Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 124

దావీదు యాత్ర కీర్తన.

124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
    ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
    ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
    వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
    మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
    మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.

యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
    మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.

మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
    వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
    భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.

దానియేలు 1

దానియేలు బబులోనుకు తీసుకొని పోబడుట

బబులోనురాజైన, నెబుకద్నెజరు తన సైన్యంతో యెరూషలేముకు వచ్చి దానిని చుట్టుముట్టాడు. ఇది యెహోయాకీము యూదాకు రాజుగానున్న మూడవ సంవత్సరం[a]లో జరిగింది. ప్రభువు యూదారాజైన యెహోయాకీమును ఓడించడానికి, దేవుని ఆలయంనుంచి అన్ని వస్తువులను తీసుకొని వెళ్ళడానికి నెబుకద్నెజరును అనుమతించాడు. అతడు ఆ వస్తువులను తన విగ్రహ దేవతలున్న ఆలయములో ఉంచాడు.

తర్వాత నెబుకద్నెజరు అష్పెనజుకు (అష్పెనజు రాజు కొలువులోని నపుంసకులలో ప్రముఖుడు), “కొందరు యూదులను తన ఇంటికి తీసుకు రమ్మని” చెప్పాడు. కొన్ని ప్రసిద్ధ కుటుంబాలనుంచి, ఇశ్రాయేలీయుల రాజకుటుంబంనుంచి ఆరోగ్యవంతులైన యౌవన యూదులను తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఎలాంటి లోపము తమ దేహాలమీద లేనివారు, అందమైన, చురుకైనవారు, తేలికగా విషయాలు నేర్చుకునేవారు, రాజగృహములో సేవ చేయ సామర్థ్యముగల యువకులను ఎన్నుకోమన్నాడు. ఆ ఇశ్రాయేలు యువకులకు కల్దీయుల భాషను, వ్రాతలను నేర్పుమని రాజు అష్పెనజుకు ఆజ్ఞాపించాడు.

నెబుకద్నెజరు ఆ యువకులకు ప్రతిరోజు రాజు తిని, త్రాగే ఆహారము, ద్రాక్షామద్యం ఇప్పించాడు. ఇశ్రాయేలుకు చెందిన ఆ యువకులు మూడేళ్లపాటు తర్ఫీదు పొందాలని రాజు ఆదేశించాడు. మూడేళ్ల తర్వాత, వారు బబులోను రాజ నగరులో ప్రవీణులుగా ఉంటారు. ఆ యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు యూదా దేశానికి చెందినవారు. తర్వాత అష్పెనజు యూదానుంచి వచ్చిన ఆ యువకులకు బబులోనీయుల పేర్లు పెట్టాడు. దానియేలుకు బెల్తెషాజరు, మిషాయేలుకు మేషాకు, అజర్యాకు అబేద్నెగో, హనన్యాకు షద్రకు అని పేర్లు పెట్టాడు.

రాజు భుజించే విలువైన ఆహారం, ద్రాక్షామద్యం తీసుకోడానికి వారు ఇష్టపడలేదు. ఆ ఆహారం, మత్తు ద్రాక్షామద్యంతో తమను తాము అపవిత్రం చేసుకోవటం దానియేలుకు ఇష్టము లేక దానిని తప్పించమని అష్పెనజు అనుమతి కోరాడు.

దానియేలుపట్ల అష్పెనజు మంచిగాను, దయతోను ఉండేటట్లు దేవుడు చేశాడు. 10 కాని అష్పెనజు దానియేలుతో, “రాజైన నా యజమానికి భయపడుతున్నాను. ఈ ఆహారము, ద్రాక్షామద్యం మీ కిమ్మని రాజు నాకాజ్ఞాపించాడు. మీరు ఈ ఆహారం భుజించకపోతే, జబ్బుగాను బలహీనంగాను కనబడతారు. మీ వయసువారైన ఇతర యువకులతో పోల్చితే మీరు తక్కువగా కనిపిస్తారు. రాజు ఇది చూచి నా మీద కోపగిస్తాడు. ఒకవేళ నా తలను కూడా తీసివేస్తాడు” అని అన్నాడు.

11 దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై అష్పెనజుచే నియమించబడిన సంరక్షకునితో దానియేలు ఇలా అన్నాడు: 12 “పది రోజులపాటు మాకు ఈ పరీక్ష విధించు. తినడానికి కాయగూరలు, త్రాగడానికి మంచినీళ్లు తప్ప మరేమీ ఇవ్వవద్దు. 13 పది రోజుల తర్వాత, రాజు నియమించిన ఆహారంతిన్న ఇతర యువకులతో మమ్మల్ని పోల్చి చూడు. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో నీవే ఆలోచించి నీ సేవకులమైన మాకు ఏమి చేయాలని నీ నిర్ణయమో అలాగే చెయ్యి” అని అన్నాడు.

14 అందువల్ల దానియేలును, హనన్యాను, మిషాయేలును, అజర్యాను పదిరోజులు పరీక్షించడానికి ఆ సంరక్షకుడు సమ్మతించాడు. 15 పదిరోజుల తర్వాత, దానియేలు మరియు అతని మిత్రులు రాజు ఆహారంతిన్న ఇతర యువకులకంటె ఆరోగ్యంగా కనిపించారు. 16 అందువల్ల రాజు నియమించిన ప్రత్యేక ఆహారానికి బదులుగా, కాయగూరలు, మంచినీళ్లు దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు ఆ సంరక్షకుడు ఇస్తూ వచ్చాడు.

17 దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు వివేకం, పలు విధాలైన వ్రాతలు, శాస్త్రాలు నేర్చుకునే జ్ఞానము, సామర్థ్యము దేవుడు ప్రసాదించాడు. అన్ని విధాలైన దర్శనాలు, స్వప్నాలు దానియేలు గ్రహించుకోగలిగాడు.

18 ఆ యువకులందరూ మూడేళ్లపాటు మంచి శిక్షణ పొందాలని రాజు ఆదేశించాడు. ఆ గడువు తీరిన తర్వాత, అష్పెనజు ఆ యువకుల్ని రాజైన నెబుకద్నెజరు వద్దకు తీసుకువెళ్లాడు. 19 రాజు వారితో మాట్లాడాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకంటె ఇతర యువకులెవ్వరూ గొప్పగా లేకపోవడాన్ని రాజు కనుగొన్నాడు. అందువల్ల ఈ నలుగురు యువకులు రాజు ఆస్థానంలో నిలువగలిగారు. 20 ప్రతిసారి రాజు వారిని యేదో ఒక ముఖ్య విషయం అడగగానే, వారు మంచి గ్రహింపు, వివేకం ప్రదర్శించేవారు. తన రాజ్యంలో ఉన్న జ్ఞానవంతులందరికంటెను, ఇంద్ర జాలకులందరికంటెను, వారు నలుగురు పదిరెట్లు ఎక్కువగా ఉన్నారని రాజు గ్రహించాడు. 21 అందువల్ల దానియేలు, కోరెషు రాజయిన మొదటి సంవత్సరం[b] వరకు రాజు ఆస్థానంలో కొనసాగాడు.

లూకా 1:46-55

మరియ పాడిన భక్తి గీతం

46 మరియ ఈ విధంగా అన్నది:

47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
    దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
    ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
    నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
    ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
    గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
    దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
    ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
    అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International