Revised Common Lectionary (Complementary)
పౌలు మరియు సీల కారాగారంలో
16 ఒకసారి మేము ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా ఒక బానిస పిల్ల కనిపించింది. ఆమెకు సోదె చెప్పే శక్తిగల “పుతోను” అనే దయ్యము పట్టివుంది. ఆమె సోదె చెప్పటం వల్ల ఆమె యజమానులు చాలా డబ్బు గడించారు. 17 ఆమె పౌలును, మమ్మును అనుసరిస్తూ, “వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. రక్షణకు దారి చూపుతున్నారు” అని బిగ్గరగా కేక పెట్టేది. 18 ఇలా చాలా రోజులు చేసింది. చివరకు పౌలు విసుగు చెంది వెనక్కి తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో, “యేసు క్రీస్తు పేరిట ఆమెను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే దయ్యం ఆమెను వదిలివేసింది.
19 ఆ బానిస పిల్ల యజమానులు తాము డబ్బు చేసుకొనే ఆశ నశించిందని గ్రహించి పౌలును, సీలను బంధించారు. 20 వాళ్ళను బహిరంగంగా రోమా సైనికాధికారుల ముందుకు పిలుచుకు వచ్చి, “వీళ్ళు యూదులు. మన పట్టణంలో అలజడి లేపుతున్నారు. 21 రోమా పౌరులుగా మనము ఆచరించలేని ఆచారాలను వాళ్ళు మనకు చెబుతున్నారు. వాటిని అంగీకరించటం కూడా న్యాయం కాదు” అని అన్నారు.
22 ప్రజల గుంపు పౌలు, సీలల మీద పడింది. అధికారులు వాళ్ళ దుస్తుల్ని చింపి కొట్టమని ఆజ్ఞాపించారు. 23 చావకొట్టి, వాళ్ళను చెరసాలలో పడవేస్తూ, “వీళ్ళను జాగ్రత్తగా కాపలా కాయండి” అని ఆ చెరసాల అధికారితో చెప్పారు. 24 కనుక ఆ చెరసాల అధికారి వాళ్ళ కాళ్ళను బొండ కొయ్యకు గల రంధ్రాల్లో బిగించి లోపలి గదిలో పడవేసాడు.
25 అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బంధీలు వింటున్నారు. 26 అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళకు కట్టిన కట్లు తెగిపొయ్యాయి. 27 చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. 28 కాని పౌలు, “హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే ఉన్నాము” అని బిగ్గరగా అన్నాడు.
29 ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తికొంటూ వెళ్ళి వణకుతూ పౌలు, సీలల కాళ్ళ మీద పడ్డాడు. 30 ఆ తర్వాత వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు.
31 వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది” అని సమాధానం చెప్పారు. 32 ఆ తరువాత వాళ్ళు ప్రభువు సందేశాన్ని అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికీ చెప్పారు. 33 ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ్ళను పిలుచుకు వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని యింట్లోనివాళ్ళు బాప్తిస్మము పొందారు. 34 ఆ తరువాత అతడు వాళ్ళను తన యింటికి పిలుచుకు వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. అతడు, అతని యింట్లోనివాళ్ళు తాము దేవుణ్ణి విశ్వసించటం మొదలు పెట్టినందుకు చాలా ఆనందించారు.
97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
2 దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
3 యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
4 ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
5 యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
6 ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!
7 మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
8 సీయోనూ, విని సంతోషించుము!
యూదా పట్టణములారా, సంతోషించండి!
ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
9 సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.
12 “జాగ్రత్త, నేను త్వరలో రాబోతున్నాను. ప్రతి ఒక్కనికి అతడు చేసేవాటిని బట్టి నా దగ్గరున్నదాన్ని బహుమతిగా ఇస్తాను. 13 ఆదియు, అంతమును[a] నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే, ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే.
14 “జీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్ళే అర్హత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు.
16 “నేను యేసును. ఈ విషయాన్ని సంఘాలకు చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను వేరును, దావీదు వంశాంకురాన్ని, ప్రకాశించే వేకువచుక్కను.”
17 ఆత్మ మరియు పెళ్ళికుమార్తె “రండి” అని అంటున్నారు. ఇది విన్నవాడు “రండి!” అనాలి. దాహంతో ఉన్నవాళ్ళు రావచ్చును. ఇష్టమున్నవాడు ఉచితంగా లభించే జీవజలాన్ని త్రాగవచ్చు.
20 యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు ఆయన, “ఔను, నేను త్వరలోనే వస్తాను” అని అంటున్నాడు.
ఆమేన్! రండి యేసు ప్రభూ!
21 యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.
20 “నా ప్రార్థన వాళ్ళ కోనం మాత్రమే కాదు. వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్యసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. 21 తండ్రీ! నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం చేయుము. 22 మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని, నీవు నాకిచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను. 23 నేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది.
24 “తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను ప్రేమించావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు చూడాలని నా అభిలాష. 25 నీతి స్వరూపుడవగు తండ్రీ! ప్రపంచానికి నీవెవరవో తెలియక పోయినా నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు. 26 నీవెవరవో వాళ్ళకు తెలియచేసాను. తెలియచేస్తూ ఉంటాను. నాయందు నీకున్న ప్రేమ వాళ్ళయందు కూడా ఉండాలని, వాళ్ళలో నేను స్వయంగా ఉండాలని నా ఉద్దేశ్యం.”
© 1997 Bible League International