Revised Common Lectionary (Complementary)
దావీదు యాత్ర కీర్తన.
124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
8 మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
4 జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని
నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా.
5 మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి.
అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి.
6 వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి.
సరైన విషయాలు నేను మీకు చెబుతాను.
7 నా మాటలు సత్యం.
చెడు అబద్ధాలు నాకు అసహ్యం.
8 నేను చెప్పే విషయాలు సరైనవి.
నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు.
9 తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి.
తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు.
10 నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది.
ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది.
11 జ్ఞానము ముత్యాలకంటె విలువగలది.
ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది.
జ్ఞానము విలువ
12 “నేను జ్ఞానాన్ని,
నేను మంచి తీర్పుతో జీవిస్తాను.
తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు.
13 ఒక మనిషి యెహోవాను గౌరవిస్తే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు.
నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను.
చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం.
14 కాని మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను.
తెలివిని, శక్తిని నేను వారికి ఇస్తాను!
15 రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు.
న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు.
16 భూమిమీద ప్రతి మంచి పాలకుడూ తన క్రింద ఉన్న
ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు.
17 నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను.
నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు.
18 నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి.
నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను.
19 నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి.
నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి.
20 నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను.
సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను.
21 నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను.
అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను.
15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.
© 1997 Bible League International