాక్షపండ్లలో క్రొత్తరసం ఉన్నప్పుడు, ప్రజలు ఆ ద్రాక్షరసాన్ని పిండుతారు. కాని ద్రాక్ష పండ్లను మాత్రం వారు పూర్తిగా నాశనం చేయరు. ఆ ద్రాక్షపండ్లు ఇంకా ఉపయోగపడ్తాయి. కనుక వారు యిలా చేస్తారు. నా సేవకులకు కూడ నేను అలాగే చేస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చేయను. 9 యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలు కొందరిని నేను ఉంచుతాను. యూదా ప్రజలు కొందరికి నా పర్వతం లభిస్తుంది. నా సేవకులు అక్కడ నివసిస్తారు. అక్కడ నివసించాల్సిన మనుష్యులను నేను ఏర్పరచుకొంటాను.
19 యెహోవా, నన్ను విడువకుము!
నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము.
22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
యెహోవా వారిని ద్వేషించడు.
ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.
25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
23 విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. 24 మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. 25 ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు.
26 యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. 27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. 28 ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం. 29 మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.
యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం
(మత్తయి 8:28-34; మార్కు 5:1-20)
26 యేసు మరియు ఆయన శిష్యులు గెరాసేనులు అనే ప్రజలు నివసించే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం గలిలయ సముద్రానికి అవతలి వైపున ఉంటుంది. 27 యేసు ఒడ్డు చేరగానే దయ్యం పట్టిన ఆ ఊరి వాడొకడు యేసు దగ్గరకు వచ్చాడు. చాలాకాలం నుండి అతడు బట్టలు వేసుకొనేవాడు కాదు. ఇంట్లో నివసించే వాడు కాదు. స్మశానాల్లో నివసించేవాడు.
28 ఆ దయ్యం పట్టినవాడు యేసును చూడగానే పెద్ద గొంతుతో, “యేసూ! దేవుని కుమారుడా! నాతో నీకేం పని? నన్ను హింసించవద్దని వేడుకొంటున్నాను” అని బిగ్గరగా అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. 29 యేసు ఆ దయ్యాన్ని అతని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ దయ్యం అతణ్ణి చాలాసార్లు ఆవరించింది. అతని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి కాపలాలోవుంచేవాళ్ళు. అయినా అతడు ఆ గొలసులను తెంపుకొనేవాడు. ఆ దయ్యం అతణ్ణి నిర్మానుష్య స్థలాలకు లాక్కొని వెళ్ళేది.
30 యేసు, “నీ పేరేమిటి?” అని అడిగాడు.
అతడు, “సేన” అని సమాధానం చెప్పాడు. ఎన్నో దయ్యాలు వానిలో ఉండటం వల్ల ఈ విధంగా సమాధానం చెప్పాడు. 31 ఆ దయ్యాలు తమను పాతాళం లోకి పడవేయ వద్దని ఎంతో ప్రాధేయ పడ్డాయి. 32 అక్కడ కొండ మీద ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు, తాము ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు అనుమతి యివ్వుమని యేసును వేడుకున్నాయి. ఆయన అనుమతినిచ్చాడు. 33 ఆ దయ్యాలు ఆ మనిషి నుండి బయటకు వచ్చి పందుల్లోకి జొరబడ్డాయి. ఆ తర్వాత అవి ఆ కొండనుండి క్రిందికి పరుగెత్తి సముద్రంలో పడి మునిగి పొయ్యాయి.
34 పందులు కాస్తున్న వాళ్ళు జరిగింది చూసి పరుగెత్తి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళకు, పొలాల్లో ఉన్న వాళ్ళకు చెప్పారు. 35 ప్రజలు ఏమి జరిగిందో చూడాలని అక్కడికి వెళ్ళారు. అంతా యేసు దగ్గరకు వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలింపబడ్డవాడు యేసు కాళ్ళ దగ్గరవుండటం వాళ్ళు చూశారు. అతని ఒంటిపై దుస్తులువున్నాయి. అతని ప్రవర్తన సహజంగా ఉంది. ఇది గమనించి వాళ్ళకు భయం వేసింది. 36 జరిగింది చూసిన వాళ్ళు ఆ దయ్యం పట్టినవానికి ఏ విధంగా నయమైపోయిందో వచ్చిన వాళ్ళకు చెప్పారు. 37 గెరాసేను ప్రజలందరికి చాలా భయం వేయటంవల్ల తమ ప్రాంతం వదిలి వెళ్ళమని వాళ్ళు యేసుతో అన్నారు.
అందువల్ల ఆయన పడవనెక్కి వెళ్ళిపోయాడు. 38 దయ్యాలు వదిలింపబడ్డ వాడు వెంటవస్తానని యేసును బ్రతిమిలాడాడు. 39 యేసు అతనితో, “నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు చేసిన మేలు అందరికి చెప్పు” అని అతణ్ణి పంపివేసాడు.
అందువల్ల అతడు వెళ్ళి యేసు తనకు చేసిన మేలు తన గ్రామంలో ఉన్న వాళ్ళందరికి చెప్పాడు.
© 1997 Bible League International