Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
12 ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా! నన్నింకా కొన్ని విషయాలు చెప్పనీయండి” అని అన్నది.
చెప్పమన్నాడు రాజు.
13 ఆ స్త్రీ ఇలా అన్నది: “దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇవన్నీ నీవెందుకు చేస్తున్నావు? అవును. ఇవన్నీ చేస్తూ నీవు దోషివని బహిర్గతం చేసుకుంటున్నావు![a] ఎందువల్లననగా నీవు నీయింటి నుండి పంపివేసిన నీ కుమారుని తిరిగి తీసుకొని రాలేదు. 14 మనమంతా ఏదో ఒక రోజు చనిపోవటమనేది సత్యం. మనమంతా నేల మీద ఒలికిన నీరులాంటివారం. ఈ ఒలికిన నీటిని మట్టిలో నుండి తిరిగి తీయటం ఎవ్వరికీ సాధ్యం కాని పని. కాని దేవుడు ప్రాణాన్ని తీసుకొనడు. ఇండ్లనుండి తరిమి వేయబడిన వారికి దేవుడు ఒక పథకం తయారుచేసి ఉంచుతాడు. అంటే వారు ఆయన నుండి బలవంతంగా దూరం చేయబడలేదు! 15 నా ప్రభువైన రాజా! ఈ మాటలు నీకు చెప్పటానికి నేను వచ్చాను. కారణమేమంటే, ప్రజలు నన్ను భయపెట్టారు! నేను వాళ్లతో నన్ను పోయి రాజుతో మాట్లాడనీయమన్నాను. బహుశః రాజు నా విన్నపం ఆలకింపవచ్చునని అన్నాను. 16 రాజు వింటాడు. విని నన్ను, నా కుమారుణ్ణి చంపజూస్తున్న వారి నుండి రక్షణ కల్పిస్తాడనీ; దేవుడు ప్రసాదించిన ఆస్తిని అనుభవించకుండ చేయజూస్తున్న వారి నుంచి మమ్మల్ని రక్షిస్తాడనీ అనుకున్నాను. 17 నా ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు గాక!”
18 అది విని ఆశ్చర్యపడిన రాజైన దావీదు, “నేనొక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధనం చెప్పాలి” అన్నాడు.
ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా దయచేసి మీ ప్రశ్న అడగండి!” అన్నది.
19 “విషయాలన్నీ మాట్లాడమని యోవాబు నీతో చెప్పాడా?” అని రాజు అడిగాడు.
ఆ స్త్రీ ఇలా అన్నది: “నీ ప్రమాణంగా, నా ప్రభువైన రాజా, నీవు నిజం చెప్పావు. నీ సేవకుడైన యోవాబు ఇవన్నీ చెప్పమని నాతో అన్నాడు. 20 యోవాబు ఇలా ఎందుకు చేశాడంటే నీవు పరిస్థితులు నిష్పక్షపాతంగా, రాగ ద్వేషాలు లేకుండా అవగాహన చేసుకొని యుక్తమైన నిర్ణయం తీసుకుంటావని. నా ప్రభువా, నీవు దేవ దూతలా తెలివిగలవాడవు. ఈ భూమిమీద జరిగేదంతా నీకు తెలుసు.”
అబ్షాలోము యెరూషలేముకు తిరిగి రావటం
21 రాజు యోవాబుతో ఇలా అన్నాడు: “చూడు. నేను మాట ఇచ్చిన విధంగా చేస్తాను. యువకుడైన అబ్షాలోమును దయచేసి తీసుకొని రా.”
22 యోవాబు తన ముఖం నేలనుతాకి సాష్టాంగపడి నమస్కరించాడు. రాజైన దావీదుకు ఆశీర్వచనం పలికి, “ఈ రోజు నాపట్ల మీరు ప్రసన్నులైయున్నారని నాకు తెలుసు! ఎందువల్లనంటే నేను అడిగినదంతా నీవు చేశావు!” అని అన్నాడు.
23 యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. 24 అయితే దావీదు రాజు మాత్రం, “అబ్షాలోము తప్పక తన స్వంత ఇంటికి వెళ్లిపోవాలి. అతడు నన్ను చూడటానికి రాకూడదు” అని అన్నాడు. కావున అబ్షాలోము తన స్వంత ఇంటికి వెళ్లిపోయాడు. అబ్షాలోము రాజును చూడటానికి వెళ్లలేక పోయాడు.
పౌలు తాను నిర్దోషినని వాదించటం
26 అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీవు చెప్పుకోదలచింది ఇక చెప్పకోవచ్చు!” అని అన్నాడు. పౌలు తన చేతులెత్తి, తాను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: 2 “అగ్రిప్ప రాజా! ఈ రోజు మీ ముందు నిలుచొని యూదులు నాపై ఆరోపించిన నేరాలు అసత్యమని రుజువు చేసుకోవటానికి అవకాశం కలగటం నా అదృష్టం. 3 మీకు యూదులతో, వాళ్ళ ఆచారాలతో, వాళ్ళు తర్కించే విషయాలతో బాగా పరిచయముంది. కనుక యిది నిజంగా నా అదృష్టం. నేను చెప్పేది మీరు శాంతంగా వినాలని మనవి చేసుకొంటున్నాను.
4 “నేను చిన్ననాటినుండి ఏ విధంగా జీవించానో యూదులందరికీ తెలుసు. నా దేశంలో గడచిన నా బాల్యం మొదలుకొని యెరూషలేములో జరిగిన సంఘటనల దాకా జరిగినదంతా వాళ్ళకు తెలుసు. 5 వాళ్ళు నన్ను ఎన్నో సంవత్సరాలనుండి ఎరుగుదురు. నేను, మన మతంలోని నిష్ఠగల పరిసయ్యుల తెగను అనుసరిస్తూ జీవించానని వాళ్ళకు తెలుసు. కావాలనుకొంటే వాళ్ళే యిది నిజమని సాక్ష్యం చెబుతారు. 6 దేవుడు మన పూర్వికులకు చేసిన వాగ్దానంలో నాకు నమ్మకం ఉంది. అందువల్లే నేను ఈ రోజు ఈ పరీక్షకు నిలబడవలసి వచ్చింది. 7 ఈ వాగ్దానం పూర్తి కావాలని మన పండ్రెండు గోత్రాలవాళ్ళు రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురు చూస్తున్నారు. ఓ రాజా! ఈ ఆశ నాలో ఉండటం వల్లే యూదులు నన్ను నేరస్థునిగా పరిగణిస్తున్నారు. 8 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు?
9 “ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం నా కర్తవ్యంగా భావించాను. 10 నేను యెరూషలేములో చేసింది అదే. ప్రధానయాజకులు యిచ్చిన అధికారంతో నేను చాలామంది పరిశుద్ధుల్ని కారాగారంలో వేసాను. వాళ్ళను చంపటానికి నేను అంగీకారం కూడా తెలిపాను. 11 ఎన్నోసార్లు నేను ఒక సమాజమందిరమునుండి మరొక సమాజమందిరానికి వెళ్ళి వాళ్ళను శిక్షించాను. వాళ్ళతో బలవంతంగా యేసును దూషింపచేసాను. పిచ్చి కోపంతో యితర పట్టణాలకు కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళను హింసించాను.
© 1997 Bible League International