Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 68:1-10

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

68 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము.
    ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక!
గాలికి ఎగిరిపోయే పొగలా
    నీ శత్రువులు చెదరిపోవుదురుగాక.
అగ్నిలో మైనం కరిగిపోయేలా
    నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక.
కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు.
    మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు.
దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి.
    ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు.
ఆయన పేరు యాహ్.[a]
    ఆయన నామాన్ని స్తుతించండి.
ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు.
    దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు.
    దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు.
    కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.

దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు.
    ఎడారిగుండా నీవు నడిచావు.
భూమి కంపించింది.
    దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.
దేవా, నీవు వర్షం కురిపించావు
    మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు.
10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి.
    దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచివాటిని యిచ్చావు.

కీర్తనలు. 68:19-20

19 యెహోవాను స్తుతించండి.
    మనం మోయాల్సిన బరువులు మోయటంలో ప్రతిరోజూ ఆయన మనకు సహాయం చేస్తాడు.
    దేవుడు మనల్ని రక్షిస్తాడు.

20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు.
    మన యెహోవా దేవుడు మనల్ని మరణంనుండి రక్షిస్తాడు.

యిర్మీయా 8:14-22

14 “మనమిక్కడ అనవసరంగా ఎందుకు కూర్చున్నాము?
    రండి, బలమైన నగరాలకు పారిపోదాం.
మన దేవుడైన యెహోవా మనల్ని చంపబోతూవుంటే, మనం అక్కడే చనిపోదాం.
మనం యెహోవా పట్ల తీరని పాపం చేశాం.
    అందుచేత దేవుడు విషం కలిపిన నీటిని మనకు తాగటానికి ఇచ్చాడు.
15 మనం శాంతిని కోరుకున్నాం;
    కాని శాంతి కలుగలేదు.
స్వస్థత సమయం కొరకు ఎదురు చూశాం,
    కాని విపత్తు మాత్రమే ముంచుకొచ్చింది.
16 దాను వంశీయుల రాజ్యంనుండి
    శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి.
    వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది.
వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ
    నాశనం చేయాలని వచ్చియున్నారు.
వారీ నగరాన్ని, నగరవాసులను
    సర్వనాశనం చేయటానికి వచ్చారు.

17 “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను[a] పంపుతున్నాను.
    ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు.
    ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!

18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది.
19 నా ప్రజల మొరాలకించుము!
    దేశంలో ప్రతిచోటా వారు సహాయాన్ని అడుగుచున్నారు.
“సీయోనులో యెహోవా ఇంకా వున్నాడా?
    సీయోను రాజు ఇంకా అక్కడ ఉన్నాడా?” అని వారంటున్నారు.

కాని దేవుడిలా అంటున్నాడు: “యూదా ప్రజలు వారి విగ్రహాలను ఆరాధించి నాకెందుకు కోపం కల్గించారు?
    వారు అన్యదేశాల వారి పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
20 మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు:
    “పంటకోత కాలం అయిపోయింది.
    వేసవి వెళ్లిపోయింది. అయినా మేము రక్షించబడలేదు.”

21 నా జనులు బాధపడియుండుటచేత[b] బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.
22 వాస్తవానికి గిలియాదులో తగిన ఔషధం ఉంది!
    వాస్తవానికి గిలియాదులో వైద్యుడు కూడా ఉన్నాడు!
అయితే నా ప్రజల గాయాలు ఎందుకు నయం చేయబడలేదు?

లూకా 8:40-56

యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం

(మత్తయి 9:18-26; మార్కు 5:21-43)

40 ప్రజలందరూ యేసు కోసం వేచి ఉన్నారు. ఆయన రాగానే వాళ్ళు ఆయనకు స్వాగతమిచ్చారు. 41 అదే సమయానికి సమాజ మందిరానికి అధికారిగా ఉన్న యాయీరు అన్న వ్యక్తి ఒకడు వచ్చి యేసు కాళ్ళ మీద పడ్డాడు. 42 తన పన్నెండేండ్ల కుమార్తె కూతురు చనిపోతుందని, తనకు ఒకే కూతురని, తన యింటికి వచ్చి ఆమెకు నయం చేయమని వేడుకున్నాడు.

యేసు అతని ఇంటికి వెళ్తుండగా, ప్రజలు త్రోసుకొంటూ ఆయన చుట్టూ ఉన్నారు. 43 ఆ గుంపులో పన్నెండేండ్లనుండి రక్తస్రావంతో బాధపడ్తున్న ఒక స్త్రీ ఉంది. ఆమె తన దగ్గరున్న ధనమంతా ఖర్చు పెట్టినా ఏ వైద్యుడూ ఆమె రోగాన్ని నయం చేయలేక పోయాడు 44 ఆమె యేసు వెనుకనుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. 45 ఆయన, “నన్నెవరు తాకారు?” అని అడిగాడు.

అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ! ప్రజలు త్రోసుకొంటూ మీ మీద పడ్తున్నారు కదా! ఎవరని చెప్పగలము?” అని అన్నాడు.

46 యేసు, “కాని ఎవరోనన్ను తాకారు. నా నుండి శక్తి వెళ్ళటం గమనించాను” అని అన్నాడు. 47 అప్పుడా స్త్రీ తనను గమనించకుండా ఉండరని గ్రహించి, వణకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో అందరి సమక్షంలో చెప్పింది. 48 అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా! నీ విశ్వాసం నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు” అని అన్నాడు.

49 యేసు యింకా మాట్లాడుతుండగా ఆ సమాజ మందిరపు అధికారి ఇంటినుండి ఒకడు వచ్చి అతనితో, “మీ కూతురు చనిపోయింది. ప్రభువును కష్టపెట్టనవసరం లేదు” అని అన్నాడు.

50 ఇది విని యేసు యాయీరుతో, “భయపడకు, విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది” అని అన్నాడు.

51 యేసు యాయీరు యింటికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ అమ్మాయి తల్లి తండ్రుల్ని తప్ప మరెవ్వరిని తన వెంట రానివ్వలేదు. 52 వాళ్ళంతా ఆమె కోసం శోకిస్తూ ఉన్నారు. యేసు, “మీ శోకాలు ఆపండి. ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే” అని అన్నాడు.

53 ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు ఆయన్ని హేళన చేసారు. 54 యేసు ఆమె చేతులు పట్టుకొని, “లే అమ్మాయి!” అని అన్నాడు. 55 ఆమె ఆత్మ తిరిగి ఆమెలో చేరింది. ఆమె వెంటనే లేచి కూర్చొంది. యేసు వాళ్ళతో, “ఆమెకు ఏదైనా తినటానికి యివ్వండి” అని అన్నాడు. 56 ఆమె తల్లి తండ్రులు దిగ్భ్రాంతి చెందారు. కాని యేసు జరిగిన దాన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఆజ్ఞాపించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International