Revised Common Lectionary (Complementary)
24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది.
మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి.
మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి.
నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం[a] ఆ సముద్రంలో ఆడుకుంటుంది.
27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి.
దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు.
మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు
అవి భయపడిపోతాయి.
వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి.
మరియు అవి మరల మట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి.
భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.
31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక.
యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు
అది వణకుతుంది.
ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు
వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.
33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను.
నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను స్తుతించు!
11 స్త్రీలారా మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. కానీ మీరు భయపడాలి. స్త్రీలారా, ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ మీరు దిగులుపడాలి. మీ అందమైన వస్త్రాలు తీసివేసి, విచార వస్త్రాలు ధరించండి. ఆ బట్టలు మీ నడుములకు చుట్టుకోండి. 12 దుఃఖంతో నిండిన మీ రొమ్ములను ఆ దుఃఖవస్త్రాలతో కప్పుకొనండి. మీ పొలాలు ఖాళీగా ఉన్నాయి గనుక ఏడ్వండి. మీ ద్రాక్ష తోటలు ఒకప్పుడు ద్రాక్ష పండ్లు ఇచ్చాయి కానీ ఇప్పుడు అవి ఖాళీ. 13 నా ప్రజల భూమి కోసం ఏడ్వండి, ముళ్లకంపలు, గచ్చ పొదలు మాత్రమే అక్కడ పెరుగుతాయి గనుక ఏడ్వండి. పట్టణం కోసం, ఒకప్పుడు ఆనందంతో నిండిన అన్ని గృహాల కోసం ఏడ్వండి.
14 ప్రజలు రాజధాని నగరం విడిచి పెట్టేస్తారు. రాజ భవనం, గోపురాలు ఖాళీగా విడిచిపెట్టబడతాయి. ప్రజలు ఇండ్లలో నివసించరు. వారు గుహలలో నివసిస్తారు. అడవి గాడిదలు, గొర్రెలు పట్టణంలో నివసిస్తాయి. పశువులు అక్కడ గడ్డి మేయటానికి వెళ్తాయి.
15-16 దేవుడు పైనుండి తన ఆత్మను మనకు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుంది. ఇప్పుడు దేశంలో మంచి లేదు. అది ఒక అరణ్యంలా ఉంది. కానీ భవిష్యత్తులో ఆ అరణ్యం కర్మెలు దేశంలా ఉంటుంది, అక్కడ న్యాయమైన తీర్పు వుంటుంది. మరియు కర్మెలు పచ్చని అడవిలా ఉంటుంది. అక్కడ మంచితనం ఉంటుంది. 17 ఆ మంచితనం శాంతి, భద్రతలు తెచ్చిపెడ్తుంది.
పరిశుద్ధాత్మ మరియు మానవ స్వభావం
16 కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు. 17 ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకొంటున్నదానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్నదాన్ని చెయ్యలేకపోతున్నారు. 18 కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు.
19 మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము, 20 విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు, 21 అసూయ, త్రాగుబోతుతనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. 22 కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, 23 వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. 24 యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు. 25 మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము.
© 1997 Bible League International