Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
2 యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
నీవు నన్ను స్వస్థపరచావు.
3 సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.
4 దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
5 దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.
6 ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
నేను ఎన్నటికీ ఓడించబడను.
7 యెహోవా, నీవు నామీద దయ చూపావు.
బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
మరి నేను చాలా భయపడిపోయాను.
8 దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
9 “దేవా, నేను మరణించి,
సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.
11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
యోవాబు నేర్పరియైన స్త్రీని దావీదు వద్దకు పంపటం
14 అబ్షాలోమును గూర్చి దావీదు రాజు మిక్కిలి బెంగపెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు. 2 యోవాబు తన దూతలను తెకోవకు పంపి, అక్కడి నుండి ఒక నేర్పరియైన స్త్రీని తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ స్త్రీతో యోవాబు ఇలా అన్నాడు: “దయచేసి నీవు చాలా దుఃఖంలో ఉన్నట్లు నటించు. విషాదసూ చకమైన బట్టలు వేసుకో, అలంకరణ చేసుకోవద్దు. చనిపోయిన, నీకు ప్రియమైన ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా విలపిస్తున్నట్లు ప్రవర్తించు. 3 నేను ఇప్పుడు నీకు చెప్పే మాటలను నీవు రాజు వద్దకు వెళ్లి చెప్పు.” ఈ విధంగా ఆ యుక్తిగల స్త్రీ తో మాట్లాడి, ఆమె రాజుతో ఏమి చెప్పాలో యోవాబు ఆమెకు వివరించాడు.
4 తరువాత తెకోవ నుండి వచ్చిన స్త్రీ రాజు వద్దకు వెళ్లి మాట్లాడింది. ఆమె రాజు ముందు ప్రణమిల్లింది. ఆమె ముఖం నేలకు తాకింది. వంగి నమస్కరించి, “రాజా, నాకు సహాయం చేయండి!” అని ప్రాధేయ పడింది.
5 “ఏమిటి నీ సమస్య?” అని దావీదు రాజు ప్రశ్నించాడు.
ఆ స్త్రీ యిలా చెప్పింది: “నేనొక విధవ స్త్రీని! నా భర్త చనిపోయాడు. 6 నాకు ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరూ పొలాల్లోకి పోయి దెబ్బలాటకు దిగారు. వాళ్లను నివారించటానికి ఒక్కడు కూడా లేక పోయాడు. ఒక కొడుకు, ఇంకొక కొడుకును చంపివేశాడు. 7 ఇప్పుడు కుటుంబమంతా నామీద కత్తిగట్టారు. హత్యకు పాల్పడిన కొడుకును తెమ్మని ఒత్తిడి తెస్తున్నారు. తన సోదరుని చంపిన కారణంగా వారంతా అతనిని చంపుతామంటున్నారు. నా కొడుకును చంపనిస్తే, తన తండ్రికి ఏకైక వారసుడైన వాడు లేకుండా పోతాడు! నా కుమారుడు అగ్నిలో చివరి నిప్పుకణంలాంటివాడు. ఇప్పుడు ఆ చివరి నిప్పుకణం ఆరిపోబోతూవుంది! దానితో మరణించిన నా భర్త పేరు, ఆస్తి నేలపాలవుతాయి.”
8 ఇది విన్న రాజు, “ఇక నీవు ఇంటికి వెళ్లు. నీ విషయాల పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను” అని ఆమెతో అన్నాడు.
9 తెకోవ స్త్రీ రాజుతో, “ఈ విషయంలో వచ్చే పరిణామాలకు, పర్యవసానానికి నిందంతా నామీదే పడుగాక! నా ప్రభువైన రాజా! నీవు, నీ సింహాసనం ఈ విషయంలో ఏదోషమూ ఎరుగరు!” అని చెప్పింది.
10 “నిన్ను గురుంచి ఎవరైనా దీనిగూర్చి నిన్నేమైన అనినయెడల నా వద్దకు తీసుకొనిరా. వాడు మరల నిన్ను ఏమీ అనడు” అని దావీదు రాజు అన్నాడు.
11 అది విన్న ఆ స్త్రీ రాజును ఇలా వేడుకున్నది: “దయచేసి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. హంతకులను శిక్షించాలని చూసే ఆ ప్రజలు నా కుమారునికి కీడుచేయకుండా దేవుడు నివారించగలందులకు ఆయనను ప్రార్థించు.”
దావీదు ఆమెకు ఇలా అభయమిచ్చాడు: “యెహోవా జీవము తోడుగా ఎవ్వడూ నీ కుమారునికి హాని చేయలేడు. నీ కుమారుని తలలోని ఒక్క వెంట్రుక కూడా క్రింద రాలదు.”
పౌలు తన మార్పునుగూర్చి చెప్పటం
6 “నేను డెమాస్కసుకు వెళ్తూ, ఆ పట్టణపు పొలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశంనుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. 7 నేను నేలకూలిపొయ్యాను. నాతో ఒక స్వరం, ‘సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు!’ అని అడిగింది.
8 “‘మీరెవరు ప్రభూ!’ అని నేనడిగాను. ‘నేను నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది నన్నే!’ అని ఆ స్వరం జవాబు చెప్పింది. 9 నాతో ఉన్నవాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థం కాలేదు.
10 “‘నన్నేం చేయమంటారు ప్రభూ!’ అని నేనడిగాను. ‘లేచి డెమాస్కసుకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాక నీవు చేయవలసిన పనులు చెప్పబడతాయి’ అని ప్రభువు అన్నాడు. 11 ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చెయ్యటం వల్ల నాతో ఉన్నవాళ్ళు నన్ను నా చేయి పట్టుకొని డెమాస్కసుకు నడిపించుకు వెళ్ళారు.
12 “అననీయ అనే పేరుగల వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరు అతణ్ణి గౌరవించేవాళ్ళు. అననీయ నా ప్రక్కన నిల్చొని 13 ‘సౌలా! నా సోదరా! నీకు దృష్టి కలుగుగాక!’ అని అన్నాడు. తక్షణం నేను చూడగలిగాను.
14 “ఆ తదుపరి అతడు, ‘మన పూర్వికులు పూజించిన దేవుడు, తాను చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటిమాటలు వినటానికి నిన్ను ఎన్నుకొన్నాడు. 15 నీవు చూసినవాటిని గురించి, విన్నవాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు. 16 ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.
17 “నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది. 18 ఆ దర్శనంలో ప్రభువు, ‘త్వరగా లే! వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు’ అని అనటం విన్నాను.
19 “నేను, ‘ప్రభూ! నేను యూదుల ప్రతి సమాజమందిరంలోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు. 20 నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్నవాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను.
21 “అప్పుడు ప్రభువు నాతో, ‘వెళ్ళు! నిన్ను దూరంగా యూదులు కానివాళ్ళ దగ్గరకు పంపుతాను’ అని అన్నాడు.”
© 1997 Bible League International