Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
13 చాలామంది ప్రజలు జట్లు జట్లుగా పులియని రొట్టెల పండుగ[a] జరుపుకోటానికి రెండవ నెలలో యెరూషలేముకు వచ్చారు. ప్రజాసమూహం పెద్దగా వుంది. 14 యెరూషలేములో బూటకపు దేవుళ్ల ఆరాధనకు నిర్మింపబడ్డ బలిపీఠాలన్నిటినీ అక్కడ చేరిన ప్రజలు తొలగించారు. బూటకపు దేవుళ్లకు నిర్మించిన ధూప పీఠాలను కూడా వారు తీసివేశారు. ఆ బలిపీఠాలన్నిటినీ వారు కిద్రోను లోయలో పారవేశారు. 15 పిమ్మట వారు రెండవ నెల పదునాల్గవ తేదీన పస్కా గొర్రెపిల్లను చంపారు. యాజకులు, లేవీయులు సిగ్గుపడి పవిత్ర సేవా కార్యక్రమానికి పరిశుద్ధులై సిద్ధమయ్యారు. యాజకులు, లేవీయులు దహనబలులు ఆలయానికి తీసుకొనివచ్చారు. 16 యెహోవా సేవకుడైన మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారంతా ఆలయంలో తమ తమ స్థానాలను ఆక్రమించారు. లేవీయులు బలుల రక్తాన్ని యాజకులకిచ్చారు. ఆ రక్తాన్ని యాజకులు బలిపీఠం మీద చిలికించారు. 17 సమావేశమైన వారిలో శుచియై సేవా కార్యాక్రమానికి సిద్ధం కానివారు అనేకమంది వున్నారు. కావున వారు పస్కా గొర్రెపిల్లలను చంపటానికి అనుమతింపబడలేదు. ఆ కారణంగా లేవీయులు పరిశుద్ధులు కాని వారందరి తరుపునా పస్కా బలులు అర్పించవలసి వచ్చింది. లేవీయులు ప్రతి గొర్రెపిల్లను పవిత్రపర్చి బలికి సిద్ధం చేశారు.
18-19 ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు మరియు జెబూలూను ప్రజలలో చాలామంది పస్కా పండుగుకు ధర్మశాస్త్రీయంగా తమను తాము పవిత్రపర్చుకోలేదు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిలో వారు పస్కా పండుగను సక్రమంగా జరుపుకోలేదు. కాని హిజ్కియా వారికొరకు ప్రార్థన చేశాడు. హిజ్కియా యిలా ప్రార్థన చేశాడు: “ప్రభువైన యెహోవా, నీవు మంచివాడవు. ఈ ప్రజలు నిజానికి నిన్ను ధర్మశాస్త్రానుసారంగా ఆరాధించాలనుకున్నారు. కాని ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా వారు తమను తాము పవిత్ర పర్చుకోలేదు. దయచేసి వారిని క్షమించు. నీవు మా పూర్వీకులు విధేయులైయున్న దేవుడివి. అతిపవిత్ర స్థానానికి అర్హమైన రీతిలో ప్రజలెవరైనా తమను తాము పవిత్ర పర్చుకొనకపోయినా నీవు వారిని క్షమించ కోరుతున్నాను.” 20 రాజైన హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన ప్రజలను క్షమించాడు. 21 ఇశ్రాయేలు సంతతివారు యెరూషలేములో ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను జరుపుకున్నారు. వారంతా చాలా ఆనందోత్సాహాలతో వున్నారు. లేవీయులు, యాజకులు ప్రతిరోజు తమ శక్తి కొలది యెహోవాకు స్తోత్రం చేశారు. 22 యెహోవా సేవా కార్యక్రమంలో పరిపూర్ణ జ్ఞానంగల లేవీయులందరినీ రాజైన హిజ్కియా ప్రోత్సహించాడు. ప్రజలు పండుగను ఏడు రోజులపాటు జరిపి సమాధాన బలులు అర్పించారు. వారు తమ పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.
23 ప్రజలంతా అక్కడ మరి ఏడు రోజులు వుండటానికి ఇష్టపడ్డారు. పస్కా పండుగను మరి ఏడు రోజులు జరుపుకున్నందుకు వారు సంతోషించారు. 24 యూదా రాజైన హిజ్కియా ఒక వెయ్యి గిత్తలను, ఏడువేల గొర్రెలను సమావేశమైన ప్రజల ఆహారం నిమిత్తం ఇచ్చాడు. పెద్దలు కూడా వెయ్యిగిత్తలను, పదివేల గొర్రెలను ప్రజలకు ఆహారంగా ఇచ్చారు. చాలామంది యాజకులు పవిత్ర కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. 25 యూదా నుండి వచ్చిన ప్రజా సమూహం, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నుండి వచ్చిన జనం, మరియు ఇశ్రాయేలు నుండి యూదాకు వచ్చిన ఇతర యాత్రీకులు-అందరూ చాలా సంతోషపడ్డారు. 26 అందువల్ల యెరూషలేములో ఆనందం వెల్లివిరిసింది. దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను కాలం తరువాత ఇప్పటివరకు ఇంత వైభవంగా ఏ ఉత్సవం నిర్వహింపబడలేదు. 27 యాజకులు, లేవీయులు లేచి నిలబడి ప్రజలను దీవించుమని యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారి ప్రార్థన యెహోవా పరిశుద్ధ నివాసం చేరింది.
యేసు పక్షవాత రోగిని నయం చేయటం
(మత్తయి 9:1-8; లూకా 5:17-26)
2 కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. 2 చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. 3 ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. 4 చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. 5 యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు.
6 అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. 7 “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు.
8 వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? 9 ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, 11 “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు.
© 1997 Bible League International